ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన పవన్
ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతికి సింగిల్ విండో విధానం మేలు అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్ అంశాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ భూపేందర్ యాదవ్‌తో బుధవారం భేటీ అయ్యారు. ఏపీలో ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దుంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాల మీద కేంద్ర మంత్రితో చర్చించారు. ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని కోరారు. దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని తెలియచేశారు.
బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ప్రతిపాదించిన ప్రకారం ఎర్రచందనం అమ్మకం, ఎగుమతి చేసే విషయంలో సింగిల్ విండో విధానం ఉంటే మేలు జరుగుతుంది. ఈ విధానానికి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ కస్టోడియన్‌గా వ్యవహరిస్తుంది. ఈ ప్రతిపాదనలను పరిశీలించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో ఎర్రచందనం గ్రేడింగ్, వేలం, ఎగుమతి సాగిస్తోంది. దీంతో ఈ–వేలం ద్వారా రెవెన్యూ పెరుగుతుందని వివరించారు. ఎర్రచందనం అరుదైన వృక్ష సంపద. ఆంధ్రప్రదేశ్‌లో ఇది అటవీ ప్రాంతంలోనే పెరుగుతుంది. ఈ క్రమంలో కేంద్రం నిబంధనలను సవరించి ఆంధ్రప్రదేశ్ వెలుపల పట్టుబడిన ఎర్రచందనం సైతం సింగిల్ విండో వేలంలో భాగంగా కస్టోడియన్‌గా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కేలా చూడాలి. దీనివల్ల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, పట్టుబడిన ఎర్రచందనం అమ్ముకోవడానికి కుదరదు. అమ్మకాలు, ఎగుమతులు ఒకే విధానం ద్వారా కొనసాగుతుంది. కేంద్ర పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కస్టోడియన్‌గా కొనసాగుతుందని పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రికి వివరించారు.