పవర్ స్టార్ కు బహిరంగ లేఖ- సనాతన ధర్మం కాదు సమతా మార్గం కావాలి
x

పవర్ స్టార్ కు బహిరంగ లేఖ- సనాతన ధర్మం కాదు సమతా మార్గం కావాలి

అయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నావో అర్థం అవుతుందా.


(మోతుకూరి అరుణకుమార్)

అయ్యా...

ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుని, చేగువేరా, భగత్ సింగ్ లు ఆదర్శం అన్నావ్.

ముఖానికి రంగులు వేసుకుని సినిమాల్లో హీరోగా నటించి

లక్షల కోట్లు సొమ్ము ఆర్జించావు. అది చాలదన్నట్టు ప్రజా సేవ చేస్తాను అంటూ రాజకీయ పార్టీ పెట్టి ఊరూరా తిరిగావు.

విప్లవ భావాలు, అభ్యుదయ భావాలు ఉన్నవాడ్ని , కులం లేదు, మతం లేదు అందరూ సమానమే అంటూ కమ్యూనిస్టులతో నాల్గు అడుగులు వేసావు, ఓడిపోగానే

చంద్రబాబు ను నానా విమర్శలు చేస్తూ బిజెపి పంచన చేరి మోడీ భజన చేసావు.

మళ్ళీ ఎన్నికలు రాగానే అధికార దాహంతో ఉన్న చంద్రబాబుతో కలిసి వెళ్ళావు. 21 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచారు.నువ్వు ఉప ముఖ్యమంత్రి వి అయ్యావు.

అంతా బాగానే ఉంది.

అయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నావో అర్థం అవుతుందా.

ఒక రాజకీయ పార్టీ అధ్యక్ష స్థానంలో.

ప్రజలందరూ ఓట్లు వేస్తే 21 మంది ఎమ్మెల్యేలు గెలిచి రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ సన్యాసి లాగా

కాషాయ దుస్తులు ధరించి,పూజలు, దీక్షలు, దేవాలయాల మెట్లు శుభ్రం చేయడం, నీ దేవుళ్ళ దర్శనం కోసం వెళ్తూ మీడియా షూటింగ్ లు, ఫోటో ఎగ్జిబిషన్ లు ఏమిటి? నువ్వు సాధారణ భక్తుడు లాగా వెళితే ఎవడూ పట్టించుకోడు, ఎక్కడికి వెళ్తే అక్కడ , ఏ మత విశ్వాస మందిరం చర్చి, మసీదుల వద్దకు వెళ్లి వారికి అనుకూలంగా ఇతర విశ్వాసాల వారి పై రెచ్చగొట్టే ఉపన్యాసం చేయడం నీకే చెల్లుబాటు అయిందా?

పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ చూడటం లేదని అనుకుంటూ ఉంటుందని అంటారు. ఉప ముఖ్యమంత్రి అవ్వగానే నేనేం చేసినా ఏం మాట్లాడినా ఫర్వాలేదు , అనే గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నావా?

గతంలో ముఖ్యమంత్రి గా ఉన్న జగన్ మోహన్ తప్పుడు పనులు చేసినట్టు, ప్రజా వ్యతిరేక పాలన చేశారంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు మాత్రం చేస్తున్న పని ఏమిటి? ఇస్లాం, క్రైస్తవ విశ్వాసులు

హిందూ దేవాలయంలోకి వెళ్ళడానికి ఆ దేవుడు పై విశ్వాసం ఉన్నట్టు డిక్లరేషన్ ఇవ్వాలా?

ఒక మతాన్ని మత దైవాన్ని ఆరాధించే వాళ్ళు ఇతర మత దైవ దర్శనం కోసం ఎలాగూ వెళ్ళరు.

నీలాంటి రాజకీయ నాయకులు, దొంగలే ఓట్లు, సీట్లు కోసం వెళుతూ మత రాజకీయాలు చేస్తూ ఉంటారు.

మరి నువ్వు నీలాంటి హిందూ ధర్మం పరిరక్షకులు మసీదు చర్చిలకు వెళితే అప్పుడు కూడా ఆ దేవుణ్ణి విశ్వసిస్తానని

డిక్లరేషన్ ఏదైనా ఇచ్చారా?

ఆయా సమూహాల సభలకు వెళితే లేదా నెత్తి మీద ఇస్లాం పద్ధతిలో ఉండే టోపి పెట్టుకుని ప్రజల నెత్తిన టోపీలు పెడుతూ ఉంటారా?

మతం, దేవుడు వ్యక్తిగతం ఆ దేవుణ్ణి నీ ఇంటి పూజా గదిలోనే ఉంచుకోవాలి, నీ కులాన్ని మతాన్ని నీ ఇంటి గడప లోపల ఉంచుకోవాలి. వాటి

అన్నిటినీ దాటుకుని బయటకు వస్తే అందరూ సమానమే. అన్న విషయం తెలుసా మీకు?

మీ ఇంట్లో వయసులో ఉన్న భార్య, ఆడపిల్లల్ని 40 రోజులు దీక్ష,మాల వేసి శబరిమల అయ్యప్ప దర్శనంకు తీసుకుని వెళ్ళే దమ్ము నీకు ఉందా?

హిందూ, క్రైస్తవ, ఇస్లాం,భౌద్ధ మతాలకు రెస్పెక్ట్ ఇవ్వడం ఏమిటి ?

మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో.

మతం విశ్వాసం మీద ఆధారపడి ఉంటే సైన్స్ వాస్తవం మీద ఆధారపడి నిత్య పరిశోధనలు చేస్తూ ఉంటుంది.

ముందు నువ్వు రాజకీయ పార్టీ అధ్యక్షుడువి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు.

ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.

సనాతన ధర్మాన్ని కాపాడటానికి నువ్వు ఎవడివి, దానికి ప్రత్యేకంగా బాబాలు, స్వాములు, పీఠాధిపతులు ఉన్నారు. లేదా పాస్టర్లు, ముల్లాలు లేదా మత పెద్దలు ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు.

ప్రజా పాలనలో మత పరమైన జోక్యం ఉండకూడదు. అలాగే మత పరమైన అంశాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు.

రాజ్య పాలకుడువు గా నువ్వు చేయవలసిన పని నువు చెయ్. ధర్మో రక్షతి రక్షితః అని అంటారు కదా .లేదంటే కాషాయ గోచి కట్టుకుని, ఒక గుళ్ళో పూజారిగా వెళ్ళు కోట్లు డబ్బులు వస్తాయి. పీఠాధిపతి గా అవతారం ఎత్తు.

నువ్వు చెప్పే పురాణ కథలు, పిట్ట కథలు, రామాయణ,భారత, భగవద్గీత చదువుతూ

జై శ్రీరాం అంటూ ఉండాలా?

సనాతన ధర్మం ప్రకారం .

ప్రతి ఒక్కడు తన భార్యల్ని అనుమానించి అడవికి పంపించి వేయాలా? అగ్నిపరీక్ష పెట్టాలా?

వెంకన్న స్వామి లాగా ఇద్దర్నీ పెళ్లి చేసుకోవాలా? భార్యలు అణిగిమణిగి ఉండాలా, విష్ణుమూర్తి కాళ్ళను భార్య లక్ష్మిదేవి ఒత్తుతూ ఉన్నట్టే నేటి ఆడవాళ్ళు పడకగదీ, వంటగదికి పరిమితం అవ్వాలా?

బ్రహ్మ అనే దేవుడు ఎలా అయితే తన స్వంత కూతురు సరస్వతి దేవత అందాన్ని చూసి మోహించి భార్యగా చేసుకున్నట్లుగా నేడు ప్రతి తండ్రి తన కుమార్తెలను మోహించి పెళ్లి చేసుకోవాలా? సీత ,సావిత్రి, అనసూయ, అరుంధతి లాగా అణిగిమణిగి ఉండాలా?

విద్య లేకుండా ఓటు హక్కు లేకుండా ఇంటికే పరిమితం చేయాలా?

భర్తలు మరణిస్తే భార్యల్ని కూడా చితి మీద పెట్టి కాల్చిసట్టే సతీసహగమనం పాటించాలా?

లేదంటే అల్లా చెప్పాడని మా ఆడవారికి నల్ల ముసుగులు వేసి పరాయి మగాడు కన్ను పడకుండా ఉంచాలా? పెళ్ళానికి తలాక్ చెప్పి మరో పెళ్లికి సిద్ధం కావాలా?

ఇదేకదా సనాతన ధర్మం అంటే?

అలాగే సమాజంలో నాటుకుని ఉన్న మూడ నమ్మకాల్ని ప్రశ్నిస్తూ, రచనలు చేసే మేధావులు, రచయితలు, జర్నలిస్టులు, నాస్తికులు అయిన నరేంద్ర డబోల్కర్, గోవింద పన్సారే,

కల్బుర్గి, గౌరీ లంకేశ్ లను దారుణంగా హత్యలు చేసినపుడు మీరు ఏమైన ప్రశ్నించారా, ఆయా కుటుంబాలకు అండగా నిలిచారా?

సినీ నటులు ప్రకాష్ రాజ్ గారి మేనత్త గౌరీ లంకేశ్ హత్య జరిగితే సాటి సినీ రంగ మిత్రునిగా మీరు వెళ్లి అండగా నిలిచావా?

పేదల కోసం పాటుపడుతూ సాహిత్యం వ్రాసే మేధావులు ప్రొఫెసర్ సాయిబాబా , వరవర రావు, స్టాన్ స్వామి, లేదా జర్నలిస్టులపై అక్రమ కేసులు జైళ్ళు నిర్బంధాలు , విధించి నపుడు ఎప్పుడైనా మీ గొంతు ఎత్తారా?

సనాతన ధర్మం ఒక వైరస్ లాంటిది అని ఒక సాహిత్య పుస్తకావిష్కరణ సభలో తమిళనాడు రాష్ర్ట మంత్రి , నీలాంటి ఒక సినిమా హీరో అయిన ఉదయనిధి మాట్లాడిన మాటల్ని వక్రీకరించి అతన్ని తల నరికిన వారికి 100 కోట్లు డబ్బులు ఇస్తాం అని ఒక కాషాయ సన్యాసి అన్నటు వంటి వ్యాఖ్యలు చేస్తే మీ స్పందన ఏమిటో చెప్పారా?

కొవిడ్ రోజుల్లో రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా డిల్లీలో ఏడాదికి పైగా ఉద్యమం చేసినపుడు ఒక్కసారైనా వారికి మద్దతుగా నిలిచారా?

ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ పరం చేస్తున్నపుడు, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటే మీ వంతు బాధ్యతగా మీరేం చేశారు?

మహిళపై అత్యాచారాలు హత్యలు జరిగితే ఒక్కసారైనా మీ గొంతు విప్పారా?

కృష్ణా గోదావరి బేసిన్ లో ఉన్న ఆయిల్ నిక్షేపాలు అంబానీ, అదానీ కి దారాదత్తం చేస్తూ ఉంటే చూస్తూ కూర్చున్నారా?

లేదంటే నిత్యవసర సరుకులు, ఉల్లిపాయలు ధరలు నియంత్రణలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఏమిటి?

ఇవన్నీ కాకుండా దేవుడు లడ్డు లో కల్తీ జరిగింది అని నానా యాగి చేశారు. ప్రాయశ్చిత్తం దీక్ష అంటూ ప్రజల్ని, సమాజాన్ని తప్పు తోవ పట్టిస్తారా?

ఇవన్నీ నాకెందుకు నా మతం, నా కులం నా దేవుడు అంటూ ప్రజల్ని రెచ్చగొడుతు ఉంటారా?

మీరు నటించే సినిమాలు కేవలం నీ మతం వాళ్ళే, నీ కులం వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి మరీ తల నొప్పి తెచ్చుకుంటూ ఉన్నారా?

మీరు కేవలం మీ కులం మీ మతం వాళ్ళ ఓట్లు వేస్తేనే గెలిపించారా?

ఇంత పెద్ద విశ్వంలో ఒక నీటిబొట్టు లాంటి వాళ్ళం. ఇంతకూ

మీ దేవుడు మీ సనాతన ధర్మం ,మిమ్మల్ని సృష్టించిన దేవుడా లేక మీరు సృష్టించిన దేవుడా??

అందుకేనేమో మతం మత్తు మందు అని కార్ల్ మార్క్స్ చెప్పారు.

మతములన్నియు మాసి పోవును జ్ఞాన మొక్కటి నిలచి ఉండును అని గురజాడ వారు ఎప్పుడోనే అన్నారు.

Read More
Next Story