మాఫియా అడ్డాగా కాకినాడ.. స్పెషల్ ఫోకస్ పెట్టిన డిప్యూటీ సీఎం
x

మాఫియా అడ్డాగా కాకినాడ.. స్పెషల్ ఫోకస్ పెట్టిన డిప్యూటీ సీఎం

కాకినాడ.. రేషన్ మాఫియాకు అడ్డాగా మారిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్.. కాకినాడ పర్యటనకు సిద్ధమయ్యారు. దీని వెనక ఆంతర్యం ఏమిటో..?


బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచి జనసేన నేతలు దూకుడుగా పని చేస్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఒకేఒక్కడు సినిమాలో హీరో తరహాలో ప్రజల మధ్యకు వెళ్లి మరీ సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్నారు. ఇందులో భాగంగానే మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా కాకినాడలోని రేషన్ షాపుల్లో తనిఖాలు చేపట్టారు. కాకినాడలో రేషన్ మాఫియా పెట్రేగిపోతోందని, ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసరఫరాల శాఖపై రెండో రోజు నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. అధికారులపై ధ్వజమెత్తారు నాదెండ్ల మనోహర్. కాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకు సరుకులు వెళ్తున్నాయని, ఈ విషయం స్థానిక అధికారులకు తెలియదా.. తెలిసినా తెలియనట్లు ఉంటున్నారా అంటూ మండిపడ్డారు.

‘సీఐడీ విచారణ కోరతాం’

కాకినాడలో జరుగుతున్న రేషన్ అక్రమాలపై పూర్తిస్థాయి సీఐడీ విచారణ కోరతామని ఆయన వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అది ఎవరైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. ‘‘టోల్‌గేట్‌ల దగ్గర సీసీటీవీ కెమెరాల ఆధారంగా విచారణ జరుపుతాం. కాకినాడలో జరిపిన తనిఖీల్లో తొలిరోజున 6 గోదాముల్లో లోపాలను గుర్తించాం. రేషన్ బియ్యం అక్రమ నిల్వలను గుర్తించాం. దాదాపు 7,615 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశాం. ఇలాంటి అక్రమాలను ఈ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించదు. వీటిపై అతి త్వరలోనే ఉక్కుపాదం మోపుతాం. ఇప్పటికే చర్యలు ప్రారంభించామని తెలిపారు.

అంతేకాకుండా కాకినాడలో వ్యవస్తీకృత మాఫియా ఏర్పడటమే కాకుండా అది వేరే స్థాయిలోకి చేరి ఉందని, తమ సరుకును తీసుకెళ్లడానికి సొంత నౌకను ఏర్పాటు చేసుకునే రేంజ్‌కు ఈ మాఫియా చేరిందని నాదెండ్ల మనోహర్ వివరించారు. ఈ మాఫికా కారణంగా కాకినాడ పోర్ట్‌ అంటే అందరూ భయపడాల్సిన పరిస్థితి నెలకొందని, ఈ అక్రమాల్లో ఆరు సంస్థల పాత్ర ఉన్నట్లు ఈ తనిఖీల్లో గుర్తించామని, వీటిపై చట్టపరమైన చర్యలు తక్షణం తీసుకుంటామని వివరించారు. ఈ నేపథ్యంలో జూలై 1వ తేదీ నుంచి కాకినాడలో పర్యటించడానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సిద్ధం కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ రేషన్ మాఫియా సహా పలు ఇతర అక్రమాలపై కూడా పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టనున్నారని తెలుస్తోంది.

రేషన్ మాఫియాకు ఎలా అడ్డుకట్ట వేయాలి అన్న విషయాన్ని మంత్రి మనోహర్.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని, అక్రమాలు, అవినీతికి అడ్డుకట్ట వేసే తీరుపై అధికారులకు మంత్రి, డిప్యూటీ సీఎం దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తుంది. దాంతో పాటుగా జూలై 1వ తేదీని ప్రభుత్వం అందించే పింఛన్ కార్య్రమంలో కూడా పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.

పవన్ కల్యాణ్ షెడ్యూల్ ఇలా

పవన్ కల్యాణ్.. కాకినాడ జిల్లా పర్యటన మూడో తేదీ వరకు కొనసాగనుంది. తొలిరోజున గొల్లప్రోలులో పెంచిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన పిఠాపురం జనసేన నేతలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత 2వ తేదీన కాకినాడ కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ, అటవీశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజునే అక్కడ జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మూడో తేదీన ఉప్పాడ కొత్తపల్లి సముద్ర ప్రాంతాన్ని సందర్శించనున్నారు పవన్ కల్యాణ్. ఆరోజు సాయంత్రం పిఠాపురంలో నిర్వహించనున్న వారాహి కృతజ్ఞతా సభలో ప్రసంగిస్తారు. అంతేకాకుండా జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడా పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.

Read More
Next Story