
అమరావతి లో ఆ 343.36 ఎకరాల భూమి...
గత ప్రభుత్వం అమరావతిలో డీనోటిఫై చేసిన భూమిలో ఉన్న 343.36 ఎకరాల భూమిని తిరిగి తీసుకునేందుకు సీఆర్డీఏ కు మార్గం సుగమం అయినట్లేనా?
రాజధాని అమరావతి అభివృద్ధికి అడ్డంకులు తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ మంగళవారం (అక్టోబర్ 8) జారీ చేసిన ఉత్తర్వుల్లో, అమరావతి పరిధిలో 343.36 ఎకరాల భూములకు సంబంధించిన గత భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. ఈ నిర్ణయం క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీఏ)కు భూముల సేకరణ ప్రక్రియలో స్పష్టత తీసుకొచ్చేలా చేస్తుందని అధికారులు తెలిపారు. ఇది గత క్యాబినెట్ సమావేశంలోనూ చర్చించి అంగీకరించిన విషయమే.
భూసేకరణ వివాదాల చరిత్ర
అమరావతి రాజధాని నిర్మాణం 2014లో ప్రారంభమైనప్పటి నుంచి భూసేకరణ విషయంలో అనేక అడ్డంకులు, వివాదాలు తలెత్తాయి. 2015లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్ స్కీమ్ - ఎల్‌పీఎస్) పద్ధతిలో 29 గ్రామాల నుంచి సుమారు 34,000 ఎకరాల భూమిని సేకరించింది. ఈ పథకంలో రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చి, బదులుగా అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్ (1,000 చదరపు గజాలు), కమర్షియల్ (250-450 చదరపు గజాలు) ప్లాట్లు, ఏటా రూ. 25,000 యాన్యుటీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి ప్రయోజనాలు పొందారు.
అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) ప్రభుత్వం మూడు రాజధానుల విధానం ప్రకారం అమరావతి ప్రాజెక్టును నిలిపివేసింది. ఈ సమయంలో సుమారు 1,200 ఎకరాల భూములను 'డీనోటిఫై' చేసి, రైతులకు తిరిగి ఇచ్చారు. మిగిలిన 1,800 ఎకరాల భూముల సేకరణకు ప్రభుత్వం 2013 ల్యాండ్ ఎక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ ఇన్ రూరల్ ఏరియాల్ యాక్ట్ (ఎల్‌ఏఆర్‌ఆర్ యాక్ట్) కింద నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ భూముల్లో 343.36 ఎకరాలు ఇప్పటికే రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలకు ఉపయోగించారు. మిగిలిన భూములు పెండింగ్‌లో ఉండటంతో, భూయాజమానులు హైకోర్టులో కేసులు దాఖలు చేశారు.
తాజాగా రద్దు నిర్ణయం
ఈ భూముల సేకరణలో జరిగిన పొరపాట్లు, ఆలస్యాలు, హైకోర్టు కేసులు కారణంగా అడ్వకేట్ జనరల్ సూచనల మేరకు పాత నోటిఫికేషన్‌లను రద్దు చేయాలని పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ 343.36 ఎకరాలు ప్రధానంగా గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠాపురం, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె వంటి గ్రామాల్లో ఉన్నాయి. ఈ భూములు ఇప్పటికే సగభాగం అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగపడ్డాయి, కానీ పూర్తి స్వాధీనం జరగలేదు.
ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నట్లుగా కమిషనర్ అధికారాల ఆధారంగా గుంటూరు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో సీఆర్డీఏ కమిషనర్ ఈ భూములను సేకరించి ఇవ్వాలని కోరుతూ లేఖ రాస్తున్నారు. అవసరమైతే కొత్త నోటిఫికేషన్‌లు జారీ చేసి, ఎల్‌ఏఆర్‌ఆర్ యాక్ట్ కింద ప్రక్రియలు పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియలో భూయాజమానులకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం, పునరావాసం, రెసిడెన్షియల్ ప్లాట్లు అందించే విధంగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
హైకోర్టు కేసులు, రైతుల డిమాండ్లు, పెండింగ్ పిటీషన్లు
ఈ భూసేకరణ వివాదాలు హైకోర్టుకు చేరాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం డీనోటిఫై చేసిన సమయంలో అప్పటి సీఆర్డీఏ అధికారులు భూములు సేకరిస్తామని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై భూయాజమానులు కౌంటర్ కేసులు దాఖలు చేసి, తమ భూములకు 11 సంవత్సరాల నష్టపరిహారం (ఇంట్రెస్ట్ సహా) ఇవ్వాలని కోరారు. హైకోర్టు సీఆర్డీఏ అధికారుల నుంచి సమాధానాలు కోరగా, ఇప్పటి వరకు సరైన ప్రతిస్పందన లేదు.
పెండింగ్ లో పిల్
అదే సమయంలో న్యాయవాది యు మురళీ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం డీనోటిఫై చేసిన భూములను మళ్లీ సేకరణ పద్ధతిలో తీసుకోవాలని కోరుతూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్) దాఖలు చేశారు. ఈ పిటీషన్ పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది కేసుల్లో స్పష్టత తీసుకొచ్చే అవకాశం ఉందని చట్టపరమైన విషయాల్లో లోతైన జ్ఞానం, అనుభవం కలిగిన వ్యక్తులు అభిప్రాయపడ్డారు.
అమరావతి 2.0 విస్తరణ ప్రణాళికలు
ఈ రద్దు నిర్ణయం అమరావతి అభివృద్ధికి కొత్త దిశను సూచిస్తోంది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో అమరావతి ప్రాజెక్టుల కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) ఏర్పాటును ఆమోదించారు. ఇది టౌన్‌షిప్ నిర్మాణం, మౌలిక సదుపాయాలు, నిర్వహణలకు బాధ్యత వహిస్తుంది. అలాగే 20,494 ఎకరాల అదనపు భూమి సేకరణకు (వైకుంఠాపురం, పెదమడ్డూరు, ఎంద్రాయి, కర్లపూడి, లేమల్లె, వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో) సీఆర్డీఏ ఆమోదం ఇచ్చింది. ఇందులో 5,000 ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయం, 2,500 ఎకరాలకు స్పోర్ట్స్ సిటీ, 2,500 ఎకరాలకు గ్రీన్ అండ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ జోన్ అలాట్‌మెంట్‌లు ఉన్నాయి.
అలాగే 65 ఎకరాలు 16 సంస్థలకు (కెఐఎంఎస్ మెడికల్ 25 ఎకరాలు, పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ 12 ఎకరాలు, ఎంఎస్‌కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ 12 ఎకరాలు, ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ 5 ఎకరాలు మొదలైనవి) కేటాయించారు. మొత్తంగా, 30,000-45,000 ఎకరాల అదనపు భూమి ఎల్‌పీఎస్-2025 కింద సేకరించాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. ఈ పథకంలో 2019 తర్వాత కొనుగోలు చేసిన భూములు అర్హత కలిగి ఉండవని, మ్యూచువల్ కన్సెంట్ ఆధారంగా మాత్రమే సేకరణ అని GO.118 (జూలై 1, 2025)లో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతిని 'ఫ్యూచరిస్టిక్ సస్టైనబుల్ స్మార్ట్ సిటీ'గా మార్చే లక్ష్యంతో, రూ. 49,040 కోట్ల ప్రాజెక్టులకు 16 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఇసుక సేకరణకు కూడా ఆమోదం ఇచ్చారు. ప్రస్తుతం 68 ప్రాజెక్టులకు రూ. 42,360 కోట్ల టెండర్లు ఫైనలైజ్ చేసి కన్‌స్ట్రక్షన్ మొదలైంది.
రైతుల ఆందోళనలు, ముందున్న సవాళ్లు
ఈ భూసేకరణలు రైతుల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో డీనోటిఫికేషన్‌ల వల్ల భూములు తిరిగి పొందిన రైతులు, మళ్లీ సేకరణను వ్యతిరేకిస్తున్నారు. మంత్రి పి నారాయణ ఇటీవల రైతులను ఎల్‌పీఎస్‌లో చేరమని ప్రోత్సహించారు. అయితే పారదర్శకత, సమయానుగుణ పరిహారాలు, పునరావాసం వంటి అంశాలు కీలకం. ప్రపంచ బ్యాంకు నిధులతో ముడిపడిన అమరావతి ప్రాజెక్టులో ఈ నిర్ణయాలు రైతుల హక్కులను కాపాడుతూ, అభివృద్ధిని వేగవంతం చేస్తాయని ప్రభుత్వం ఆశాభాసం వ్యక్తం చేసింది.
ఈ ఉత్తర్వులు అమరావతి 2.0కి కొత్త ఊపిరి పోస్తాయని, కానీ హైకోర్టు తీర్పులు, రైతుల సహకారం ద్వారా మాత్రమే విజయవంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.