‘దమ్ముంటే అదే విషయం చెప్పొచ్చుగా’.. జగన్‌కు పయ్యావుల సవాల్
x

‘దమ్ముంటే అదే విషయం చెప్పొచ్చుగా’.. జగన్‌కు పయ్యావుల సవాల్

జగన్‌పై కూటమి మంత్రి పయ్యావుల కేశవ్ విసుర్లు విసిరారు. అసెంబ్లీకి రావాల్సింది మానుకుని ఢిల్లీ వెళ్తే వచ్చేదేమీ ఉండదన్నారు.


ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకవైపు అధికార పక్షం అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే.. మరోవైపు వైసీపీ అధినేత జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయడం, ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించడం చేస్తున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని వెళ్లిన ప్రతిచోట జగన్ ఘంటాపథంగా వ్యాఖ్యానిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అంధకారం అలముకుందని, ప్రజాస్వామ్యం కనుమరుగైందంటూనే జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారు. ఆ ధర్నాకు విశేష స్పందన లభించింది. ఇండి కూటమి నేతలు పలువురు వచ్చిన జగన్‌తో భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ వ్యవమారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని తమ అభిప్రాయాలను కూడా వెల్లడించారు. ఈ అంశాలన్నింటిపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జగన్‌ను ఛాలెంజ్ చేయడమే కాకుండా రాజకీయ హితబోధ కూడా చేశారు.

దమ్ముంటే అదే మాట చెప్పు

‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా పూర్తికాకుడానే 30కిపైగా ప్రతీకార దాడులు, రాజకీయ హత్యలు జరిగాయని జగన్.. ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఫొటో, వీడియో గ్యాలరీలు నిర్వహించారు. దమ్ముంటే ఆ దాడులకు సంబంధించిన వివరాలు జగన్ బయటపెట్టాలి. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పకుండా ఉంటుంది. మా ప్రభుత్వ పాలనలో తన, మన బేధం చూపకుండా శిక్ష వేస్తాం’’ అని వెల్లడించారు పయ్యావుల. అనంతరం ‘‘మొన్నటి వరకు సరిగా పట్టించుకోని వారంతా ఇప్పుడు పనిగట్టుకుని వచ్చి జగన్ ధర్నాలో పాలుపంచుకుంటున్నారు. వారంతా కూడా ఇండి కూటమి నేతలే. ఇండి కూటమి నేతలతో రహస్య భేటీ నిర్వహించడానికే ఢిల్లీ వెళ్లానని జగన్ ధైర్యంగా చెప్పొచ్చు కదా? ప్రజలపై ప్రేమ ఉన్నట్లు, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్నట్లు వాటి కోసమే నిరసన తెలుపుతున్నట్లు కలరింగ్ ఎందుకో’’ అంటూ ఎద్దేవా చేశారు.

జగన్‌కు పయ్యావుల పాఠాలు

ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌కు పయ్యావుల రాజకీయ పాఠాలు కూడా నేర్పారు. ‘‘జగన్‌కు ప్రతిపక్ష హోదా రావాలంటే మరో పదేళ్లయినా పడుతుంది. జగన్‌కు ప్రజలు ఓటేసి 11 స్థానాల్లో అధికారం అందించారు. అంటే దానర్థం ఢిల్లీ వెళ్లి ధర్నా చేయమని కాదు. అసెంబ్లీకి వచ్చి ప్రజల కష్టాలపై చర్చించమని. కానీ అది మానుకు సింగిల్ కెమెరాతో ప్రెస్‌మీట్లు పెట్టమని కాదు. అభిమానించినా, అవమానించినా నిలదొక్కుకుని నిలబడిన వాళ్లే రాజకీయాల్లో ఉండగలరని జగన్ గ్రహించాలి. అధికారం పోగానే అసెంబ్లీకి కూడా రాకుండా ఎటెటో తిరిగితే ఎలా. ఇలాగే ప్రవర్తిస్తే ఉన్న 11 స్థానాలు కూడా 1 సీటుకు వచ్చే అవకాశం ఉందని జగన్ గ్రహించాలి’’ అని సూచించారు పయ్యావుల.

Read More
Next Story