
మత్స్యకారుల సమస్యలపై పవన్ కల్యాణ్ 'ఫాస్ట్ ట్రాక్'.. చంద్రబాబు 'సైలెంట్ మోడ్'
మత్యకార గ్రామాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సముద్ర తీరం కలుషితమై జలచరాలు చచ్చిపోతున్నాయి. ఇందులో రాజకీయ గేమ్ ఏమిటి?
ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారుల సమస్యలు కొత్తవి కావు. కానీ రెండు సంవత్సరాలుగా రాజకీయ మార్పుల మధ్య ఈ సమస్యలు మరింత తీవ్రతరం చెందాయి. పర్యావరణ కాలుష్యం, తీరప్రాంత కోత, ఆదాయాల దెబ్బ, ఫిషింగ్ హార్బర్ లోపాలు, ఇవన్నీ మత్స్యకారులను ఆకలితో పోరాడేలా చేస్తున్నాయి. ఇక్కడే ఉప ముఖ్యమంత్రి కె పవన్ కల్యాణ్ '100 రోజుల్లో పరిష్కారం' అని ప్రకటించి చర్యలు చేపట్టడం, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మౌనంగా ఉండటం అనేది కేవలం విధానాత్మక భేదాలా? లేక టీడీపీ-జనసేన కూటమి రాజకీయాల్లో దాగి ఉన్న ఆలోచనాత్మక వ్యూహమా? రాజకీయ కోణంలో ఈ అంశాలను రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పర్యావరణం, ఆర్థికం మధ్య మత్స్యాకారుల సంఘర్షణ
ఆంధ్రప్రదేశ్ దేశంలో మత్స్య ఉత్పత్తిలో 29 శాతం, ఎగుమతుల్లో 32 శాతం భాగస్వామి. 1.65 మిలియన్ మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. కానీ ఇటీవలి సంవత్సరాల్లో ఈ రంగం ఒక్కసారిగా కుంగిపోయింది. ఉప్పాడ, కాకినాడ, మచిలీపట్నం, అంతర్వేది వంటి తీరప్రాంతాల్లో ఫార్మా, ఇతర పరిశ్రమల కాలుష్యం వల్ల చేపలు, మత్స్య జీవులు మరణిస్తున్నాయి. ఫలితంగా మత్స్యకారుల ఆదాయాలు 50 నుంచి 60 శాతం తగ్గాయి. గత ఏడాది 18 మంది మత్స్యకారులు సముద్రంలో మరణించారు. అంతేకాకుండా అమెరికా టారిఫ్‌లు వల్ల ష్రింప్ ఎగుమతులు దెబ్బతిన్నాయి. 2.5 లక్షల అక్వా రైతులు కష్టాల్లో పడ్డారు.
ఈ సమస్యలు రాజకీయంగా కూడా సున్నితమైనవి. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ ఈ ప్రాంతంలోని మత్స్యకారులను 'సొంత వారి'గా భావిస్తారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఈ సమస్యలను ప్రధాన అంశంగా చేసుకుని టీడీపీకి మద్దతు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక కూటమిలో చిన్న స్పర్థలు వచ్చాయి. మత్స్యకారులు సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ఉప్పాడలో రస్తా రోకోలు చేసి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రాగలిగారు. ఇది పవన్‌కు ఒక పెద్ద రాజకీయ పరీక్షగా మారింది.
రెండు నెలల క్రితం ఉప్పాడలో నిర్వహించిన సభలో వంద రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తున్న పవన్ కల్యాణ్
'100 రోజుల ప్లాన్', రాజకీయ ఇమేజ్ బిల్డరా?
ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ మత్స్యకారుల సమస్యలపై త్వరితంగా స్పందించారు. ఆక్టోబర్ 9న కాకినాడలో మత్స్యకారులతో సమావేశమై, '100 రోజుల్లో రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తాను' అని ప్రకటించారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి స్పెషల్ కమిటీ ఏర్పాటు, పొల్యూషన్ ఆడిట్, రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా మరణించిన 18 మంది కుటుంబాలకు సాయం వంటి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆక్టోబర్ 7న ప్రభుత్వం GO. ద్వారా కమిటీ ఏర్పాటు పై ఇచ్చిన హామీ నెరవేర్చారు.
ఉప్పాడ, కాకినాడలో 50,000 టైగర్ ప్రాన్ జువెనైల్స్ విడుదల చేసి చేపల స్టాక్ పెంచారు. కోనపాకపేటలో రూ. 2 కోట్లతో మల్టీపర్పస్ హాల్స్ నిర్మాణం, RO ప్లాంట్లు, GPS ట్రాకింగ్, ఐస్ స్టోరేజ్ వంటివి అమలులోకి వచ్చాయి. కేంద్రం 200 నాటికల్ మైళ్లు ఫిషింగ్ లిమిట్ పెంచినందుకు థ్యాంక్స్ చెప్పి, డీప్ సీ ఫిషింగ్‌కు శిక్షణలు ఇస్తున్నారు. తమిళనాడు, కేరళలో ఆర్టిఫిషియల్ రీఫ్‌లు చూడటానికి ఎక్స్‌పోజర్ విజిట్లు ఏర్పాటు చేస్తున్నారు. స్కూబా డైవింగ్, స్పీడ్ బోటింగ్ వంటి కోస్టల్ టూరిజం శిక్షణలు ఇస్తూ అల్టర్నేటివ్ ఆదాయాలు సృష్టిస్తున్నారు.
రాజకీయంగా చూస్తే, ఇది పవన్ కల్యాణ్‌కు ఒక ముందడుగు. పిఠాపురం ఎమ్మెల్యేగా తన 'ప్రజల సమస్యలు' అనే ఇమేజ్‌ను బలోపేతం చేస్తున్నారు. "నేను పోస్ట్ వదులుకుంటాను, పోలిటిక్స్‌లోంచి అడుగు తీసేస్తాను" అని ప్రకటించడం వల్ల మత్స్యకారుల మద్దతు మరింత పెరిగింది. జనసేన పార్టీలో యువత, మధ్యతరగతి మత్స్యకారుల మద్దతు బలపడుతుంది. ఇది 2029 ఎన్నికలకు ముందుగా జనసేనను 'ప్రజా పార్టీ'గా బ్రాండ్ వేయించుకుందని చెప్పొచ్చు.
చంద్రబాబు నాయుడు మౌనం రాజకీయ వ్యూహమా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్స్యకారుల సమస్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏప్రిల్ 26న శ్రీకాకుళం బుదగట్లపాలెంలో 'మత్స్యకార భరోసా' స్కీమ్‌ను ప్రారంభించి, ఫిషింగ్ నిషేద సమయంలో రూ. 20,000 సహాయం ప్రకటించారు. 11 ఫిషింగ్ హార్బర్‌లు ఒక సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పారు. 1.29 లక్షల మత్స్యకార కుటుంబాలకు సహాయం అందించారు. ఆగస్టు 3న US టారిఫ్‌లు అక్వా రైతులపై ప్రభావం చూపుతున్నాయని కేంద్రానికి లేఖ రాశారు. సెప్టెంబర్ 15న అక్వా సెక్టార్‌కు 240 రోజుల మారటోరియం, GST వేవర్, లోన్ సబ్సిడీలు ప్రకటించారు.
కానీ ఉప్పాడ ప్రతిపాదనలు, పవన్ 100 రోజుల ప్లాన్‌పై చంద్రబాబు నేరుగా స్పందించలేదు. అక్టోబర్ 7 GO.కు "థ్యాంక్స్" చెప్పిన పవన్, చంద్రబాబును ప్రస్తావించారు కానీ, సీఎం స్వయంగా ఏ స్టేట్‌మెంట్ ఇచ్చింది లేదు. ఇది రాజకీయంగా ఆసక్తికరం. చంద్రబాబు TDP అధికార పార్టీగా, పరిశ్రమలు (ఫార్మా, అక్వా) పెంపుకు ప్రాధాన్యత ఇస్తారు. కాలుష్యం, పరిశ్రమల మధ్య బ్యాలెన్స్ చేయాలంటే, పవన్‌కు 'ఫ్రీ హ్యాండ్' ఇచ్చి తను బ్యాక్‌ఎండ్‌లో పని చేస్తున్నారేమో. లేకపోతే TDP కోర్ వోటర్లు (పరిశ్రమలు, అక్వా ఎగుమతులు) దెబ్బ తగులకుండా చూస్తున్నారేమో.
కూటమి రాజకీయాలు సమన్వయమా... లేక టెన్షనా?
కూటమి ఏర్పాటు నుంచి పవన్ 'సోషల్ జస్టిస్' ఇమేజ్‌తో ముందంజలో ఉంటున్నారు. చంద్రబాబు 'డెవలప్‌మెంట్' ఫోకస్‌తో బ్యాక్‌ఎండ్‌లో ఉన్నారు. మత్స్యకారుల సమస్యల్లో పవన్ ఫాస్ట్ ట్రాక్ చేస్తుంటే, చంద్రబాబు మౌనంగా ఉన్నారు. ఇది కూటమి సమన్వయం. పవన్ తన పార్టీ బేస్ (కోస్టల్ ఏరియాలు) బలోపేతం చేస్తుంటే, చంద్రబాబు రాష్ట్రవ్యాప్త డెవలప్‌మెంట్‌కు దృష్టి పెట్టారు. కానీ, YSRCP ఈ గ్యాప్‌ను పెద్దగా చేసి, "TDP మత్స్యకారులను వదులుకుంది" అని ప్రచారం చేస్తోంది. ఇది 2029కి ముందు కూటమి సోలిడారిటీకి పరీక్ష.
ఒకవేళ చంద్రబాబు మౌనం కొనసాగితే ఇది జనసేనకు అవకాశం. కానీ TDP కి లాస్. పవన్ ప్లాన్ విజయవంతమైతే, ఇది కూటమి విజయంగా చూపించాలి. లేకపోతే మత్స్యకారుల నిరసలు మళ్లీ తలెత్తి, కూటమి ఐక్యతకు దెబ్బ తగులుతుంది.
పరిష్కారాలు కావాలి, రాజకీయ గేమ్ కాదు
పవన్ కల్యాణ్ చర్యలు స్వాగతించ దగినవి. కానీ 100 రోజులు పూర్తయ్యాక ఫలితాలు కనిపించాలి. చంద్రబాబు నాయుడు స్వయంగా ముందుకు వచ్చి, కూటమి ఐక్యత చూపించాలి. మత్స్యకారులు రాజకీయ వ్యవహారాలకు బదులు నిజమైన పరిష్కారాలు కోరుకుంటున్నారు. లేకపోతే ఈ '100 రోజుల ప్లాన్' కేవలం రాజకీయ ప్రణాళికగా మిగిలి, మత్స్యకారుల సమస్యలు సముద్రంలా కొనసాగతాయి. కూటమి ప్రభుత్వం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా? సమయమే చెప్పాలి.

