జగన్‌ సరస్వతీ పవర్‌పై పవన్‌ ఆదేశాలు.. అటవీ శాఖ సర్వేలు
x

జగన్‌ సరస్వతీ పవర్‌పై పవన్‌ ఆదేశాలు.. అటవీ శాఖ సర్వేలు

జగన్‌మోహన్‌రెడ్డి సరస్వతీ పవర్‌ ప్రస్తుతం వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఆ లెక్కలు తేల్చే పనిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ ఉన్నారు.


మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఆయన చెల్లి వైస్‌ షర్మిల మధ్య ఆస్తుల గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. జగన్‌కు చెందిన సరస్వతి పవర్‌ సంస్థకు చెందిన ఆస్తులు కూడా వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో సరస్వతి పవర్‌ సంస్థ భూములపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. జగన్‌కు చెందిన సరస్వతి పవర్‌ సంస్థకు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, వాటిల్లో ప్రభుత్వానికి చెందిన భూములు ఉన్నాయా, ప్రైవేటు భూములున్నాయా అనే అంశాలను తేల్చే పనిలో నిమగ్నమైంది. ఆ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అధికారులను ఆదేశించారు. సరస్వతి పవర్‌కు సంబంధించిన భూముల్లో అటవీ భూములేమైనా ఉన్నాయా? ఒక వేళ ఉంటే వాటి విస్తీర్ణం ఎంత ఉందో వెంటనే వివరాలు చెప్పడంతో పాటు నివేదికను తయారు చేసి అందించాలని అటవీ, పర్యావరణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సరస్వతి పవర్‌ సంస్థ ఏర్పాటు చేసిన ప్రాంతమంతా వాగులు, వంకలు, కొండలు ఎక్కువుగా ఉన్న నేపథ్యంలో ఆ సంస్థ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు ఎలా పొందారో అనే విషయాలు కూడా తనకు తెలియజేయాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను కూడా డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో అటవీ, పర్యావరణ శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. దాచేపల్లి డీఆర్వో ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది దాచేపల్లి, మాచవరం మండలాల్లో శనివారం సర్వే చేపట్టారు. త్వరలో ఈ నివేదికను రూపొందించి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు అందించనున్నారు.

Read More
Next Story