వారాహి అమ్మవారి దీక్షలో పవన్ కళ్యాణ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష 2024 జూన్ 26 నుంచి చేపడతారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు దీక్షకు సంబంధించిన దుస్తులు మంగళవారం ధరించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ శాసనసభ్యులకు శాసన సభ నిబంధనల గురించి వివరించే సమావేశంలో పాల్గొన్నారు. అమ్మవారి దశావతారాల్లో వారాహి ఒక అవతారమని పండితులు చెబుతున్నారు. నేటికీ కాశీపట్నం గ్రామ దేవత వారాహి అమ్మవారేనని పండితులు చెప్పారు. వారాహి అమ్మవారు వరాహ రూపంలో ఉంటారని, దీక్ష బూనే వారు ఏ విధమైన దీక్షలో ఉండాలో పండితులను సంప్రదించి నిర్ణయించుకుంటారు. దీక్షలో భాగంగా పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే పవన్ కళ్యాణ్ తీసుకుంటారు. గత ఏడాది జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ విజయ యాత్ర నిర్వహించారు. అప్పట్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష చేశారు. ఈనెల 26 నుంచి 11 రోజుల పాటు దీక్ష చేపడుతున్నట్లు రాష్ట్ర కార్యాలయ మీడియా విభాగం ప్రకటించింది.