
అమరావతిలో మా భూములు లాక్కున్నారు
భూసమీకరణ వివాదం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచ బ్యాంకు సర్వే చేయిస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదు. సర్వే చేయటం చేతకావడం లేదని సర్వేయర్లు చేతులెత్తేశారు.
రాజధాని అమరావతి పరిధిలో భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) కోసం తమ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్‌లోని మందడం గ్రామ రైతులు చేసిన ఫిర్యాదుపై ప్రపంచ బ్యాంకు స్పందించింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన ప్రపంచ బ్యాంకు, సంబంధిత భూములపై సమగ్ర సర్వే నిర్వహించాలని, వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దీంతో క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీఏ), రెవెన్యూ అధికారులు ఈ భూములపై సర్వే నిర్వహించనున్నారు.
బలవంతంగా భూమి స్వాధీనం ఆరోపణలు
విజయవాడ సమీపంలోని మందడం గ్రామానికి చెందిన రైతులు పసుపులేటి జమలయ్య, కలపాల శరత్‌కుమార్‌తో సహా కొందరు తమ భూములను సీఆర్డీఏ అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. భూ సమీకరణ పథకంలో భాగంగా తమ భూములను ఇవ్వడానికి తాము అంగీకరించలేదని, అయినప్పటికీ అధికారులు బెదిరింపులకు పాల్పడి, తమ భూముల చుట్టూ ఉన్న కంచెలను కూడా తొలగించారని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీసులను ఆశ్రయించినప్పటికీ వారి నుంచి సరైన స్పందన లభించలేదని రైతులు తెలిపారు. దీంతో వారు ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే అమరావతి రాజధాని నిర్మాణ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నిధులు సమకూరుస్తోంది.
రైతుల భూమి కంచె ప్రొక్లైన్ తో తొలగిస్తున్న స్టార్ హోటల్ యాజమాన్యం
సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన ఆధారాలు
ఫిర్యాదు చేసిన రైతులు తమ భూములకు సంబంధించిన అన్ని వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద సేకరించి, ప్రపంచ బ్యాంకుకు సమర్పించారు. ఈ ఆధారాలను పరిశీలించిన అధికారులు భూముల స్వాధీనంలో కొంత పొరపాటు జరిగినట్లు భావిస్తున్నారు. తొలుత సీఆర్డీఏ అధికారులు ఈ భూములు ఫిర్యాదు చేసిన రైతులవి కాదని వాదించినప్పటికీ, రైతులు సమర్పించిన ఆధారాలతో ఆ వాదన సమర్థనీయం కాదని స్పష్టమైంది.
ప్రపంచ బ్యాంకు స్పందన, సర్వే
ప్రపంచ బ్యాంకు బృందం రైతుల ఫిర్యాదును సీరియస్‌గా పరిగణించి, అమరావతి ప్రాజెక్టు పర్యవేక్షణ తమ బాధ్యతలో భాగమని, ఈ విషయంలో పారదర్శకతను నిర్ధారించాలని సూచించింది. దీంతో సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు బుధవారం సర్వే నిర్వహించి భూముల యాజమాన్యం, స్వాధీన ప్రక్రియలో జరిగిన అన్యాయాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయనున్నారు. ఈ సర్వే ఫలితాలు అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
అధికారుల దూకుడు, డిప్యూటీ కలెక్టర్‌పై ఆరోపణలు
ఈ భూముల స్వాధీన ప్రక్రియలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఒకరు అత్యుత్సాహంతో దూకుడుగా వ్యవహరించినట్లు సమాచారం. రైతుల ఆరోపణల ప్రకారం ఈ అధికారి భూముల స్వాధీనంలో నిబంధనలను పాటించకుండా, బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కూడా సర్వేలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అమరావతిలో సచివాలయానికి శంకుస్థాపన చేసిన భూమికి మొక్కుతున్న సీఎం చంద్రబాబు (ఫైల్ ఫొటో)
అమరావతి భూ సమీకరణ నేపథ్యం
అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 29 గ్రామాల నుంచి సుమారు 33,000 ఎకరాల భూమిని భూసమీకరణ పథకం కింద సేకరించారు. ఈ పథకంలో రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చి, బదులుగా అభివృద్ధి చేసిన ప్లాట్లు, ఆర్థిక పరిహారం పొందే విధానం అమలవుతోంది. అయితే కొందరు రైతులు తమ భూములను ఇవ్వడానికి సుముఖత చూపకపోవడం, అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకోవడం వంటి వివాదాలు తలెత్తాయి. మందడం రైతుల ఫిర్యాదు ఈ వివాదంలో కీలక పరిణామంగా మారింది.
ముందున్న సవాళ్లు
ఈ సర్వే ఫలితాలు రైతుల ఫిర్యాదులకు న్యాయం చేస్తాయా? లేదా అనేది కీలకంగా మారింది. అధికారులు పారదర్శకంగా వ్యవహరించి, రైతుల ఆందోళనలను పరిష్కరిస్తారా లేదా అనేది సర్వే నివేదికపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచ బ్యాంకు ఈ విషయంలో నిశితంగా పర్యవేక్షణ జరుపుతుండటంతో అధికారులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
రైతుల హక్కులను కాపాడే దిశగా ఈ సర్వే ఒక ముఖ్యమైన అడుగుగా మారనుంది. సర్వే అనంతరం వెలువడే నివేదిక, అమరావతి రాజధాని నిర్మాణంలో భూసమీకరణ ప్రక్రియలో పారదర్శకత, న్యాయం ఎంతవరకు పాటించబడుతున్నాయనే విషయంపై స్పష్టతను తీసుకొస్తుందని ఆశిస్తున్నారు.
సర్వే గ్రాఫిక్ ఫొటో
మేము గుర్తించలేక పోతున్నాం: సర్వేయర్లు
మందడం పరిధిలో తమ భూములు బలవంతంగా లాక్కుంటున్నారంటూ వరల్డ్ బ్యాంకుకు ఫిర్యాదు చేసిన రైతుల భూముల సర్వేకు వెళ్లిన అధికారులు వెనక్కు వెళ్లారు. భూములు సర్వే చేయలేక పోతున్నామని తెల్చేశారు. అసలు భూముల హద్దులు గుర్తించ లేకపోతున్నామని రైతులకు సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు అమరావతి భూములను కొలతలు వేసి కొన్ని చోట్ల పాట్లు వేసిన సర్వేయర్లు హద్దు రాళ్లు కనిపించడం లేదని వెనక్కి వెళ్లడం పలు విమర్శలకు తావునిచ్చింది. ఇది జిల్లా, రాష్ట్ర స్థాయి సర్వే బృందాలు మాత్రమే తేల్చాల్సిన అంశమని వారు చెప్పటం విశేషం.