పాఠశాలల రద్దును నిరసిస్తూ అంబేడ్కర్‌కు వినతి పత్రం
x

పాఠశాలల రద్దును నిరసిస్తూ అంబేడ్కర్‌కు వినతి పత్రం

ప్రభుత్వ రంగ స్కూళ్లను మూసివేయడానికి సిద్ధపడటం దారుణం. తక్షణం ఈ వైఖరిని మానుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.


రాష్ట్రంలో విద్యారంగాన్ని దెబ్బతీయడం, ప్రభుత్వ స్కూళ్లను మూసి వేయడాన్ని నిరసిస్తూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించి నిరసనను తెలియజేశారు.

117, 128 జీవోలను రద్దు చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం రద్దు చేసినట్టు నటించి, దొడ్డి మార్గంలో మెమోను తెచ్చి విద్యారంగాన్ని నిలువులోతు గోతిలో పూడ్చేందుకు సిద్ధపడిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రవి, ఐద్వా జిల్లా కార్యదర్శి పి సాయిలక్ష్మి, సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రమణ్యం, యుటిఎఫ్‌ రాష్ట్ర నేతలు జీవీ రమణ, ఎస్‌ఎస్‌ నాయుడు, ముత్యాల రెడ్డి, మణికంఠ తదితరులు తీవ్రస్థాయిలో విమర్శించారు.
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా గత ప్రభుత్వ హయాంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యారంగం నేడు అంతకంటే ఎక్కువ సమస్యలను ఎదుర్కోవాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధన గురించి ఆంధ్ర రాష్ట్రమంతా ఉపన్యాసాలు చెబుతున్న కూటమి నేతలు ఆయన ఆశయాలకు విరుద్ధంగా ప్రభుత్వ రంగ స్కూళ్లను మూసివేయడానికి సిద్ధపడటం దారుణమని, తక్షణం ఈ వైఖరిని మానుకోవాలని కోరారు. డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ జయంతి రోజున పాఠశాలల రద్దును నిరసిస్తూ అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం ద్వారా నిరసనను తెలియజేయాలని భావించామని అన్నారు.
తిరుపతి జిల్లాలో 900 కు పైగా పాఠశాలలు మూసివేయబడుతున్న పరిస్థితి అన్యాయమని, దీనిని తక్షణం మానుకోవాలని, కలెక్టర్‌ నుంచి ఎంఈఓ వరకు ఇదే పనిపై పోటీలు పడి ఒత్తిడి తెస్తున్నారని, ఇది సమంజసమైంది కాదని, తక్షణం ఈ వైఖరిని మానుకోకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా తల్లిదండ్రుల సహకారంతో, ప్రజల సహకారంతో చేపట్టాల్సి వస్తుందని ప్రజాసంఘాల ఐక్యవేదిక నేతలు అంబేడ్కర్‌ విగ్రహం సాక్షిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు టి సుబ్రహ్మణ్యం ఎస్‌ జయచంద్ర, వేణుగోపాల్, బాలాజీ, బుజ్జి, మోహన్‌ నాయుడు, యుటిఎఫ్‌ నేతలు దండు రామచంద్రయ్య, అవనిగడ్డ పద్మజ, మోహన్‌ బాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Read More
Next Story