కూటమి మేనిఫెస్టోపై ఒకరి ఫొటో మాయం.. అంతా మోసమంటున్న పేర్ని నాని!
x

కూటమి మేనిఫెస్టోపై ఒకరి ఫొటో మాయం.. అంతా మోసమంటున్న పేర్ని నాని!

చంద్రబాబు, జనసేన మ్యానిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా బీజేపీ నేత ఇష్టపడలేదు. అందుకు కారణం ఏంటి? ఈ మేనిఫెస్టోపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.


టీడీజీ-జనసేన-బీజేపీ కూటమిగా ఆంధ్ర ఎన్నికల్లో తలపడటానికి సిద్ధమయ్యాయి. కానీ ఈ కూటమిలో వేరు కుంపట్లు మండుతున్నాయన్న ప్రచారాలు మాత్రం మొదటి నుంచి జోరుగా సాగుతున్నాయి. మంగళవారం టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి విడుదల చేసిన కూటమి మేనిఫెస్టో దీనిని తేటతెల్లం చేస్తోంది. కూటమిలో విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్ని బలపరుస్తోంది. మేనిఫెస్టోపై ఎక్కడా బీజేపీకి సంబంధించిన నేత ఫొటో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. తాజాగా దీనిపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్నినాని కూడా ఘాటుగా స్పందించారు. కూటమి కూలుతోందని, చంద్రబాబు మోసంలో తాను భాగం కాలేనని ఒక పార్టీ వారు దూరంగా ఉంటున్నారని పేర్నినాని కీలక విమర్శలు చేశారు.


అసలు వివాదానికి కారణం ఏంటి?

మంగళవారం కూటమి మేనిఫెస్టోను విడుదల చేయడానికి మూడు పార్టీల నేతలు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఈ సమావేశానికి బీజేపీ తరపున సిద్దార్థ్త నాథ్‌సింగ్ కూడా హాజరయ్యారు. కాస్త ఆలస్యమైనా మేనిఫెస్టోను విజయవంతంగా విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టో కాపీని పట్టుకుని వేదికపై చంద్రబాబు, పవన్ నిల్చున్నారు. వారి పక్కనే నిలబడ్డ సిద్ధార్థ్ నాథ్ సింగ్ దగ్గర మాత్రం మేనిఫెస్టో కాపీ లేదు. దీంతో టీడీపీ, జనసేన కలిసి సిద్ధం చేసిన మేనిఫెస్టోకు తమకు ఎటువంటి సంబంధం లేదని బీజేపీ సింబాలిక్‌గా చెప్పిందని కొన్ని వర్గాల వారు ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ఒకరు సిద్ధార్థ్‌కు మేనిఫెస్టో కాపీ ఇవ్వడానికి ప్రయత్నించినా దానిని పట్టుకోవడానికి సిద్ధార్థ్ వెనకాడారు. వద్దంటూ సైగలు చేసి మేనిఫెస్టోను ఇస్తున్న వ్యక్తిని పంపించేశారు. ఇప్పుడు ఇదే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మేనిఫెస్టో ఇద్దరిదేనా!

మేనిఫెస్టో విడుదల కార్యక్రమం చూస్తే కూటమి మూడు పార్టీలదైనా మేనిఫెస్టో మాత్రం రెండు పార్టీలదే అన్న అనుమానం కలుగుతుంది. అందుకు బీజేపీ నేత సిద్ధార్థ్ ప్రవర్తన ఒక కారణం అయితే అన్నింటికన్నా విడుదల చేసిన మేనిఫెస్టో బుక్‌లెట్ పెద్ద కారణం. దీనిపై ఎక్కడా కూడా బీజేపీ గుర్తు కానీ, మోదీ ఫొటో కానీ కనిపించలేదు. దీంతో కూటమిలో మూడు పార్టీలు అన్నది పేరుకేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సిద్ధార్థ్ అందుకే నిరాకరించారా!

ఈ కార్యక్రమంలో మేనిఫెస్టోను పట్టుకోవడానికి కూడా బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఇష్టపడలేదు. అందుకు మేనిఫెస్టో బుక్‌లెట్ ప్రధాన కారణం అని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మేనిఫెస్టో‌ బుక్‌లెట్‌పై బీజేపీ గుర్తు, మోదీ గుర్తు ఎక్కడా కనిపించకపోవడం, ఆఖరికి కూటమి సింబల్ కూడా ఎక్కడా లేకపోవడంతో దానిని ముట్టుకోవడానికి కూడా బీజేపీ నేతలు ఇష్టపడలేదని బీజేపీ కార్యకర్తలు కొందరు చెప్తున్నారు. కానీ మేనిఫెస్టోను స్వీకరించడానికి సిద్ధార్థ్ ఎందుకు నిరాకరించారన్నది మాత్రం తెలియదు.

గుర్తు, ఫొటో ఏమీ వద్దని బీజేపీనే చెప్పిందా!

కూటమి మేనిఫెస్టోపై తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని ఘాటుగా స్పందించారు. ‘‘ప్రతిపక్షం తమ మేనిఫెస్టోలో ప్రజలపై హామీల వర్షం కురిపించింది. కానీ గతంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని హామీలను అమలు చేశారు. మేము ప్రతి సంవత్సరం ఇలా డబ్బు సంపాదించి దాన్ని రాష్ట్రాన్ని ఖర్చు పెడతామని చెప్తాం. కానీ ఈయన(చంద్రబాబు) మాత్రం సంపద సృష్టిస్తానంటారు. ఇదేమైనా అక్షయపాత్ర లేదా లంకెబిందెలా.. ఎక్కడి నుంచి వస్తాయి ఈ రేంజ్‌లో ఖర్చు చేయడానికి. రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి తీసుకొస్తారు. ఈ పథకాలు అమలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావో చెప్పాలి కదా. 2014లో ఎలాగైనా ప్రజలను మోసం, దగా చేశావో అదే విధంగా ఇప్పుడు కూడా మోసం చేయడానికి చూస్తున్నారు కదా. ముగ్గురు మేనిఫెస్టో అన్నారు మరి ఒకరి ఫొటో లేదే.. సంతకం చేయడానికి ఆయన ముందుకు రాలేదే.. ఎందుకు? చంద్రబాబు, పవన్ కలిసి ప్రజలను మోసం చేయడానికి రెడీ అయితే దాని నుంచి తనను తప్పించాలని మూడో వ్యక్తి బతిమిలాడుకున్నట్లు ఉన్నారు’’ అంటూ పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

క్లారిటీ ఇచ్చిన సిద్దార్థ

మేనిఫెస్టో‌పై బీజేపీ గుర్తు, పేరు, మోదీ ఫొటో ఏమీ లేకపోవడంపై చలరేగిన వివాదానికి సిద్దార్థ్ నాథ్ సింగ్ వీడియో ఫుల్ స్టార్ పెట్టింది. ఇదే అంశాన్ని నిన్న జరిగిన కార్యక్రమంలో ఓ వ్యక్తి ప్రశ్నించగా టీడీపీ, జనసేన మేనిఫెస్టోకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని సిద్ధార్థ్ తేల్చి చెప్పారు. ‘‘మేము మాత్రమే ఉండి. మేనిఫెస్టోను విడుదల చేస్తే అది మా మేనిఫెస్టో, బీజేపీ మేనిఫెస్టో, జాతీయ మేనిఫెస్టో అవుతుంది. కానీ ఇక్కడ జాతీయ పార్టీ తరపున నేను ఉన్నాను కదా. ఇది టీడీపీ, జనసేన మేనిఫెస్టో. నేను ఇక్కడ ఉన్నాను అంటే.. వారి మేనిఫెస్టోను మేము మద్దతు ఇస్తున్నట్లే. ఇస్తున్నాం కూడా’’అని ఆయన వివరించారు. అయితే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రశ్నలకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ వీడియోతో సమాధానం ఇస్తున్నారు.

Read More
Next Story