నేటి రాత్రంతా శ్రీరాముని సేవలోనే పవన్‌ కల్యాణ్‌
x

నేటి రాత్రంతా శ్రీరాముని సేవలోనే పవన్‌ కల్యాణ్‌

శ్రీరామనవమి సందర్భంగా ఒక రోజు ముందుగానే పవన్‌ కల్యాణ్‌ భద్రాచలంకు వెళ్లనున్నారు.


శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాచలం పెట్టింది పేరు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దక్షిణాదిలోనే భద్రాచలం వేడుకలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతూ వస్తోంది.

శ్రీరామనవమి రోజు నిర్వహించే ఉత్సవాలకు సహజంగా అదే రోజు ప్రభుత్వ పెద్దలు హాజరవుతారు. ప్రభుత్వం తరపున స్వామి వార్లకు అందజేయాల్సిన లాంఛనాలను అందజేస్తారు. ఉత్సవ వేడుకలను తిలకిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్‌ కల్యాణ్‌ మాత్రం స్వామి వార్ల మీద తన భక్తిని చాటుకునేందుకు ఒక రోజు ముందే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రేపు ఆదివారం శ్రీరామనవమి అయితే ఒక రోజు ముందే శనివారం నాడే భద్రాచలం ఆలయానికి చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. శనివారం రాత్రి శ్రీరాముని సన్నిధిలోనే పవన్‌ కల్యాణ్‌ నిద్ర చేయనున్నారు. అనంతరం ఆదివారం నిర్వహించే సీతారాముల కళ్యాణోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, హైదరాబాద్‌ మాదాపూర్‌లోని తన నివాసం నుంచి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు భద్రాచలంకు బయలుదేరనున్నారు. రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం జిల్లా మీదుగా సాయంత్రం 5 గంటలకు భద్రాచలంకు చేరుకుంటారు. శనివారం రాత్రికి రాముల వారి సన్నిధిలోనే బస చేయనున్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆదివారం ఏపీ ప్రభుత్వం తరఫున సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. సీతారాముల కళ్యాణమహోత్సవ వేడుకలను తిలకిస్తారు. వేడుకల అనంతరం ఆదివారం రాత్రి 10గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.
మరో వైపు శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం భద్రాచలం ఆలయంలో నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం అంతా కదిలి రానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు కలిసి ఈ వేడుకలకు స్వయంగా హాజరు కానున్నారు. ఇతర తెలంగాణ మంత్రులు కూడా హాజరు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు స్వామివార్లకు లాంఛనాలను సమర్పించనున్నారు. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేయనున్నారు. అటు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు, ఇటు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ భద్రాచలం వస్తున్న నేపథ్యంలో పోలీసులు, ఆలయ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
Read More
Next Story