
పవన్ కల్యాణ్ సీరియస్..భీమవరం డీఎస్పీపై వేటు
డీఎస్పీ జయసూర్య గతంలో గన్నవరం DSPగా పనిచేసి, కేంద్రం నుంచి ప్రతిష్ఠాత్మక అవార్డు కూడా అందుకున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీరియస్ అయిన భీమవరం డీఎస్పీ ఆర్.జి.జయసూర్యపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం, సివిల్ వివాదాల్లో తలదూర్చడం వంటి ఆరోపణలు జనసేన శ్రేణుల నుంచి వచ్చిన నేపథ్యంలో ఆయన్ను తక్షణమే డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో భీమవరం నూతన డీఎస్పీగా రఘువీర్ విష్ణు నియమితులయ్యారు. ఆ మేరకు గురువారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
నేపథ్యం, ఆరోపణలు
భీమవరం సబ్‌డివిజన్ పరిధిలో పేకాట (గ్యాంబ్లింగ్) శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాల్లో అనవసర జోక్యం చేసుకుంటున్నారని, కొందరి పట్ల పక్షపాతం చూపిస్తున్నారని, కూటమి (NDA) నేతల పేర్లను మిస్‌యూస్ చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చాయి. అక్టోబర్ 2025లోనే ఈ ఆరోపణలు మొదలయ్యాయి, అప్పుడు పవన్ కల్యాణ్ వెంటనే జిల్లా SP అద్నాన్ నయీం అస్మికి ఫోన్ చేసి, DSPపై నివేదిక పంపాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఇలాంటి వ్యవహారాలను ఉపేక్షించదని స్పష్టం చేశారు. అదే సమయంలో, హోం మంత్రి, DGPకి ఈ విషయాన్ని తెలియజేయాలని తన కార్యాలయ అధికారులకు పవన్ కల్యాణ్ సూచించారు. అప్పట్లో ఈ అంశం సంచలనం రేకెత్తించింది.
అక్టోబర్‌లో ఈ వివాదం NDA లోపల కూడా రగడ సృష్టించింది. డిప్యూటీ స్పీకర్, TDP ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు (RRR) జయసూర్యను మంచి, సమర్థవంతమైన అధికారి అని డీఎస్పీ జయసూర్య సమర్థించారు. పవన్ కల్యాణ్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన అప్పట్లో అన్నారు. ఇది కూటమి లోపల భేదాభిప్రాయాలను తెరపైకి తెచ్చింది. కానీ చివరికి ఆ డిస్పీపై వేటు వేసి పవన్ కల్యాణ్ పంతం నెగ్గించుకున్నారని కూటమి వర్గాలు చర్చించుకుంటున్నారు.
ప్రభుత్వ స్పందన, చర్యలు
ఈ ఫిర్యాదులు, నివేదికల ఆధారంగా, DGP హరీశ్ కుమార్ గుప్తా జయసూర్య బదిలీకి ఉత్తర్వులు జారీ చేశారు. హోం మంత్రి అనిత కూడా DSP వ్యవహారంపై తమ వద్ద నివేదిక ఉందని, చర్యలు తప్పవని అక్టోబర్‌లోనే ప్రకటించారు. ఇది సంక్రాంతి ముందు జరగడం వల్ల, గోదావరి జిల్లాల్లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఉపయోగపడుతుందని విశ్లేషకులు అంటున్నారు. డీఎస్పీ జయసూర్య గతంలో గన్నవరం DSPగా పనిచేసి, కేంద్రం నుంచి ప్రతిష్ఠాత్మక అవార్డు కూడా అందుకున్నారు. అయితే, ఈ ఆరోపణలు చివరికి బదిలీకి దారితీశాయి.

