ఓవైసీలో ‘దేశభక్తి’ పొంగిపొరులుతోంది
x
AIMIM President Asaduddin Owisi

ఓవైసీలో ‘దేశభక్తి’ పొంగిపొరులుతోంది

దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఓవైసీ తాను వెళ్ళినచోటల్లా పాకిస్ధాన్ ప్రేరేపిత ఉగ్రదాడులను ఖండిస్తు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తీవ్రమైన ప్రకటనలతో రెచ్చిపోతున్నారు


ఇపుడీ విషయమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కొద్దిరోజులుగా జై హింద్ అని, పాకిస్ధాన్ కు బుద్ధి చెప్పాల్సిందే అని, పాకిస్ధాన్ భవిష్యత్తులో మనదేశంవైపు తలెత్తిచూడకుండా దెబ్బకొట్టాల్సిందే అని పదేపదే చెబుతున్నారు. పాకిస్ధాన్(Pakistan) కు వెళ్ళి చావగొట్టాలని అంటున్నారు. ఇలాంటి ప్రకటనలు ఓవైసీ(Hyderabad MP Asaduddin Owisi) నుండి వస్తాయని ఎవరూ ఊహించలేదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఓవైసీ తాను వెళ్ళినచోటల్లా పాకిస్ధాన్ ప్రేరేపిత ఉగ్రదాడులను ఖండిస్తు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తీవ్రమైన ప్రకటనలతో రెచ్చిపోతున్నారు. బుధవారం తెల్లవారుజామున మన రక్షణదళాలు చేసిన మెరుపుదాడులను ఓవైసీ స్వాగతించారు. పాకిస్ధాన్ లోని ఉగ్రవాద స్ధావరాలపై రక్షణదళాలు చేసిన మెరుపుదాడులకు మద్దతుగా తన ట్విట్టర్ ఖాతాలో మద్దతుప్రకటించారు.

‘మనదేశంలో మరో పహల్గాం(Pahalgam Terror Attack) దాడి జరగకుండా పాకిస్ధాన్ కు, ఆదేశ ప్రేరేపిత ఉగ్రవాదుకు గట్టి గుణపాఠం చెప్పాల’ని కేంద్రప్రభుత్వానికి సూచించారు. ‘పాకిస్ధాన్ ఉగ్రవాద మౌళిక సదుపాయాలను పూర్తిగా నాశనంచేయాలి..జైహింద్’ అంటు ఓవైసీ రక్షణదళాలకు మద్దతు పలికారు. నిజానికి ఓవైసీ నుండి పాకిస్ధాన్ కు వ్యతిరేకంగా, మన రక్షణదళాలకు సంపూర్ణమద్దతు వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఓవైసీ ఏమన్నారంటే ‘మతమేదో కనుక్కుని పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చిచంపటం చాలాదారుణమైన విషయ’మన్నారు. శ్రీనగర్ లోని పహల్గాంలో పర్యటించిన ఓవైసీ మీడియాతో మాట్లాడుతు ‘పాకిస్ధాన్ ది పిరికిపంద చర్య’గా అభివర్ణించారు. పాకిస్ధాన్ కుట్రలను కేంద్రప్రభుత్వం గట్టిగా తిప్పికొట్టాలని చెప్పారు. పాకిస్ధాన్ లోని ఉగ్రవాదుల స్ధావరాలపై మన రక్షణదళాలు నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’ కు మద్దతుగా ట్వీట్ చేశారు.

‘ఆడవాళ్ళను, పిల్లలను కుటుంబాలనుండి వేరుచేసి మగవాళ్ళను టార్గెట్ చేసి ఉగ్రవాదులు చంపటం చాలా దారుణ’మని ఎంపీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద దాడి తర్వాత కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశంలో కూడా తాను ఇదేవిషయాన్ని చెప్పినట్లు ఓవైసీ అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశానికి, ఉగ్రవాదులకు ఇస్లాం ఏమిచెబుతోందో తెలీదన్నారు. ఇస్లాం ఎప్పుడూ హింసను కోరుకోదని స్పష్టంచేశారు. పాకిస్ధాన్ ను ఓవైసీ విఫలదేశంగా వర్ణించారు. పాకిస్ధాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మున్నీర్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే పహల్గాంలో ఉగ్రవాదులు దాడులుచేసినట్లు ఎంపీ అనుమానాలు వ్యక్తంచేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పాకిస్ధాన్ ప్రేరేపిత ఉగ్రదాడులు మనదేశంలో చాలానే జరిగాయి. జమ్మూ-కాశ్మీర్ తో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులు చేసి వందలాది అమాయకుల ప్రాణాలు తీశారు. హైదరాబాదులోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్ లాంటి ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో కూడా ఎంతోమంది చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అప్పుడెప్పుడు కూడా పాకిస్ధాన్, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఓవైసీ ఇపుడు స్పందిస్తున్న స్ధాయిలో స్పందించలేదు. మనదేశంలో జరిగిన చాలా ఉగ్రదాడుల్లో పాకిస్ధాన్ హస్తముందన్న విషయం ఆధారాలతో సహా నిరూపణ అయినా ఓవైసీ మాత్రం పెద్దగా రెస్పాండ్ కాలేదు. ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టాలని, పాకిస్ధాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని, మనదేశంవైపు ఆలోచించకుండా పాకిస్ధాన్ ను దెబ్బతీయాలని ఓవైసీ ఇపుడు ప్రకటించినట్లుగా గతంలో ఇంత తీవ్రంగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఉగ్రదాడుల వెనుక పాకిస్ధాన్ ఉందని తెలిసినా ఏదో మొక్కుబడిగా దాడులను ఖండించారంతే.

ఓవైసీ బ్యాక్ గ్రౌండ్ తెలిసిన వాళ్ళందరు ఇపుడు ఓవైసీ స్పందన చూసి ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే ఓవైసీ పాకిస్ధాన్ దుశ్చర్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారా లేకపోతే దీనివెనుక ఏదన్నా వ్యూహం ఉందా అన్న విషయాన్ని అనుమానిస్తున్నారు. ఏదేమైనా పాకిస్ధాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఓవైసీ స్పందించటాన్ని జనాలు స్వాగతిస్తున్నారు.

Read More
Next Story