జగన్ ఆస్తులపై పార్లమెంటులో  చర్చించవచ్చా?
x

జగన్ ఆస్తులపై పార్లమెంటులో చర్చించవచ్చా?

వైఎస్ జగన్ ఆస్తులకు మూలాధారాలు ఏమిటనే దానిపై పార్లమెంటులో చర్చించాలని ఇటీవలే వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోయిన డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు.


బలహీనపడినపుడే దెబ్బ మీద దెబ్బ కొట్టాలన్నది పాత సామెత. ఇప్పుడు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిస్థితి అలాగే ఉంది. పార్టీ ఓటమి తర్వాత బయటకు పోయే వాళ్లందరూ ఏదో ఒక రాయి నెత్తిన వేసి వెళుతున్నారు. అదే సమయంలో ఆయన ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు. తండ్రి సంపాయించిన ఆస్తులపై సొంత చెల్లీ, తల్లినీ కోర్టుకు ఈడ్చారని ఓవైపు రక్తం పంచుకుపుట్టిన సోదరి షర్మిల ఆరోపించారు. సరిగ్గా ఈ సమయంలోనే జగన్ కు అసలు గుండే లేదు, ఆయన నియంత అంటూ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ దుమ్మెత్తిపోశారు.

తాజాగా వైఎస్ జగన్ ఆస్తులు ఎన్ని, ఎన్నింటిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) స్వాధీనం చేసుకుందీ, మిగతా కేంద్ర సంస్థల ఆధీనంలో ఏమైనా ఆస్తులు ఉన్నాయా, ఆయన ఆస్తులకు మూలాధారాలు ఏమిటనే దానిపై పార్లమెంటులో చర్చించాలని ఇటీవలే వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోయిన డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. జగన్ కి నైతిక విలువలు లేవని ఆరోపించారు. సొంత తల్లి, చెల్లిని కోర్టు ద్వారా ఇబ్బందులు పెట్టడం సమంజసమా అని ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్ చరిత్రహీనుడిగా నిలవబోతున్నారని ఆయన అన్నారు. గుంటూరులో మీడియా మాట్లాడుతూ జగన్ కి అన్ని ఆస్తులు ఎలా వచ్చాయో పార్లమెంటులో చర్చించి నిగ్గుదేల్చాలన్నారు. గతంలో ఎన్ని ఉన్నాయో, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో, వాటి విలువ ఎంతో ప్రజల ముందుంచాలంటే ఇదొక్కటే మార్గమని చెప్పారు.
జగన్‌ అక్రమ ఆస్తులపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని కేంద్రాన్ని కోరారు. జగన్‌ బరితెగింపు చూస్తే.. కేంద్ర ఆర్థిక సంస్థల్లో కొందరు ఆయన ద్వారా లబ్ధి పొందుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రధాని మోదీ దీనిపై తక్షణమే ప్రత్యేక చర్చలు జరిపి.. చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి జగన్‌ ఆస్తులను జాతీయం చేయాలని కోరారు. ప్రజల ఆస్తులను అప్పనంగా దోచుకున్న జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై కూటమి ప్రభుత్వం ఏమి చర్యలు చేపట్టబోతుందో చెప్పాలని డొక్కా మాణిక్యవరప్రసాద్ కోరారు.


Read More
Next Story