తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్‌ను పొగుడుతూ పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌
x

తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్‌ను పొగుడుతూ పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను పరోక్షంగా విమర్శలు చేసిన పవన్‌ కళ్యాణ్‌ తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్‌ను పొగుడుతూ చేసిన ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది.


ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తాజా వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటి వరకు లడ్డూ వివాదం, సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న పవన్‌ కళ్యాణ్‌ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు, అన్నాడీఎంకే నాయకుడు ఎంజీఆర్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. సనాతన ధర్మంపై గతంలో ఎప్పుడో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి తిరుపతి వారాహి డిక్లరేషన్‌ సభలో విమర్శలు చేశారు. తమిళంలో మాట్లాడుతూ మరి విమర్శలు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో తమిళనాడులోని డీఎంకే వర్గాలు బగ్గుమన్నాయి. పవన్‌ కళ్యాణ్‌పైన కేసు కూడా నమోదు చేశారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను పవన్‌ కళ్యాణ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని, వంజీనాథన్‌ అనే న్యాయవాది మదురై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో డీఎంకేకు రాజకీయ విరోధి అయిన అన్నాడీఎంకే నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ను పొగుడుతూ పవన్‌ కళ్యాణ్‌ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టడం తాజాగా చర్చనీయాంశంగా మారింది.

పోస్టులో పవన్‌ కళ్యాణ్‌ ఏమన్నారంటే.. ఎంజీఆర్‌పై నాకు ఉన్న ప్రేమా అభిమానం, చెన్నైలో నేను పెరిగినప్పుడు మాటల్లో చెప్ప లేనిది. అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. రాబోయే అన్నాడీఎంకే 53వ ఆవిర్భావ దినోత్సవం అక్టోబరు 17న పురచ్చీ తలైవర్‌ ఆరాధకుడు అభిమానులందరికీ నా శుభాకాంక్షలు. పురచ్చీ తలైవర్‌తో నాకు మొదటి పరిచయం మైలాపూర్‌లో చదువుతున్నప్పుడు మా తమిళ భాష ఉపాధ్యాయుడి ద్వారా జరిగింది. అతను తిరుక్కల్‌ నుంచి ఒక ద్విపదను పటించారు. ఈ తిరుక్కల్లో పురచ్చీ తలైవర్‌ లక్షణాలు ప్రతిభింబిస్తున్నాయని అన్నారు. పరోపకారం, దయాగుణం, నిష్కపటత్వం, ప్రజల పట్ల శ్రద్ధ ఈ నాలుగు విషయాలను కలిగి ఉన్న రాజులకు ఆయన వెలుగు అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Read More
Next Story