
దర్బార్ కృష్ణుడి అలంకారంలో పద్మావతి అమ్మవారు
రాత్రి 7 నుండి 10 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి గరుడ సేవ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగ అలమేలుమంగ. సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో దిక్పాలకులు కూడా ఉన్నారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు.
స్వర్ణరథంపై శ్రీ మహాలక్ష్మి:
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 4.20 నుండి 5.20 గంటల వరకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణ రథంపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను ఆనుగ్రహిస్తారు.
గరుడ వాహనంపై లోకమాత :
రాత్రి 7 నుండి 10 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి గరుడ సేవ వైభవంగా జరుగనుంది.

