ముఖ్యమంత్రి కావాలనే కోరికే లేదు...
x

ముఖ్యమంత్రి కావాలనే కోరికే లేదు...

పవన్ నోట మళ్లీ అదే మాట



జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మళ్లీ చంద్రబాబు నాయుడిని ప్రశంసించారు. అంతేకాదు, తనకు ముఖ్యమంత్రి కావాలన్నకోరికే లేదని కూడా చెప్పారు. ఆ మాటకొస్తే, మరొక పది పదిహేనెళ్ల పాటు ఆలాంటి ఆలోచన చేయనని కూడా అన్నారు.

తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని పవన్ తరచూ చెబుతూ ఉండటం విశేషం. రాష్ట్రంలో నారాలోకేష్ దూకుడుగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొన్న కనిగిరిలో రిలయన్స్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి లాగా నారాలోకేషే హాజరయ్యారు.దానికి తోడు సభలో ప్రసంగించిన ఒక మంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేషే నని అన్నారు. ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో పట్టాల పంపిణీ కూడా అట్టహాసంగా జరిగింది. లోకేష్ ఒక్కరే పాల్గొన్నారు. ఇవన్నీ నారాలోకేషే తన వారసుడని చంద్రబాబు పంపుతున్న సంకేతాలని చాలా మంది అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు సర్వాత్రా కనిపించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం నాడు అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో పర్యటిస్తున్నపుడు ఈ ఆసక్తికరమయిన రెండు ప్రకటనలు చేశారు. ఒకటి చంద్రబాబు దార్శనికత వర్ధిల్లాలని ఆయన కాంక్షించారు. రెండు తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరికే లేదన్నారు. అక్కడ జరుగుతున్న గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు ఈ ప్రకటలకు పొంతనే లేదు.

ఈ రోజు ఆయన జరిపిన గిరిజన ప్రాంతాల పర్యటనకు ‘అడవి తల్లి బాట’ అని పేరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఒక సభలో ప్రసంగిస్తూ ఆయన టిడిపి నాయకత్వంలోని ఎన్ డిఎ నే ఆంధ్రప్రదేశ్ లో రాబోయే 15 సంవత్సరాల వరకు అధికారంలో ఉంటుందని పునరుద్ఘాటించారు.

‘ మరొక 15 ఏళ్ళ పాటు కూటమి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. రాష్ట్రానికి మేలు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తారు, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు,””అని ముఖ్యమంత్రిని ప్రశంసించారు.

గిరిజన ప్రాంతాలలో రోడ్ల నిర్మాణానికి నిధులు కావాలని కోరితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందిస్తూ 24 గంటల్లో రు. 49 కోట్లు మంజూరు చేశారని పవన్ కల్యాణ్ చెప్పారు.

గిరిజనుల కష్టంలో అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని చెబుతూ దేశం మొత్తం పర్యాటకులను ఆకర్షించే అరకు పర్యాటక అభివృద్ధి కోసం సీఏం చంద్రబాబు .పర్యాటక మంత్రి దుర్గేష్‌లతో మాట్లాడతానని అన్నారు.

“గత వైసిపి ప్రభుత్వం కేవలం 90 కిలోమీటర్ల రోడ్లు వేస్తే, కూటమి కేవలం ఎనిమిది నెలల్లో 1,069 కిలోమీటర్లు పూర్తి చేసింది. రెండు పరిపాలనల మధ్య నిజమైన తేడా ఇది. దీన్ని గమనించాలి,” అని ఆయన అన్నారు.

గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ప్రజలు వైసిపికి ఓటేసి గెలిపించినా , కూటమికి ఓట్లు వెయ్యక పోయినా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని ఆయన చెప్పారు. ట్లు వేసినా వేయకపోయినా గిరిజనులకు అండగా నిలబడడం తమ బాధ్యత అని అడగగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేశారని అన్నారు.


Read More
Next Story