
పవన్ కల్యాణ్‌కి వైరల్ ఫీవర్
చిరంజీవిపై బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు, హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్తున్నారు. పవన్ కల్యాణ్ గత నాలుగు రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత తగ్గకపోవడంతో పాటు తీవ్రమైన దగ్గు కారణంగా ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆయన ఈ రోజు మంగళగిరి నుంచి హైదరాబాద్‌కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. ఆ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటనను కూడా విడుదల చేసింది. వారి సోషల్ మీడియాలో కూడా పేర్కొంది. గతంలో కూడా పవన్ కల్యాణ్ వైరల్ జ్వరం బారిన పడిన సందర్భాలు ఉన్నాయి, అలా వైరల్ ఫీవర్‌తోనే ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి గతంలో తమిళనాడు తీర్థయాత్రలు చేపట్టారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పవన్ కల్యాణ్ జ్వరంతో ఉన్నప్పటికీ పాల్గొని, తన శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అయితే, సోమవారం రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరగడంతో ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో బొండా ఉమా పవన్ కల్యాణ్‌ను పొల్యూషన్‌కు సంబంధించిన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారనే చర్చ కూడా ఉంది. టీడీపీ పెద్దలు కావాలనే అతని చేత ఇబ్బంది కరమైన ప్రశ్నలు అడిగించారనే విమర్శలు జనసేన శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. దీంతో పాటుగా గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏకంగా పవన్ కల్యాణ్ అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి మీద చర్చ జరగడం, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి, వీటిపైన చిరంజీవి కూడా స్పందించారు. మీడియాకు ప్రకట కూడా విడుదల చేశారు. సామ్యానులైనా, ముఖ్యమంత్రులనైనా ఒకే పద్దతిలో తన సహజ సిద్ద శైలితో చూస్తానని మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణకు బదులిచ్చారు.
ఇదిలా ఉండగా, గురువారం పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం ప్రీమియర్ షోలతో భారీ విజయాన్ని సాధించింది. నైజాంలో 372 ప్రీమియర్ షోలతో రికార్డు çసృష్టించిన ఈ సినిమా, అమెరికాలో 3 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిందనే టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్ర విజయంపై స్పందిస్తూ, ‘‘పవన్ కల్యాణ్‌ను అందరూ ఓజాస్ గంభీరంగా సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది,’’ అని ట్వీట్ చేశారు. దర్శకుడు సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య, సంగీత దర్శకుడు తమన్‌తో సహా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు మరియు సినీ ప్రముఖుల నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తోంది.
రాజకీయ సినిమా ఒత్తిళ్ల మధ్య పవన్
పవన్ కల్యాణ్ ఈ సమయంలో రాజకీయ బాధ్యతలు, సినిమా ప్రమోషన్ రెండింటినీ సమతుల్యం చేసుకోవడంలో నానా తంటాలు పడుతున్నారనే చర్చ కూడా ఉంది. ‘ఓజీ’ ప్రీ–రిలీజ్ ఈవెంట్‌లో హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో వేలాది అభిమానుల మధ్య పాల్గొన్న ఆయన, ‘‘నేను డిప్యూటీ సీఎం అనే విషయం మర్చిపోయాను,’’ అని ఉత్సాహంగా వ్యాఖ్యానించారు.
Next Story