వీడియో పొక్కింది కాబట్టి పిన్నెల్లిపై కేసైంది.. లేకుంటే ?
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిదే ఇప్పుడు హాట్ టాపిక్, ఈవీఎంలను ధ్వంసం చేసిన తీరు, అడ్డుకున్న వారిని వేలు పెట్టి హెచ్చరించన తీరు చర్చగా మారింది.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వసం చేసిన విషయం రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండి, ఆయన ఈ విధ్వంసానికి పాల్పడటం ఏమిటనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెంటచింతల, పాల్వాయిౖ రెల్వేగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వసం చేసినట్టు రికార్డు అయిన వీడియో బయటకు పొక్కేంత వరకు ఈ విషయం బయట ప్రపంచానికి తెలియదు. ఈ వీడియో బయట ప్రపంచానికి తెలిసింది కాబట్టే ఎన్నికల సంఘం, పోలీసులు, అధికార యంత్రాంగం కదలింది. అలా కదలాల్సి వచ్చింది. కదలే తట్టు ఆ వీడియో చేసింది. దానిపైన విమర్శలు వెల్లువెత్తడంతో చర్యలు చేపట్టాల్సిన పరిస్థితులు అధికారులకు తప్పలేదనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది.
ఒక వేళ వీడియో బయట ప్రపంచానికి తెలియకుండా ఉండి ఉంటే, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేరస్తుడుగా మారేవాడు కాదని, దర్జాగా, దర్పంగానే తిరిగే వాడనే చర్చకూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈవీఎంల విధ్వంసానికి పాల్పడి, పోలింగ్ బూత్‌లోని అధికారులు సైతం భయకంపితులను చేసింది. అకస్మాత్తుగా ఘటన చోటు చేసుకోవడంతో వారు కూడా నిశ్చేష్టులయ్యారు. అయితే ఈ ఘటనపై అదే పోలింగ్ బూత్‌లోని అధికారులు వీడియోలు రికార్డు చేసినట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది, కానీ వారెవ్వరు ఆ ఘటనపై ఫిర్యాదులు చేసేందుకు సాహసించ లేక పోయారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకు ఆ అధికారులు ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ సంఘటనను తీసుకెళ్లలేదనే దానిపై విమ్శలు వెల్లవెత్తుతున్నాయి. ధ్వంసమైన ఈవీఎంకు బదులుగా మరొక ఈవీఎంలను ఓటర్లకు అందుబాటులో ఉంచారే తప్ప ఫిర్యాదు చేయలేదనే విమర్శలు ఉన్నాయి.
పెద్ద ఎత్తున మోనటరింగ్
మే 13 ఎన్నికల సందర్భంగా పర్యవేక్షణకు పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. వెబ్ క్యాస్టింగ్‌ను ఎప్పటికప్పుడు మోనటరింగ్ చేసేందుకు ప్రత్యేకంగా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది అధికారులు, సిబ్బందిని అందుకు కోసం ప్రత్యేకంగా నియమించారు. దీంతో పాటుగా పోలింగ్ కేంద్రాల లోపల, బయట సీసీ కెమేరాలను కూడా ఏర్పాటు చేశారు. తద్వారా వెబ్ క్యాస్టింగ్‌ను మోనిటర్ చేపట్టారు. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో జీరో వయోలెన్స్ లక్ష్యంగా ఈ ఏర్పాట్లన్నీ ఎన్నికల కమిషన్ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూ, ఏదైనా సమస్య వస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం పంపేలా కూడా ఏర్పాట్లు చేశారు. కానీ పిన్నెల్లి వ్యవహారంపై ఉలుకూ పలుకూ లేక పోవడం చర్చగా మారింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంల ధ్వసం తీరు అంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలో రికార్డు అయింది. అది జరుగుతున్నప్పుడే కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎన్నికల అధికారులకు తెలిసి పోతుంది. ఒక వేళ ఆ సమయంలో వారికి సాంకేతిక అంతరాయం ఏర్పడినా తర్వాత అయినా తెలిసే అవకాశం నూరు శాతం ఉంది. ప్రతి బూత్‌లో ఒక వీడియో గ్రాఫర్‌ను ఏర్పాటు చేశారు. వారి ద్వారా అయినా ఆ వీడియోను చూడొచ్చు. కానీ అలా కూడా చేయలేదు.
ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల అధికారులు వీడియో ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది. పరిశీలించిన తర్వాత ఎక్కడ గొడవలు చోటు చేసుకున్నాయి, గొడవలకు కారకులు ఎవురు తదితర అంశాలను పరిశీలించి వారిపైన చర్యలు తీసుకోవాలి. కానీ అలాంటి చర్యలేమీ తీసుకోలేదు. ఇదే అంశంపై ప్రముఖ న్యాయవాది, పౌరహక్కుల సంఘం నేత పిచ్చుకా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సారి ఎన్నికల నిర్వహణ అంతా అయోమయం గందరగోళంగా మారిందన్నారు. సజావుగా ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం వైఫల్యం అయిందని అభిప్రాయపడ్డారు. అన్ని చోట్ల సీసీ కెమేరాలు ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఏమి జరుగుతోందనేది పాయింట్ టు పాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కూర్చున్న వారికి వెంటనే తెలిసి పోతుంది. దాని ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఈవీఎంను ధ్వసం చేసినట్లు వీడియో బయటకు తెలిసేంత వరకు అధికారులు చర్యలకు ఉపక్రమించ లేదంటే ఎన్నికల అధికారులు ఏమి చేస్తున్నారనేది పెద్ద ప్రశ్నగా మారిందన్నారు.
Next Story