దేశ చరిత్రపై చెరగని సంతకం పింగళి
x

దేశ చరిత్రపై చెరగని సంతకం పింగళి

మన దేశ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య.. జెండాను రూపొందించడానికి ఎంత కష్టపడ్డారో తెలుసా.. ఆయన గురించి మరెన్నో తెలియని విషయాలు..


జాతీయ జెండా.. ప్రతి దేశానికి ఇది చాలా ప్రత్యేకం. మన దేశానికి కూడా మువ్వన్నెల పతాకం అలానే. ఆ త్రివర్ణ పతాకాన్ని చూసిన ప్రతిసారీ ఈ దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో చేసిన త్యాగాలు, పోరాటాలు, బానిస సంకెళ్లను తెంచుకున్న తర్వాత ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో మన భారత దేశం ఎదుర్కొన్న ఒడుదుడుకులు అన్నింటినీ తలచుకుంటూ.. మన దేశం సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ప్రతి భారతీయుడు గర్విస్తాడు. ఆ గర్వానికి, మన దేశ గౌరవానికి చిహ్నమైన త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన వ్యక్తి ఒక ఆంధ్రుడు. ఆయన పేరే పింగళి వెంకయ్య. ఆయన పేరు ఇప్పటి తరంలో ఎందరికో తెలియకపోయినా.. భారత దేశ పతాక రూపకర్తగా దేశ చరిత్రపై చెరగని సంతకం చేశారాయన.
భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీని మనం ఎంతలా గుర్తుంచుకున్నామో ఈ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యను కూడా అంతే గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మనకుంది. జాతీయ పతాకాన్ని రూపొందించడానికి పింగళి వెంకయ్య ఒక రోజో, నెలో, ఏడాదో కష్టపడలేదు. మన దేశానికి సరైన జాతీయ పతాకాన్ని రూపొందించడానికి ఆయన తన జీవితంలో సుమారు 20 ఏళ్ల కాలాన్ని వెచ్చించారు. 1906-1922 మధ్య ఆయన అనేక జాతీయోధ్యమాల్లో పాల్గొన్నారు.
ఆ సమయంలోనే ఆయనకు మన జాతికి, మన జాతి నిర్వహిస్తున్న ఉద్యమాలకు ఒక పతాకం ఉండాలన్న ఆలోచనను వ్యక్తం చేశారు. ఆ ఆలోచనతోనే ఆయన జాతీయ జెండాల రూపకల్పన ప్రారంభించారు. 1913 నుంచి కాంగ్రెస్ నిర్వహించిన ప్రతి సమావేశంలో ఆయన జాతీయ జెండా ప్రస్తావన తీసుకొచ్చారు. 1916లో పింగళి వెంకయ్య రూపొందించిన జెండాను లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారి ఎగరవేశారు.

అందులో రాట్నం బొమ్మను పెట్టాలని 1919లో జలంధర్ వాస్తవ్యులు ‘లాలా హన్స్ రాజ్’ సూచించారు. అదే సమయంలో జెండాను తెలుపు, ఆకుపచ్చ, కాషాయం రంగులతో రూపొందించాలని గాంధీ.. వెంకయ్యను కోరారు. గాంధీ సూచనల మేరకు వెంకయ్య.. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ(పైనుంచి కిందకు) రంగులతో మధ్యలో రాట్నంతో జెండాను రూపొందించారు. ఈ జెండాలో రాట్నం గుర్తు దేశంలోని రైతు, గ్రామ జీవనాన్ని, కార్మికత్వాన్ని స్పురింపజేస్తుందని ఆయన తెలిపారు. ఆ తర్వాత 1947 జూలై 22న మన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ.. జాతీయ జెండాలో రాట్నం గుర్తును తొలగించి అశోక చక్రాన్ని పెడుతున్నట్లు రాజ్యసభలో తీర్మానం చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు మనం చూస్తున్న జాతీయ జెండానే చలామణిలో ఉంది.
జెండా కోసం వెంకయ్య శ్రమ
మన దేశానికి జాతీయ జెండాను రూపొందించడానికి పింగళి వెంకయ్య ఎంతో శ్రమించారు. ఉద్యోగాలు చేస్తున్నా మనసు మాత్రం దేశభక్తి, జాతీయ జెండా వైపు లాగింది. తన మనసు చూపిన మార్గాన్నే ఎంచుకున్న వెంకయ్య.. జెండా రూపకల్పన కోసం ఎన్నో దేశాల చరిత్రలు చదివారు. అందుకోసం ఆయన ఇతర దేశాల భాషలను కూడా నేర్చుకున్నారు. 1916లో ఆయన ‘‘భారత దేశానికి ఒక జాతీయ పతాకం’’ అనే ఓ గ్రంథాన్ని ఇంగ్లీషులో రాశారు. అందులో ఆయన రూపొందించిన 24 రకాల జెండాల నమూనాలు ఉన్నాయి. వాటితో పాటు ఆ జెండాలు వేటిని ప్రతిబింబిస్తాయి అన్న అంశాలను కూడా ఆయన పొందుపరిచారు. దేశ పౌరులంతా దేశానికి విముక్తి లభిస్తే చాలనుకుంటూ ఉద్యమాలు చేస్తున్న ఆ సమయంలో భారత దేశానికి స్వాతంత్ర్యం తప్పక వస్తుందని విశ్వసించి, మన దేశానికంటూ ఒక చిహ్నం ఉండాలని భావించి జాతీయ జెండా ఆలోచనను ముందుకు తీసుకెళ్లిన మహానుభావుడు పింగళి వెంకయ్య.. ఒక ఆంధ్రుడు.
పింగళి వెంకయ్య 2 ఆగస్ట్ 1876న ఇప్పటి మచిలీపట్నంలోని భట్లపెనుమర్రు ప్రాంతంలో జన్మించారు. 19 ఏళ్లకే జాతీయ ఉద్యమాల్లో ఎంతో దూకుడుగా పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో జరిగిన రెండవ బోయర్ యుద్ధంలో కూడా ఆయన తన 19వ ఏటే పాల్గొన్నారు. అప్పుడు ఆయన గాంధీని కలిశారు. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఎంతో కాలం కొనసాగింది. ఆయన 4 జూలై 1963న 86 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.
Read More
Next Story