‘నాకోసం అవి తీసుకురండి’.. విజిటర్లకు పవన్ విజ్ఞప్తి
తన మార్క్ పాలన చూపుతున్న పవన్ కల్యాణ్ మరోసారి తన వినూత్న ఆలోచనతో అందరి మన్ననలు పొందుతున్నారు. తనను కలవడానికి వచ్చే వారు ప్రజలకు ఉపయోగపడే బహుమతులు తేవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాన్ తనదైన మార్క్ చూపుతున్నారు. అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వారికి ఆదేశాలు జారీ చేస్తూ వ్యవస్థలను గాడిన పెట్టడంపై ఫోకస్డ్‌గా ముందుకు సాగుతున్నారు పవన్ కల్యాణ్. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలను, సమస్యలను తెలుసుకుంటే వాటిని సత్వరం పరిష్కరించడానికి కృషి చేస్తూ ప్రజల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం తనకు అప్పగించి శాఖలపై కూడా ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఒకవైపు తన శాఖలపై పట్టు సాధించడానికి శ్రమిస్తూనే మరోవైపు ప్రజల సమస్యల పరిష్కారం కోసం అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనను కలవడానికి వచ్చే వారిని ఓ విజ్ఞప్తి చేశారు పవన్ కల్యాన్. తన దగ్గరకు వచ్చే ఏం తీసుకురావాలి అన్న అంశాన్ని పవన్ కల్యాణ్ వివరించారు.
శాలువా, బొకే వద్దు
‘‘నన్ను కలవడానికి వచ్చే వారు ఎవరైనా బొకేలు, శాలువాలు, విగ్రహాలు వంటివి తీసుకురాకండి. కచ్ఛితంగా ఏమైనా తీసుకురావాల్సిందే అనిపిస్తే వాటి స్థానంలో ప్రజలకు ఉపయోగపడేవీ మరేవైనా తీసుకురండి. బొకేలు, శాలువాల బదులుగా వాటికి అయ్యే ఖర్చుతోనే కూరగాయలో, పండ్లో తీసుకురండి.. వాటిని అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకో అందించొచ్చు. అవి తీసుకురావడం కుదరదు అనిపిస్తే.. వాటి కొనుగోలు ఖర్చు చేసే నగదును టోకెన్ రూపంగా అందిస్తే.. అన్న క్యాంటీన్ల ద్వారా పేదలను రూ.5కే భోజనం అందించడానికి వాటిని వినియోగిస్తాం. నన్ను కలవడానికి వచ్చే వారిని నేను కోరేది ఇదే’’ అని చెప్పారాయన.
పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తి మేరకు ఆయనను కలవడానికి వచ్చిన జనసేన ఎంపీలు బొకేలు, శాలువాల బదులుగా కూరగాయలు తీసుకుని వచ్చారు. ఈ వినూత్న ఆలోచనను మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం తన దగ్గరకు కూరగాయల బుట్టలతో వచ్చిన ఎంపీలు బాలశౌరి, ఉదయ్‌లను పవన్ కల్యాణ్ అభినందించారు. మనం చేసే ప్రతి పని పది మందికి పనికొచ్చేలా ఉండాలని, ఆ దిశగానే ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోందని వారు చెప్పుకొచ్చారు. అయితే పవన్ కల్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సంచలనంగా మారింది. ప్రజానాయకుడు అంటే ఇలా ఉండాలంటూ కొందరు ప్రశంసిస్తున్నారు.