కొండ కోనల్లో నాటు చేపల విప్లవం!
x

కొండ కోనల్లో నాటు చేపల విప్లవం!

సేంద్రియ పద్ధతిలో కుంటలు, చెరువుల్లో పెంపకం. పెట్టుబడి నామమాత్రం.. ఆదాయం గణనీయం. వచ్చే మూడేళ్లలో పదివేలకు పెంచాలని లక్ష్యం. వైవిధ్యం వైపు గిరిజనుల సరికొత్త అడుగులు.


(బొల్లం కోటేశ్వరరావు – విశాఖపట్నం)

చెరువుల్లో చేపల పెంపకం చూశాం.. ఫారాల్లో బ్రాయిలర్, నాటుకోళ్ల పెంపకాన్నీ చూస్తున్నాం.. మరి నాటు చేపల పెంపకం గురించి ఎప్పుడైనా విన్నారా? అవును.. ఆశ్చర్య పోకండి మీరు చదువుతున్నది నిజమే! ఇప్పుడు వినూత్నంగా నాటు చేపల పెంపకాన్ని చేపట్టారు కొందరు. వీళ్లు మైదాన ప్రాంత వాసులు కాదు.. అడవుల్లో ఉండే గిరిపుత్రులు! అసలు చేపల పెంపకమంటే ఏమిటో ఎరుగని వీరు.. ఇప్పుడు అబ్బురాలు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో వీటి పెంపకాన్ని చేపట్టి లాభాల రుచి చూస్తున్నారు. వైవిధ్యం వైపు అడుగులేస్తున్నారు. ఔరా! అనిపిస్తున్నారు. కొండ కోనల్లో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఈ దేశీ చేపలను కొనడానికి పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి కూడా ఎగబడుతున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. అదేమిటో తెలుసుకుంటారా?

ఎనిమిదేళ్ల క్రితం (2016 అక్టోబర్‌) వరకు ఆ గిరిజనులకు చేపల పెంపకమంటే తెలియదు. గెడ్డలు, వాగుల్లో పెరిగే చేపలను పట్టుకుని తినడమే తెలుసు. గిరిజనుల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ‘వాసన్‌’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ శ్రీకాకుళం జిల్లా హిరమండలం ఎస్కే బాలేరు గిరిజన గ్రామంలో మూడు చిన్నపాటి చెరువుల్లో (20x30 20చ.మీల విస్తీర్ణంలో) ప్రయోగాత్మకంగా ముగ్గురు గిరి రైతులతో నాటు చేపల పెంపకాన్ని ప్రారంభించింది. బొచ్చ (కట్ల) బంగారుపాప (గోల్డెన్‌ కార్ప్‌), శీలావతి (రోహు), గడ్డి చేప (గ్రాస్‌ కార్ప్‌) జాతుల చేప పిల్లలను వేశారు. సేంద్రియ విధానంలో ఆవు పేడ, కోళ్ల పెంట, కుళ్లిన పండ్లు, కూరగాయల వ్యర్థాలు వంటివి వాటికి మేతగా వేశారు. వీటిలో ఆవు పేడ నుంచి నీటిలో ప్లాంక్టాన్లు పెరుగుతాయి. వాటిని చేపలు తిని ఎదుగుతాయి. ఇలా ఏడాది నాటికి కిలో నుంచి కిలోన్నరకు పెరిగాక పట్టుబడి చేశారు. మైదాన ప్రాంత చెరువుల్లో ఎకరానికి సగటున 60 కిలోల దిగుబడి వస్తే గిరిజనులు కుంటల్లో పెంచినవి 128 కిలోలకు పెరిగాయి. ఆశ్చర్యానికి గురైన ఆ గిరిపుత్రులు వీటి పెంపకంపై ఆసక్తి చూపారు. ఆ తర్వాత ఆ పరిసరాల్లో ఈ చెరువుల సంఖ్య 60కి పెరిగింది. ఈ గిరి రైతులు అప్పటి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ ధనుంజయరెడ్డిని తీసుకొచ్చి ఈ చేపల రుచి చూపించారు. ఆయనా ఆహా అన్నారు. వేసవిలో మన్యంలో నీరు నిల్వ ఉండే చిన్న చెరువులను జియో ట్యాగింగ్‌ ద్వారా గుర్తించాలని కలెక్టర్‌ ఆదేశించడంతో అలాంటివి రెండు వేలున్నట్టు తేల్చారు. అయినప్పటికీ ఇలాంటి చెరువుల్లో నాటు చేపల పెంపకానికి ఎక్కువ విస్తీర్ణం అవసరమన్న ఐటీడీఏ నిబంధనలతో మత్స్యశాఖ ముందుకు రాలేదు. దీంతో గిరిజనులే 10, 15, 20 సెంట్ల విస్తీర్ణం ఉన్న 200 వరకు చెరువుల్లో నాటు చేపల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. దేశీ విత్తనాల తయారీ, దేశీ కోళ్ల పెంపకంలో నైపుణ్యం ఉన్న సంజీవని స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి పచారి దేవుళ్లు ద్వారా అప్పటి విశాఖ, ఇప్పటి అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం అడపవలస పరిసరాల్లోనూ 16 చెరువుల్లో గిరిజనులతో నాటు చేపల పెంపకాన్ని చేపట్టారు. అక్కడ కూడా సత్ఫలితాలే వచ్చాయి. ఇలా ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో 565 చెరువుల్లో మంచి రుచి, డిమాండ్‌ ఉండే శీలావతి, బంగారుపాప, బొచ్చ, గడ్డి చేపల పెంపకం జరుగుతోంది. గతేడాది మరో 765 చెరువుల్లో ఈ చేపల పిల్లలను వేశారు. ‘కొండల్లో నుంచి వృధాగా పోతున్న నీటిని నిల్వ చేసి చిన్నపాటి చెరువుల్లో సేంద్రియ దేశీ చేపల పెంపకం గిరిసీమల్లో అనూహ్య ఫలితాలనిస్తోంది. గిరిజనుల్లో సరికొత్త మార్పు వస్తోంది’ అని దేవుళ్లు చెబుతున్నారు.

10 సెంట్ల నుంచి రూ.15 వేల ఆదాయం..

ఉదాహరణకు 10 సెంట్ల చెరువులో 300 చేప పిల్లలను వేస్తారు. వాటిలో వంద వరకు చనిపోతుంటాయి. మిగిలినవి ఆరు నెలల నాటికి అర కిలో చొప్పున సగటున కనీసం వంద కిలోల దిగుబడి వస్తాయి. వీటికి కిలో రూ.150 ధర పలుకుతోంది. ఇలా 10 సెంట్ల చెరువులో చేపల ద్వారా రూ.15 వేల అదాయం వస్తోంది. ఇంకా ఈ పాండ్స్‌ చుట్టూ గట్లపై అరటి, కంది, బొప్పాయి, మునగ, జామ, నిమ్మ, అలసంద, కొండ కంది, బీర, గుమ్మడి పాదులు వంటివి పెంచుతున్నారు. వీటి నుంచి మరో రూ.5 వేలు వస్తోంది. ఒక్కో చేప పిల్లను రూ.3కి కొంటారు. వీటికి రూ.900, ఇతరత్రా మరో రూ.300 వెరసి రూ.1200 మాత్రమే పెట్టుబడి అవుతుంది.›రూ.15 వేల ఆదాయం వస్తోంది. కొన్నాళ్లుగా చిన్న చిన్న చెరువుల్లో నాటు చేపల పెంపకం ద్వారా లాభాలు గడిస్తుండడంతో గిరిజనులు వీటిపై ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అల్లూరి జిల్లా, డుంబ్రిగుడ మండలం ఒక్క సొవ్వ పంచాయతీలోనే 52 చెరువుల్లో ఈ చేపల పెంపకం జరుగుతోందంటే అర్థం చేసుకోవచ్చు. ‘నేను పది సెంట్ల సెర్వులో మూడు రకాల సేపలేసేను. 15 యేలొచ్చింది. గట్ల మీద పంటల్నుంచి 10 యేలు, పక్కనున్న 30 సెంట్ల బూమ్లో కూరగాయలు పండిత్తనాను. దానికి నీరు ఈ సెర్వుదే పెడ్తనాను. దాన్నుంచి ఇంకో పాతికయేలొత్తనాది. మా సేపలు కొనడానికి ఒరిసా నుంచీ వత్తనారు, మున్ముందు ఎకరంలో సేపల్ని పెంచాలనుకుంటన్నాను’ అని పనసవలస గిరి రైతు జన్ని అప్పన్న ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధికి చెప్పాడు.

బుల్లి చేపలతో మరో ప్రయోగం..

ఇప్పటికే నాటు చేపల పెంపకంతో లాభాల రుచి మరిగిన గిరిజనులు ఇప్పుడు మరో ముందడుగు వేస్తున్నారు. ప్రస్తుతం పెద్ద చేపలను పెంచుతున్న చిన్న చెరువుల్లోనే మెత్తళ్లు, బేడిసలు, కణుసులు/ఉల్లుకుచ్చుణాలు వంటి బుల్లి చేపల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. (దీనిని పాలీ క్రాపింగ్‌ విధానంగా పిలుస్తారు) వీటిలో పెరిగే శీలావతి, బొచ్చ, బంగారుపాప, గడ్డి చేపలు శాఖాహారులు. ఇవి చిన్న చేపల్ని తినవు. అందువల్ల ఈ చెరువుల్లో చిరు చేపల పెంపకాన్ని చేపడుతున్నారు. ఒమేగా–3 ఫ్యాట్‌ పుష్కలంగా ఉండే ఈ చిరు చేపలకు కిలో రూ.250–280 ధర పలుకుతోంది. ఇవి ప్రతి మూడు నెలలకూ చేతికొస్తాయి. 20 సెంట్ల చెరువులో మూడు నెలలకు 20 కిలోల చొప్పున రూ.5 వేలు, ఏడాదికి రూ.20 వేలకు పైగా అదనపు ఆదాయం వస్తోంది.

తొలి విడత చేపలు అమ్మరు..

గిరిజనుల ఆచారం ప్రకారం తమ చెరువుల్లో తొలివిడతలో తీసిన చేపలను అమ్మరు. ఆ ఊళ్లో వారికి ఉచితంగా ఇచ్చేస్తారు. వీటిని ఊరంతా వండుకుని పండగ వాతావరణంలో తింటారు. రెండో విడత నుంచి విక్రయిస్తారు.

మూడేళ్లలో 10 వేల చెరువులు లక్ష్యం..

గిరి సీమల్లో సేంద్రియ విధానంలో దేశీ చేపల పెంపకం ప్రయోగం ఎంతో విజయవంతమైంది. ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఐటీడీఏల పరిధిలో సుమారు 1300 ఫాం పాండ్స్‌ (చిన్న చెరువు)ల్లో వీటి పెంపకం జరుగుతోంది. వచ్చే మూడేళ్లలో ఈ సంఖ్యను పది వేలకు పెంచాలన్నది మా లక్ష్యం. మొదటల్లో చిన్న చెరువుల్లో నాటు చేపల పెంపకంపై గిరిజనులకు అవగాహన కల్పించడంతో పాటు చేప పిల్లలను సమకూర్చేవాళ్లం. ఇప్పుడు ఈ చేపల పెంపకంపై వారిలో చాలా అవగాహన వచ్చింది. దీంతో ఇప్పుడు వాళ్లంతట వాళ్లే వీటి పెంపకాన్ని చేపడుతున్నారు. మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. కొత్తగా గిరిజనులు చెరువులు తవ్వుకోవడానికి కోరమాండల్‌ ఇంటర్నేషనల్, అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్, హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్‌ సంస్థలు ఆర్థిక సాయం అందించడానికి ముందుకొచ్చాయి’ అని ‘వాసన్‌’ సంస్థ అసోసియేట్‌ డైరెక్టర్‌ మాకవరపు లింగ సన్యాసిరావు ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.

Read More
Next Story