శాఖలపై పట్టు కోసం పవన్‌ కల్యాణ్‌ ముమ్మర ప్రయత్నాలు
x

శాఖలపై పట్టు కోసం పవన్‌ కల్యాణ్‌ ముమ్మర ప్రయత్నాలు

గతంలో సిసిమాలతో బిజీగా ఉండే పవన్‌ కల్యాణ్‌ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుస సమీక్షలతో నిమగ్నమయ్యారు.


ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పాలనపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఆయనకు కేటాయించిన శాఖలపై అవగాహన పెంపొందించుకునే పనిలో తలమునకలయ్యారు. శాఖల వారీగా సమీక్షలు నిర్వహించడంలో నిమగ్నమయ్యారు. వరుస రివ్యూలతో బిజీబిజీగా ఉన్నారు. ఆయా శాఖల ఉద్యోగ సంఘాల నాయకులతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమస్యలపైన దృష్టి సారించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్‌ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితో గౌరవించడంతో పాటుగా ఆయన కోరుకున్న శాఖలను కేటాయించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి మిత్ర ధర్మాన్ని పాటించారు. కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణంతో పాటు సైన్స్‌ టెక్నాలజీ వంటి శాఖలను పవన్‌ కల్యాణ్‌కు కేటాయించారు. క్రియాశీలక రాజకీయాల్లోకి రాకముందు ఆయా శాఖలపై కొద్దో గొప్పో అవగాహన కలిగి ఉన్నా, ప్రస్తుతం పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోవడం కోసం, కీలకమైన అంశాలు, నిధుల కేటాయింపులు, ఖర్చులు, ప్రధానంగా అమలు చేయాల్సిన కార్యక్రమాలు, ప్రస్తుతం ఎలాంటి పనులు జరుగుతున్నాయనే అంశాలను తెలుసుకోవడంపై దృష్టి సారించారు. లోతుగా అధ్యయనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కొత్తగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపైన అధికారులతోచర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగా శాఖల వారీగా సమీక్షలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ప్రతి శాఖలో ఎన్ని విభాగాలు ఉన్నాయి, వాటి ద్వారా జరిగే ఎలాంటి కార్యక్రమాలు అమలవుతున్నాయి, అధికారులు ఎంత మంది ఉన్నారు, ఇతర ఉద్యోగ సిబ్బంది ఎంత మంది ఉన్నారనే అంశాలపైన దృష్టి పెట్టారు. ప్రతి శాఖకు సంబంధించిన కార్యక్రమాలపైన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చే విధంగా అధికారులకు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. ప్రాథమికంగా పవన్‌ కల్యాణ్‌ మనసుకు నచ్చిన శాఖలు కావడంతో ఆయా అంశాలపై సులువుగానే అవగాహనకు వస్తున్నారని అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఆ నిధులు ఏమయ్యాయి?
డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎండితో పాటు ఇతర అధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. స్వచ్చాంద్ర కార్పొరేషన్‌ ఎలాంటి కార్యక్రమాలను చేపడుతుందనే దానిపై చర్చించారు. వివిధ కార్యక్రమాలను గురించి అధికారులు పవర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ సంబంధించిన నిధుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిధుల లభ్యత, ఖర్చులపైన ఆయన ఆరా తీశారు. గత ఐదేళ్ల కాలంలో చేపట్టిన పనులు గురించి అడిగి తెలుసుకున్నారు. గత ఐదేళ్ల కాలంలో కేంద్రం విడుదల చేసిన రూ. 1066 కోట్లు ఏమయ్యాయని అధికారులను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వమైతే నిధులు విడుదల చేసిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ ఆ నిధులను మంజూరు చేయలేదనే విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు.
మ్యాచింగ్‌ గ్రాంట్‌ నిధులు ఏమయ్యాయి?
గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. జలజీవన్‌ మిషన్‌ వంటి పలు కేంద్ర పథకాల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన మ్యాచింగ్‌ గ్రాంట్‌ వివరాలను గురించి ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన మ్యాచింగ్‌ గ్రాంట్‌ నిధుల గురించి సమగ్రమైన వివరాలను ఇవ్వాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలకు తాగు నీటిని సరఫరా చేయడంలో గత రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ఇక నుంచి అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా తాగు నీటి సరఫరాపై దృష్టి సారించాలని, జలజీవన్‌ మిషన్‌ నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ సంరక్షణకుకు కార్యక్రమాల గురించి సమీక్షించిన పవన్‌ కల్యాణ్‌ కాలుష్య నియంత్రణ మండలి చేపడుతున్న కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. పొల్యుషన్‌ ఆడిట్‌పైన ఆరా తీశారు.
నేను వినే వ్యక్తిని
శాఖల్లో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులు సిబ్బంది సమస్యలపై ఆయన మాట్లాడుతూ సమస్యలు వింటే పరిష్కారం సులువు అవుతుందన్నారు. తాను సమస్యలు వినే వ్యక్తినని వారికి భరోసా ఇచ్చారు. అయితే సమస్యల పట్ల పూర్తి స్థాయిలో అవగాహనతో రావాలని, తనకు ఇతర శాఖలు కూడా ఉన్నందు వల్ల సమయాన్ని కూడా గుర్తుంచుకోవాలని సూచించారు. మంత్రితో సహా అందరు కలిసి పని చేస్తేనే ప్రజలకు సేవలు అందించగలుగుతామని సూచించారు. తాను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకునని, ఒకటో తారీఖున జీతం రాకపోతే ఎంత కష్టంగా ఉంటుందో తనకు తెలుసన్నారు. గత ప్రభుత్వం భయపెట్టినట్లు తాము చేయమని, భుజం కాస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల భవిష్యత్‌కు, భద్రతకు కూడా హామీ ఇచ్చారు. ఈ ఐదేళ్ల కాలంలో పంచాయతీలను పటిష్టం చేసేందుకు కృషి చేస్తానన్నారు. దీనికి అందరి సహాయ సహకారాలు, సూచనలు కావాలని కోరారు.
Read More
Next Story