బడ్జెట్‌పై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే
ఆంధ్ర ప్రదేశ్‌కు అమూల్యమైన ప్రోత్సాహం ఇస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
దేశ సమ్మిళిత అభివృద్ధి కోసం స్పష్టమైన లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. 2047 నాటికి మనం అభివృద్ధి చెందిన దేశాల చెంతన నిలిపేందుకు వికసిత్ భారత్ విజన్‌ను ప్రకటించారు. 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ మన దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపించేలా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అనానరు. రాజకీయ అవసరాల కంటే దేశం, ప్రజలు ముఖ్యం అనే కేంద్ర ప్రభుత్వ సమున్నత దృక్పథం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనిపించింది. రైతులు, మహిళలు, మధ్యతరగతి, యువత, ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకున్నారు.
రూ.10 లక్షల విలువైన క్రెడిట్ కార్డులు మంజూరు చేయడం వల్ల సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు ఊతం దొరుకుతుంది. అదే విధంగా 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.2 కోట్ల రుణాలు ఇవ్వడం ద్వారా ఆ వర్గాల్లోని మహిళల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది. రూ.12 లక్షల వరకూ వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు మూలంగా ఉద్యోగ వర్గాలకు ఎనలేని ఊరట లభిస్తుంది. ఈ తరహా సంస్కరణలు కచ్చితంగా మధ్యతరగతి వర్గాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తాయి. పీఎం దన్ ధాన్య యోజన మూలంగా వెనకబడ్డ జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు గిడ్డంగుల నిర్మాణానికి, నీటి పారుదల వ్యవస్థ ఆధునికీకరణ, ఋణ సౌకర్యాలు కల్పన తప్పనిసరిగా రైతులకు ప్రోత్సాహం లభిస్తుంది. కిసాన్ కార్డుల పరిమితి రూ.5 లక్షలకు పెంచడం స్వాగతించదగ్గ అంశమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.