అందరికంటే రిచ్చెస్ట్ మ్యాన్ పవన్ కళ్యాణ్
x

అందరికంటే రిచ్చెస్ట్ మ్యాన్ పవన్ కళ్యాణ్

ఎపిలో అందరికంటే రిచ్చెస్ట్ మ్యాన్ పవన్ కళ్యాణ్. ఎలా రిచ్చెస్ట్ మ్యాన్ గా మారారు. సీఎం చంద్రబాబు నాయుడు పవన్ ను రిచ్చెస్ట్ మ్యాన్ గా ఎందుకు పేర్కొన్నారు.


ఏపీలో ప్రస్తుతం అత్యంత ధనవంతుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ అంశం రాష్ట్రమంతా చర్చగా మారింది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పంచాయతీలకు నిధులు సమకూర్చటం, వేల సంఖ్యలో పనులు గుర్తించి వేల కోట్లు ఇస్తూ ఆదేశాలు జారీ చేయడం చర్చగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సంవత్సరం నిధులు గతంలో దారి మళ్లాయి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీల అకౌంట్స్ కు చేరే విధంగా చర్యలు తీసుకున్నారు. అదే విధంగా ఉపాధిహామీ నిధులు నేరుగా పంచాయతీలు, మండల ప్రజా పరిషత్ ల ద్వారా ఖర్చు చేయించేందుకు నిర్ణయించుకున్నారు. ప్రతి కూలీ ఉపాధి హామీ నిధులతో వంద రోజులు పనిచేయాలని, మస్టర్ తప్పనిసరిగా ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్పి అందుకు శ్రీకారం చుట్టారు.

గ్రామ పంచాయతీల్లో 17వేల కిలో మీటర్ల సిమెంట్ రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకున్నారు. అదే విధంగా పదివేల కిలో మీటర్ల పొడవున డ్రైనేజీ కాలువలు నిర్మించేందుకు తగిన ప్రతిపాదనలు తయారు చేశారు. ఈ మేరకు పల్లె పండుగ కార్యక్రమాల్లో భాగంగా ప్రస్తుతం శంకుస్థాపనలు చేపట్టారు. వెను వెంటనే పనులు కూడా చేపట్టాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇవే కాకుండా పంచాయతీల్లో ఉండే సాధారణ నిధుల నుంచి రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణాలు చేపడుతున్నారు.

గ్రామీణాభివృద్ధి శాఖలో ఈ లెక్కన వేల కోట్ల నిధులు ఉన్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ప్రస్తుతం బాగా నిధులు ఉన్న శాఖ ఏదైనా ఉందంటే అది గ్రామీణాభివృద్ధి శాఖేనని సీఎం చెప్పటం విశేషం. ప్రస్తుతం గ్రామాల్లో రోడ్లు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. వేల కిలో మీటర్ల రోడ్లు వాహనాలు తిరిగేందుకు పనికి రావడం లేదు. కనీసం ట్రాక్టర్ కూడా తిరగలేని పరిస్థితుల్లో ఉన్నాయి. బైకులపై వెళ్లాలంటే ఇక నరకం అనుభవించాల్సిందే. రోడ్లు బాగ లేని కారణంగా స్కూలు బస్ లు కూడా తిరగటం ఇబ్బందిగా మారింది. దీంతో రోడ్లను మరమ్మతు చేసే కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఉపాధి హామీ నిధులు 60శాతం మనుషులతో చేయించాల్సి ఉంటుంది. మిగిలిన 40 శాతం పనులు మెటీరియల్ కాంపొనెంట్ కింద ఖర్చు చేసేందుకు అవకాశం ఉంది. అందువల్ల సిమెంట్ రోడ్లు నరేగా నిధుల నుంచి చేయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే మంచి నీరు అందించే కార్యక్రమాలకు గ్రామీణాభివృద్ధి శాఖ శ్రీకారం చుట్టింది. గుడివాడ నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లోనూ మంచినీరు కలుషితమై ఎర్రగా వస్తోందని స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఒక సభలో ఈ అంశం లేవనెత్తడంతో పవన్ కళ్యాణ్ అక్కడికక్కడే అధికారులను పిలిపించి ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకోవాలని ఆదేశించారు. వారు ఇచ్చిన నివేదిక ప్రకారం మంచినీరు అందించేందుకు ప్రత్యేక ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నారు. స్వచ్ఛమైన నీటిని ఇకపై అందించేందుకు చర్యలు చేపట్టారు. మంచినీరు సరిగా లేని గ్రామాలను గుర్తించి తాగునీరు అందించేందుకు తగిన ప్రణాళికలు రూపొందించే పనిలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఉంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకే పవన్ కళ్యాణ్ అత్యంత రిచ్చెస్ట్ మ్యాన్ అని చెప్పారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి వద్ద కూడా తగినన్ని నిధులు లేవని, ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న నిధుల్లో నరేగా నుంచి భారీగా నిధులు ఉన్నాయని సీఎం చెప్పారు. ఎన్నో మంచి పనులు చేపట్టేందుకు నరేగా నిధులు ఉపయోగపడతాయని పాలకులు భావిస్తున్నారు.

Read More
Next Story