
మోదీ టూర్‌కు నిర్వాహక కమిటీ ఏర్పాటు
విశాఖపట్నంలో నిర్వహించే ప్రధాని నరేంద్ర మోదీ టూర్ ఏర్పాట్ల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో సారి ఆంధ్రప్రదేశ్‌లో టూర్ చేయనున్నారు. ఇటీవల అమరావతి నిర్మాణాల పునఃప్రారంభానికి వచ్చిన ప్రధాని మోదీ, ఈ సారి విశాఖకు రానున్నారు. జూన్ 21న విశాఖ సముద్ర తీరంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన కోసం ప్రత్యేకంగా ఒక నిర్వాహక కమిటీని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐదుగురు మంత్రులతో ఒక నిర్వాహక కమిటీని ఏర్పాటు చేసింది. హోం మంత్రి అనితతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయులు, మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్‌లను నిర్వాహక కమిటీలో సభ్యులుగా ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబును ఏర్పాటు చేశారు. జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా డే ఉత్సవాలతో పాటు ప్రధాని మోదీ టూర్ ఏర్పాట్లన్నీ ఈ కమిటీ ఆధ్వర్యంలోనే సాగనున్నాయి.