పిన్నెల్లి బ్రదర్స్ పారిపోయారా! మాచర్లలో టాక్ ఇదే
x

పిన్నెల్లి బ్రదర్స్ పారిపోయారా! మాచర్లలో టాక్ ఇదే

ఎన్నికల పోలింగ్ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తీవ్ర హింసాత్మక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.


ఎన్నికల పోలింగ్ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తీవ్ర హింసాత్మక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర డీజీపీ, సీఎస్‌ను ఢిల్లీకి రప్పించి వివరణ తీసుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి హింసను ఒకమోస్తరుగా తగ్గించారు. అంతేకాకుండా అనేక మంది నేతలను గృహనిర్బంధంలో కూడా ఉంచారు పోలీసులు. వారిలో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి కూడా ఉన్నారు. వారు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా వారి నివాసం దగ్గర పోలీసులు భారీగా కాపలా ఉన్నారు.

అజ్ఞాతంలోకి పిన్నెల్లి బ్రదర్స్

పోలీసులు గృహ నిర్బంధంలో ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరూ కూడా గురువారం రాత్రి నుంచి కనిపించడం లేదని సమాచారం. దీంతో వారు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసు బలగాలు ఇళ్ల బయట కాపలా ఉన్నప్పటికీ వాళ్ల కళ్లుకప్పి ఎలా తప్పించుకున్నారన్నది తెలియడం లేదని అక్కడి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వారికి ఎప్పుడూ రక్షణగా ఉండే గన్‌మెన్‌లను కూడా వారు వెంట తీసుకెళ్లలేదని, ఈ మేరకు సమాచారన్ని గన్‌మెన్‌లు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలిపారు. దాంతో ఈ విషయం బహిర్గతమయింది.

ఆ భయంతోనే అజ్ఞాతం

పోలింగ్ తర్వాత కారంపూడిలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య భారీ ఘర్షణ జరిగింది. వీటికి సంబంధించి పలువురిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి కూడా తీసుకున్నారు. ఆ కేసులో భాగంగానే తమను కూడా అరెస్ట్ చేస్తారన్న భయంతోనే పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా పోలింగ్ ఫలితాలు వెలువడ్డాక భారీగా దాడులు చేయడానికి కూడా పిన్నెల్లి బ్రదర్స్ కుట్రలు పన్నారని, అందుకోసమే భారీగా నాటు బాంబులు, సోడా బాంబులు, రాడ్లు, కర్రలను సేకరించి ఉన్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరి వారి అజ్ఞాతవాసంపై పోలీసు శాఖ త్వరలో క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Read More
Next Story