
FOREST LANDS : పెద్దిరెడ్డిపై 'కత్తి' ఎత్తిన పవన్ కల్యాణ్
అటవీ భూముల ఆక్రమణపై వీడియో రిలీజ్, కొట్టిపారేసిన మిథున్ రెడ్డి
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేరుగా తలపడేందుకే సిద్ధమైనట్టు కనిపిస్తోంది. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు అటవీ భూములను ఆక్రమించారంటూ కొంతకాలంగా చేస్తున్న ఆరోపణలకు ఇప్పుడు రుజువులు బయటపెట్టే పనిలో పడ్డారు పవన్ కల్యాణ్. ఇవాళ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించిన సమయంలో తీసిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు.
అయితే ఈ వీడియోలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కొట్టిపారవేశారు. పవన్ కల్యాణ్ మంచి కెమెరామెన్ అంటూ ఎద్దేవా చేశారు. పవన్ వీడియోలకు తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు.
చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy), కుటుంబసభ్యుల అటవీ భూముల ఆక్రమణలపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) వీడియో విడుదల చేశారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించిన సమయంలో తీసిన వీడియోలు ఇవి. మంగళంపేట అటవీ భూముల్లో 76.74 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులను కూడా తారుమారు చేశారన్నారు. విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను పవన్ ఆదేశించారు.
అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు శాఖ వెబ్ సైట్ లో వెల్లడించాలన్నారు.
పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...
‘అటవీ భూములు ప్రకృతి సంపద.. జాతి ఆస్తి. వాటిని ఆక్రమించిన వారు, చట్టాన్ని ఉల్లంఘించి అతిక్రమణలకు పాల్పడిన వారు కచ్చితంగా శిక్షార్హులవుతారు. అటవీ భూముల జోలికి వెళితే అది ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. అటవీ భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దీన్ని నెరవేర్చే ప్రక్రియను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేపడుతుంద’ని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.
వన్య ప్రాణి రక్షిత అటవీ భూముల్లోను, అటవీ ప్రాంతాల్లోనూ అటవీ ఆస్తులు కబ్జా చేసి భారీ భవంతులు, ఎస్టేట్స్ నిర్మించినవాళ్లు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి అన్నారు. అటవీ భూములను రక్షించుకొని, రాబోయే తరాలకు అందజేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎవరికీ భయపడాల్సిన పని లేదని, మనో ధైర్యంతో ముందుకు వెళ్దామని అటవీ అధికారులకు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబసభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూములపై పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాజీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబసభ్యుల అటవీ భూముల ఆక్రమణల మీద తన వద్ద ఉన్న నివేదికలు, వీడియోలు, ఇతర సమాచారం ఉన్నట్టు చెప్పారు. ఇప్పుడా వీడియోలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు శాఖ వెబ్ సైట్ లో వెల్లడించాలి. ఈ దిశగా ప్రణాళిక సిద్ధం చేయండి. ఎవరి ఆక్రమణలో ఎంత అటవీ ఆస్తి ఉంది? వారిపై నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుతం సదరు కేసులు ఏ స్థితిలో ఉన్నాయి లాంటి వివరాలు ప్రజలకి తెలియాలి.
పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై మంగళంపేట అటవీ భూముల ఆక్రమణల మీద ప్రసారమాధ్యమాల్లో కథనాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం వేగంగా స్పందించింది. విచారణ కోసం విజిలెన్స్ కమిటీ నియమించింది. ఈ కమిటీ రిపోర్టు అత్యంత కీలకం. ఈ నివేదికలో పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబం ఆక్రమించిన భూముల తాలుకా పూర్తి వివరాలను పొందుపరిచారు. దీన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి.
అటవీ భూములను ఇష్టానుసారం ఆక్రమించేవారిని ప్రభుత్వం ఉపేక్షించదు. ప్రజలకు సంబంధించిన ఆస్తులు, జాతికి సంబంధించిన ఆస్తులపై కన్నేసే వారిపై నిఘా ఉంచుతాం. ప్రకృతి వనరులను దోపిడీ చేసేవారు, ఆక్రమించుకునే వారిపై రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకుంటాం’’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
Next Story

