హిందీ అందరికీ పెద్దమ్మ..హిందీయే  రాజ్య భాష
x

హిందీ అందరికీ పెద్దమ్మ..హిందీయే 'రాజ్య భాష'

'హిందీ నేర్చుకోవడమంటే మన ఉనికిని కోల్పోవడం కాదు.. ఇంకో భాషను అంగీకరించడమంటే ఓడిపోవడం కాదు..కలిసి ప్రయాణించడం'-పవన్


హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదని, మరింత బలపడటమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం భాషతో సంబంధం లేకుండా ముందుకెళ్తున్న ప్రస్తుత రోజుల్లో హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని తేల్చి చెప్పారు.హైదరాబాద్ లో జరిగిన రాజ్య భాషా విభాగం గోల్డెన్‌ జూబ్లీ వేడుకలకు పవన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.హిందీని వ్యతిరేకించడం రాబోయే తరాల భవిష్యత్ ను అడ్డుకోవడమేనన్నారు. ఈ వేడుకల్లో భాగంగా దక్షిణ సంవాదం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘హిందీలో డబ్‌ అయిన 31 శాతం సౌత్‌ ఇండియన్‌ సినిమాలు ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. వ్యాపారానికి హిందీ కావాలి కానీ, నేర్చుకోవడానికి ఎందుకు ఇబ్బంది. హిందీ నేర్చుకోవడమంటే మన ఉనికిని కోల్పోవడం కాదు. ఇంకో భాషను అంగీకరించడమంటే ఓడిపోవడం కాదు.. కలిసి ప్రయాణించడం’’ అని పవన్‌ కల్యాణ్ అన్నారు.ఐటీ రంగంలో విజయం సాధించడానికి ఆంగ్లం ఎంత ముఖ్యమో, దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీని నేర్చుకోవడం వల్ల కూడా అంతే ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు.తన సినిమాలో "ఏ మేరా జహా" అనే హిందీ పాట పెట్టడానికి గల కారణాన్ని వివరిస్తూ, మాతృభాష తెలుగు అయినప్పటికీ, హిందీ దేశ భాష అని చెప్పడానికే అలా చేశానని తెలిపారు.వ్యాపారానికి హిందీ అవసరమైనప్పుడు, నేర్చుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి మాతృభాషల పట్ల గౌరవం ఉండాలని చెబుతూనే, హిందీని పెద్దమ్మ భాషగా అభివర్ణించారు.ప్రతి భాషా జీవ భాష, మాతృ భాష అయినప్పటికీ, రాజ్య భాష మాత్రం హిందీయేనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read More
Next Story