దావోస్ టూర్లపై పవన్ కల్యాణ్ సెటైర్లు
x

దావోస్ టూర్లపై పవన్ కల్యాణ్ సెటైర్లు

ఎర్ర కోట్లు, బ్లూ కోట్లు వేసుకుని దావోస్ లో కూర్చొంటే పెట్టుబడులు వస్తాయా?


ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దామం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలలు కంటున్నారు. అందుకోసం స్వర్ణాంధ్ర విజన్ 47ను రూపొందించారు. ఈ విజన్ డాక్యుమెంట్ ను పారిశ్రామిక వేత్తల వద్ద పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రానున్న 25 ఏళ్ల కాలంలో స్వర్గధామంగా మారుతుందని చెబుతున్నారు. అమరావతి కేంద్రంగా నూతన రాజధాని నిర్మాణాలు శర వేగంగా సాగుతున్నాయని, మరో మూడేళ్లలో అమరావతిలో అనుకున్న స్థాయిలో కార్యకలాపాలు మొదలవుతాయని సీఎం చెబుతున్నారు. అమరావతి మీదుగా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలను కలుపుతూ రైల్వేలైన్ మంజూరైంది. అదే విధంగా అమరావతి మీదుగా చెన్నై కోల్ కత్త హైవేను కలుపుతూ నాలుగు లైన్ల మెయిన్ రహదారులు ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం లోని ఇచ్చాపురం వరకు ఎక్కడి నుంచి ఎటు పోవాలన్నా నాలుగు లైన్ల రహదారులు రెడీ అయినట్లు సీఎం చెప్పారు. అమరావతి నుంచి ప్రపంచంలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా కావాల్సిన విధంగా అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నిర్మాణం జరుగుతుందని, ప్రస్తుతం గన్నవరంలోని ఎయిర్ పోర్టు అంతర్జాతీయ ఎయిర్ పోర్టుగా మారిందని విజన్ డాక్యుమెంట్ లో వివరించారు.

దావోస్ పర్యటనపై సీఎం ఏమి చెప్పారు..

స్విట్జర్లాండ్ లోని దావోస్ కు వచ్చిన పరాశ్రామిక వేత్తలు పలువురిని చంద్రబాబు నాయుడు నేరుగా కలిసారు. రాష్ట్ర పరిస్థిని వారికి వివరించి పెట్టుబడులు పెడితే రాయితీలు ఇప్పించే బాధ్యత నాదని పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇచ్చారు. పదేళ్లుగా అభివృద్ధి జరగక పోవడానికి కారణాలు వివరిస్తూ రానున్న నాలుగేళ్లలో అంతులేని అభివృద్దిని ఏపీ సాధిస్తుందనే నమ్మకాన్ని పారిశ్రామిక వేత్తలకు కలిగించే ప్రయత్నం చేశారు. అయినా పెట్టుబడులు రాలేదు. అందరూ చంద్రబాబు నాయుడు చెప్పినవి విని తలూపారు. తప్ప కుండా వస్తామని, ఏపీలో తమ సంస్థలు స్థాపిస్తామని ఒక్కరు కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఒక్క ప్రధాన మైన సంస్థతో కూడా ఎంఓయూ జరగలేదు. దీనిపై ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ ఎంవోయూలు జరిగితేనే పెట్టుబడులు వచ్చినట్లు కాదని, దావోస్ పర్యటన ఫలితాలు త్వరలోనే వస్తాయన్నారు. కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు సానుకూల పరిణామాలు ఉన్నట్లు చెప్పారు.

పవన్ కల్యాణ్ ఏమని ఎద్దేవా చేశారంటే..

దావోస్ కు వెళ్లిపోయి కోట్లు వేసుకుని.. అవి బ్లూ కోట్లు కావొచ్చు.. ఎర్రకోట్లు కావొచ్చు.. అవి వేసుకున్నంత మాత్రాన నాకు ఇబ్బంది లేదు, కానీ.. కోట్లు వేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు రావాలని ఏమీ లేదు. నిజంగా ఆంధ్రప్రదేశ్.. ఇక్కడ లా అండ్ ఆర్డర్ బలంగా ఉండి పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే వెతుక్కొని వస్తారు విదేశాల నుంచి. మనం దావోస్ కు వెళ్లి ఎగ్జిబిషన్ హాలులో కూర్చున్నట్లుగా కూర్చుని మా స్టేట్ కు రమ్మంటే వారు మన స్టేట్ కు వచ్చి ఏంచేస్తారు. దీనికి స్పెషల్ ఫ్లైట్ ఖర్చులు, వారం రోజుల పాటు అక్కడ ఉండటం. ఇదంత మనం మొయ్యాలి. అంటూ తమాషాగా మాట్లాడటమే కాకుండా దావోస్ పోయిన వారికి చురకలంటించారు.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీడియోలో పై భాగంలో పవన్ కల్యాణ్ సెటర్స్ ట్రోల్ చేస్తూ కింది భాగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనకు సంబంధించిన వీడియోను ట్రోల్ చేస్తూ పవన్ మాట్టాడిన మాటలు డిస్ప్లే చేస్తున్నారు పవన్ అభిమానులు.

Read More
Next Story