జనసేన రథసార ధి పవన్ కల్యాణ్ తన పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నారు. కూటమి పాలన మొదలై ఏడాది పూర్తయిన నేపథ్యంలో తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు తరచూ ఏదో ఒక అంశంపై తరచూ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యే వారు. దీంతో అధినేత తమకు చేరువగా ఉన్నారన్న భావనలో జన సైనికులుండే వారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో పాటు మధ్యమధ్యలో సినిమా షూటింగ్‌లతో ఆయన బిజీబిజీ అయిపోయారు. ఫలితంగా పార్టీ క్యాడరుకు మునుపటంతటి చేరువగా ఉండే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో క్యాడరుతో గ్యాప్ రాకూడదన్న ఉద్దేశంతో విశాఖలో గురువారం నుంచి మూడు రోజులు సమీక్షా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సేన తో సేనాని పేరు పెట్టారు. దీనికి ఏపీ, తెలంగాణలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 15 వేల మంది వరకు జన సైనికులు హాజరవుతారని చెబుతున్నారు.
సేనతో సేనాని పోస్టర్
ఏ రోజు ఏ కార్యక్రమం అంటే?
సేనతో సేనానిలో మూడు రోజులు వేర్వేరు కార్యక్రమాలు చేపట్టనున్నారు. తొలిరోజు గురువారం (28న) ఉదయం తొమ్మిది గంటలకు బీచ్‌రోడ్డులోని వైఎంసీఏలో జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ కల్యాణ్ భేటీ అవుతారు. జనసేనకు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పవన్ కల్యాన్ సమావేశమవుతారు. శుక్రవారం పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఆది నుంచి పార్టీ కోసం కష్టించి పని చేసిన కార్యకర్తలు, ఆహ్వానితులతో (నియోజకవర్గానికి పది మంది చొప్పున) సమావేశం నిర్వహిస్తారు. మూడో రోజు శనివారం పార్టీ రాష్ట్ర స్థాయి క్రియాశీల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఆరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ ప్రారంభమవుతుంది. సాయంత్రం ఆరు గంటలకు పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. ఈ సమావేశాల్లో మహిళల బాధ్యత, అందరికీ రక్షిత మంచినీరు, ఉపాధి కల్పన వంటి అంశాలతో పాటు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై చర్చిస్తారు. జనసేన శ్రేణులు, కూటమిలో భాగస్వామి పక్షాలైన టీడీపీ, బీజేపీ నేతలతో ఎలా కలిసి పనిచేయాలి? సోషల్ మీడియా వేదికగా ౖÐð సీపీ దుష్ప్రచాలను తిప్పికొట్టడం తదితర అంశాలపై సమగ్ర చర్చ ఉంటుంది. ఇంకా పలు అంశాలపై చర్చించడం, భవిష్యత్తు ప్రణాళికలు, కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తూ, జనసేన పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంపై పవన్ కార్యకర్తలకు రోడ్‌మ్యాప్‌ను నిర్దేశిస్తారు.
కార్యక్రమ పోస్టర్‌ను విడుదల చేస్తున్న నాదెండ్ల మనోహర్
ప్రాంగణాలకు ప్రముఖుల పేర్లు..
కాగా 30న జరిగే కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా పేరు పెట్టారు. ఇక ముఖద్వారాలకు తెన్నేటి విశ్వనాథం, కోడి రామ్మూర్తి, గురజాడ అప్పారావు, వీరనారి గుండమ్మ, మహాకవి శ్రీశ్రీల పేర్లను ఖరారు చేశారు. అల్లూరి ప్రాంగణానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే కార్యకర్తలు హాజరవుతారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి కోసం ఇప్పటికే డిజిటల్ పాస్‌లు జారీ చేశారు. మరికొన్ని పాస్‌లను జిల్లాల అధ్యక్షులు నేరుగా అందజేస్తారు.
ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న జనసేన నేతలు
విశాఖలో జనసేన జెండాల రెపరెపలు..
విశాఖలో గురువారం నుంచి మూడు రోజులు జరిగే సేనతో సేనాని కార్యక్రమం నేపథ్యంలో జన సైనికులు హంగామా చేస్తున్నారు. తమ అధినేత పవన్ కల్యాణ్ దృష్టిలో పడడానికి నగరంలో పలు చోట్ల జనసేన జెండాలు, ఫ్లెక్సీలు, అధినేత కటౌట్లను ఏర్పాటు చేశారు. దీంతో æనగరంలో జనసేన శ్రేణుల హడావుడి కనిపిస్తోంది. కొద్దిరోజుల నుంచి జనసేన పీఏసీ చైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖలోనే మకాం వేసి సేనతో సేనాని కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మూడు రోజుల కార్యక్రమాల వివరాలను తెలియజేశారు.