కొండను తవ్వి ఎలుకను పట్టిన పవన్ కల్యాణ్
సర్వతీ పవర్ ప్రాజెక్టు భూముల్లో ప్రభుత్వ పరిశీలన పూర్తయింది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కుపెట్టిన బాణం మాజీ సీఎం జగన్ కు తగలలేదు. జగన్ కు సంబంధించిన సరస్వతీ పవర్ ప్రాజెక్టు కోసం అటవీ భూములు ఆక్రమించి ప్రాజెక్టుకు వాడుకుంటున్నారని సమాచారం అందుకున్న పవన్ కల్యాణ్ నేరుగా పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరంలో ఇటీవల పర్యటించారు. ఆయన ఆదేశాల మేరకు అటవీ, రెవెన్యూ అధికారులు ప్రాజెక్టుకు కొనుగోలు చేసిన భూములు, ఆక్రమణలు ఏవైనా ఉన్నాయేమోననే అనుమాతనంతో సర్వేలు నిర్వహించారు. ఈ సర్వేల్లో ఆక్రమణలు ఉన్నట్లు ఎక్కడా కనిపించ లేదు. దీంతో ఫారెస్ట్ వారు వెనుదిరిగారు. పవన్ కల్యాణ్ ఫారెస్ట్ మినిష్టర్ కావడంతో జగన్ ను దెబ్బకొట్టాలనే ఆలోచనతోనే ఈ పర్యటన జరిపారు. అయితే చివరకు ఆయన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లైంది.
పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ ప్రాజెక్టు వారు కొనుగోలు చేసిన భూముల్లో ప్రభుత్వ అసైన్డ్ భూములు ఉన్నాయని 24.84 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ భూములు స్థానికంగా ఉండే ఎస్సీ రైతులకు ప్రభుత్వం డికే పట్టాలు ఇచ్చింది. ఈ పట్టాలను పరిశీలించి, స్థానిక ఎస్సీ రైతులతో మాట్లాడిన ప్రభుత్వ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూములు ఎందుకు జగన్ కంపెనీకి ఇచ్చారని వారిని ప్రశ్నించారు. తమకు డబ్బులు ఇచ్చి కొన్నారని వారు చెప్పారు. అమ్మటం నేరమని వారికి తెలియదని చెప్పడంతో అధికారులు వారికి ఇచ్చిన పట్టాలు రద్దు చేశారు. వీరి నుంచి కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రార్ ఆఫీసులో భూముల రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని ప్రభుత్వం రిజిస్ట్రార్ కు వివరాలు అందిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల సరస్వతీ పవర్ ప్రాజెక్టులో తనకు వాటా ఉందని, తన వాటా తనకు ఇవ్వాలని పట్టుబట్టడం, పత్రికలకు ఎక్కడంతో సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ కంపెనీ భూములను పరిశీలించి విచారణకు ఆదేశించారు. ఆదేశాలు అందుకున్న అధికారులు విచారించి చివరకు 24.84 ఎకరాల పేదల భూమిని కంపెనీ వారు కొనుగోలు చేశారని, ఈ భూమి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమని రిపోర్టు ఇచ్చింది. ఈ రిపోర్టుతో ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది.
అప్పటి రిజిస్ట్రార్ ఏ నిబంధనల ప్రకారం ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమిని రిజిష్టర్ చేసిందనే విషయంలోనూ ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను తెలియజేసింది. ఇష్టానుసారం రిజిస్ట్రేషన్ లు ఎలా చేస్తారని అధికారులను ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించారు. అప్పట్లో ఉన్న అధికారి ఎవరు. ఏ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేశారనే విషయంలో విచారణ జరగాల్సి ఉంది.