పవన్ కల్యాణ్ అలా భూమి కొన్నాడు.. ఇలా రేట్లు పెరిగాయి
ఇల్లు కట్టుకోవడం కోసం పవన్ కల్యాణ్ పిఠాపురం ప్రాంతంలో భూమి కొనుగోలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భూముల రేట్లు భారీగా పెరిగాయి. అయినా కొనేందుకు జనసేన పార్టీ శ్రేణులు క్యూ కడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురంలో తన ఇంటి నిర్మాణం కోసం కొంత భూమిని కొనడంతో చుట్టు పక్కల ప్రాంతాల భూములకు ఒక్క సారిగా భారీగా రేట్లు పెరిగి పోయాయి. పిఠాపురం పట్టణ శివారు ప్రాంతం ఇల్లింద్రాడ దగ్గరలోని గొల్లప్రోలు వైపు వెళ్లే 216వ నేషనల్ హైవే పక్కన దాదాపు 3.52 ఎకరాలు కొనుగోలు చేశారు. ఈ లావాదేవీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తి అయ్యాయి. దీనిలో ఇల్లుతో పాటు తన క్యాంపు కార్యాలయాన్ని కూడా కట్టనున్నారు. దీనికి సంబంధించిన ప్లాన్ సిద్ధం కూడా ఇది వరకే సిద్ధమైందనే టాక్ వినిపిస్తోంది.
అయితే పవన్ కల్యాణ్ ఇంటి నిర్మాణం కోసం భూమి కొనుగోలు చేసిన విషయం దావాలా వ్యాపించింది. సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారడంతో తాము కూడా ఆ చుట్టు పక్కల భూములను కొనుగోలు చేసేందేకు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరికి చెందిన పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసక్తిని కనబరుస్తున్నారు. తమ నాయకుడు పవన్ కల్యాణ్ కొనుగోలు చేసిన చోటనే తాము కూడా స్థలం కొనుగోలు చేసుకుంటే భవిష్యత్ ఉంటుందనే ఆశతో ఆసక్తిని కనబరుస్తున్నారు. కనీసం ఐదు ఎకరాల నుంచి అర ఎకరమైనా కొనుగోలు చేయాలనే మీడియేటర్ల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలోని మధ్యవర్తులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు భూముల వేటలో ప్రస్తుతం బిజీ అయినట్లు చర్చ సాగుతోంది. పిఠాపురం, గొల్లప్రోలు ప్రాంతాల పరిధిలో ఈ వాతావరణం ఎక్కువుగా ఉంది.
పిఠాపురం ప్రాంతంలో పవన్ కల్యాణ్ భూములు కొనుగోలు చేయడంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాల భూముల రేట్లకు ఒక్క సారిగా రెక్కలొచ్చాయి. భూములకు గిరాకీ పెరగడంతో ఓవర్ నైట్ ధరలు పెరిగి పోయాయి. రోడ్డు పక్కన ఉన్న ఎకరం భూమి రూ. 2 కోట్లు, కాస్తా లోపలకు ఉన్న భూములు రూ. కోటి నుంచి రూ. 50 లక్షల వరకు ఉన్నాయి. అయితే ధరలు ఎక్కువుగా ఉన్నాయనే కారణంతో కొనేందుకు ఎవరు ముందుకు రాలేదు. పవన్ కల్యాణ్ ప్రభావంతో ఆ భూములకు డిమాండ్ పెరిగింది. దీంతో కొనుగోలు దారులు పెరిగారు. దీంతో వాటికి రేట్లు పెరిగాయి. రోడ్డు పక్కన ఉన్న భూమి రూ. 3 కోట్లు, కాస్త లోపల ఉన్న భూమి రూ. 80లక్షల నుంచి రూ. 1.90 కోట్ల వరకు పెరిగి పోయినట్లు టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు కొనుగోలు చేసిన భూమి కాకుండా పెద్ద మొత్తంలో మరి కొంత భూమిని కొనుగోలు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆలోచనలు చేస్తున్నారు. దాదాపు 16 ఎకరాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఆ భూలకు సంబంధించిన రైతులతో ఇప్పటికే పవన్ కల్యాణ్ మనుషులు మాట్లాడారని, ఆ మేరకు ఒక ఒప్పందానికి కూడా వచ్చినట్లు ఆ ప్రాంతంలో చర్చించుకుంటున్నారు.
అయితే ఇంటి కోసం కొన్న భూములు పక్కన పెట్టితే తక్కిన 16 ఎకరాల భూములు ఎందుకు కొనుగోలు చేయాలనుకుంటున్నారు, ఎవరి కోసం కొనుగోలు చేయాలనుకుంటున్నారు, దానిలో ఏమైనా పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారా వంటి అంశాలు ఆ ప్రాంతపు వాసుల్లో చర్చనీయాంశంగా మారాయి. మరో వైపు ఎన్నికల ప్రచారంలో పిఠాపురం ప్రాంతాన్ని పారిశ్రామికంగా డెవలప్ చేస్తామని, ఇక్కడ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇతర దేశాల్లో ఉన్న పవన్ కల్యాణ్ స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం మారడం, ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఎదగడంతో ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారమే సాఫ్ట్‌వేర్ సంస్థల నిర్మించి ఉద్యోగాలు కల్పించేందుకే పెద్ద మొత్తంలో భూములను కొనుగోలు చేసేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారనే టాక్ నడుస్తోంది.
ఎన్నికల సమయంలోనే పిఠాపురంలో ఇల్లు కట్టుకుని, పిఠాపురం ప్రజల మధ్యనే ఉంటానని ప్రకటించారు. ఆ మేరకు భూమిని కొనుగోలు చేశారు. ఎవరి వద్ద కొనుగోలు చేశారు, ఆ భూమి ఎక్కడుందని తెలుసుకునేందుకు ఆయన అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నాలుగు అంతస్థుల భవనాన్ని ఇది వరకే ఎన్నికలకు ముందే పవన్ కల్యాణ్ కొనుగోలు చేశారు.
Next Story