సనాతనంలో పడి సమంత వివాదాన్ని పట్టించుకోలేదా ?
ఒకవైపు సినీ సెలబ్రిటీలు ఇంతమంది సురేఖపై ట్వీట్లతో విరుచుకుపడుతుంటే ఒక్క ప్రముఖుడు మాత్రం తనకేమీ పట్టనట్లుగా ఉండిపోయారు.
తాజా వ్యవహారాలను చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. రెండుమూడు రోజుల నుండి తెలంగాణా రాజకీయాలు-సినీ ఇండస్ట్రీలో మంత్రి కొండా సురేఖ ఆరోపణలు సంచలనంగా మారాయి. సమంత-నాగచైతన్య విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని కొండా సురేఖ చేసిన ఆరోపణలు సంచలనంగా మారింది. సెలబ్రీటల విడాకులకు కారణాన్ని కూడా కొండా పదేపదే వివరించారు. (ఇపుడా కారణాన్ని కొత్తగా చెప్పాల్సన అవసరంలేదని ప్రస్తావించటంలేదు) నిజంగా కొండ చెప్పిన కారణం వినటానికి కూడా చాలా ఇబ్బందిగా మారింది. అలాంటి కారణాన్ని మంత్రి పదేపదే మీడియాలో చెప్పటంతో సినీఫీల్డును ఒక్కసారిగా కుదిపేసింది.
ఎప్పుడైతే కొండా సురేఖ కారణాన్ని చెప్పారో వెంటనే సినీఫీల్డులోని ప్రముఖులు ఒక్కోరుగా స్పందించటం మొదలుపెట్టారు. రెండురోజుల్లో చాలామంది సినీ ప్రముఖులు అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి మద్దుతుగా ట్విట్లు పెట్టడమే కాకుండా అదే ట్వీట్లో మంత్రిని చెడామడా వాయించేశారు. సరే, ఎవరికి తోచిన రీతిలో సెలబ్రిటీలు మంత్రిని తప్పుపట్టారు. ఆరోపణలకు సెంటర్ పాయింట్ అయిన కేటీఆర్, నాగార్జున విడివిడిగా మంత్రిపై లీగల్ కేసులు దాఖలు చేశారు. తన ఆరోపణలకు మంత్రి దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి ? లీగల్ ఫైట్ లో చివరకు ఏమవుతుందన్నది వేరే విషయం.
ఒకవైపు సినీ సెలబ్రిటీలు ఇంతమంది సురేఖపై ట్వీట్లతో విరుచుకుపడుతుంటే ఒక్క ప్రముఖుడు మాత్రం తనకేమీ పట్టనట్లుగా ఉండిపోయారు. అదెవరంటే సనాతన ధర్మానికి కొత్త ఛాంపియన్ అవుదామని ప్రయత్నాలు మొదలుపెట్టిన ఏపీ డిప్యుటి సీఎం పవన్ కల్యాణే. సమంతతో పవన్ అత్తారింటికి దారేది అనే బ్లాక్ బస్టర్ సినిమా చేశాడు. తన కోస్టార్ పై వినటానికే ఇబ్బందిపడే ఆరోపణలను ఒక మంత్రి మీడియాలో చేసినా పవన్ ఎందుకని ఇప్పటివరకు స్పందించలేదు ? అన్నదే ఆశ్చర్యంగా ఉంది. అక్కినేని ఫ్యామిలికి మద్దతుగా, సమంతకు సానుభూతిగా మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, అల్లు అర్జున్, వరుణ్ తేజ కూడా ట్వీట్లు చేశారు.
మూడురోజులుగా సినీఫీల్డును పట్టి ఊపేస్తున్న కొండా సురేఖ ఆరోపణలపై పవన్ ఎందుకు స్పందించలేదో ఎవరికీ అర్ధంకావటంలేదు. పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే సనాతన ధర్మం బిజీలో ఉన్న కారణంగానే పవన్ ఇతర విషయాలను పట్టించుకోలేదని తెలిసింది. అక్కినేని ఫ్యామిలీ, సమంత, కేటీఆర్ విషయాలపై కొండా సురేఖ ఆరోపణలు చేసినపుడు ప్రాయశ్చిత దీక్షను విరమించే బిజీలో తిరుమలలో ఉన్నారు. తర్వాత సనాతన ధర్మం అంశంపై కసరత్తులో ఉన్నారు. ఆ తర్వాత సనాతన ధర్మం అంశంపై జరిగిన బహిరంగసభ ప్రిపరేషన్లో ఉన్నారట. అందుకనే అక్కినేని-సమంత-కేటీఆర్ అంశంపై స్పందించేంత తీరిక పవన్ కు దొరకలేదని పార్టీవర్గాల సమాచారం. అయితే ఇక్కడ ఒక చిన్న అనుమానం. అదేమిటంటే సనాతన ధర్మంపై జరిగిన బహిరంగసభలో పవన్ అనేక అంశాలను ప్రస్తావించారు.
తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు వైసీపీ నేతలు తనపై చేసిన ఆరోపణలు, చేసిన ట్రోలింగులు, సనాతన ధర్మం వైరస్ లాంటిది అని వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పైన కూడా విరుచుకుపడ్డారు. ఇన్ని అంశాలను ప్రస్తావించిన పవన్ మరి సెలబ్రిటీ సమంత, అక్కినేని ఫ్యామిలీకి మద్దతుగా, వాళ్ళపై ఆరోపణలు చేసిన కొండాసురేఖపైన ఒక్కమాట కూడా ఎందుకు మట్లాడలేదు ? పైన చెప్పుకున్నట్లుగా సనాతన ధర్మం జోరులో ఇష్యూని పట్టించుకోలేదా ? లేకపోతే ఏపీ డిప్యూటి సీఎంగా ఉండి తెలంగాణా వివాదంలో సినీ సెలబ్రిటీలు కేంద్రబిందువు అయినా సరే జోక్యం చేసుకోవటం ఎందుకులే అని దూరంగా ఉండిపోయారా ?