హస్తినకు పవన్ కళ్యాణ్ వెళ్లింది అన్న కోసమేనా...
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లింది తన అన్న నాగబాబు కోసమేనని చర్చ జరుగుతోంది.
ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్లింది అన్న నాగబాబు కోసమేనని కూటమి ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ నుంచి ఇటీవల ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. వీరి స్థానంలో అధికారంలో ఉన్న మూడు పార్టీల్లోని ముగ్గురికి అవకాశం ఇవ్వాలని మొదట కూటమి నేతలు నిర్ణయించారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి వత్తిడి పెరగటంతో ఇరువురికి తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు పంపించాలని, ఒక పోస్టును బిజెపికి ఇవ్వాలా, జనసేనకు ఇవ్వాలా.. అనే అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని పెద్దల ఆశీస్సులు పొందేందుకు వెళ్లారు. కొణిదెల నాగబాబును రాజ్యసభకు పంపించేందుకు అవకాశం కల్పించాలని పవన్ ప్రధాని మోదీని కోరినట్లు సమాచారం. చంద్రబాబుకు మోదీ నేరుగా ఒక మాట చెబితే అది జరుగుతుందని, లేదంటే ముందడుగు పడే పరిస్థితులు లేవని పవన్ కళ్యాణ్ భావించే ముందుగా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ప్రస్తుతం జనసేనకు పవన్‌తో పాటు మరో ఇద్దరికి మంత్రి పదవులు కూటమి ప్రభుత్వంలో దక్కాయి. అయితే తన అన్నకు పార్టీలో పదవులు ఉన్నా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండాలని, కేంద్రంతో సంబంధాలు కొనసాగించాలన్నా.. ఎప్పకప్పుడు కేంద్రం నుంచి ఏ సమాచారం తెలుసుకోవాలన్నా నాగబాబుకు పదవి ఉంటే బాగుంటుందనే భావనలో ఉన్నారు. అనకాపల్లి నుంచి నాగబాబును ఎంపీ స్థానంలో పోటీ చేయించేందుకు ముందుగా నిర్ణయించుకున్నా ఆ సీటు పొత్తుల్లో బీజేపీకి వెళ్లిపోయింది. దీంతో అక్కడి నుంచి సీఎం రమేష్ ఎంపీగా పోటీ చేసి బీజేపీ తరపున గెలిచారు. సీటు నాగబాబు త్యాగం చేసినందుకు తగిన విధంగా సాయం చేయిస్తానని సీఎం రమేష్ ఇచ్చిన హామీ మేరకు నాగబాబును రాజ్యసభకు పంపించాలనే ఆలోచనలో బీజేపీ వారు ఉన్నారు.