
ప్రతిపక్ష హోదా ప్రజలివ్వాలి ప్రభుత్వం కాదు
వక్ఫ్ బోర్డు ఉంది.. అలాగే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కూడా ఏర్పాటు కావాలి అని పనవ్ కల్యాణ్ అన్నారు.
అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరుపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం లో లెవల్ రాజకీయమని ధ్వజమెత్తారు. జనసేన కంటే ఒక్క సీటు అధికంగా గెలుచుకొని ఉంటే వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలని, ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ౖ నిబంధనల ప్రకారమే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదన్నారు. ఇది ఫిక్స్ అయిపోండి.. ఈ అయిదేళ్లూ వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని స్పష్టం చేశారు. అన్నీ తెలిసే వైసీపీ నాయకులు సభా సమయం, ప్రజాధనం వృథా చేస్తున్నారని మండిపడ్డారు.
ౖ వైసీపీ నాయకుడు సభకు వస్తే సమయం ఎంత ఇస్తారనేది తెలుస్తుందన్నారు. గవర్నర్ ప్రసంగ సమయంలో వైసీపీ తీరు విచారకరమన్నారు. ప్రతిపక్ష హోదా రాకపోవడం అనేది సీఎం చంద్రబాబు, తానో కావాలని చేసింది కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పు అని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదన్నారు. దీన్ని ఆ పార్టీ నాయకుడు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు అర్థం చేసుకోవాలన్నారు.
భారతదేశ ప్రజాస్వామ్య పద్ధతుల ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కడానికి కావల్సినన్ని సీట్లను వైసీపీ గెలవలేకపోయింది. ఆ విషయం తెలిసినా కావాలనే వైసీపీ నాయకులు విలువైన శాసనసభా సమయం వృధా చేస్తున్నారు. సీట్ల శాతం ప్రకారమే భారతదేశంలో నిబంధనలు ఉంటాయి.. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే వైసీపీ పార్టీ నాయకులు జర్మనీ వెళ్లిపోతే బాగుంటుందని సూచించారు. ఇటీవలే జర్మనీలో ఎన్నికలు నిర్వహించారు.. అక్కడ ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకొంటారని, ఇక్కడ సీట్లు ప్రాతిపదికగా ఉంటుందని వైసీపీ వాళ్లు గ్రహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీగా జనసేన ఉందన్నారు. జనసేన కంటే ఒక సీటు అధికంగా తెచ్చుకొని ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా అడగకుండానే వచ్చేది. కానీ వారికి ప్రజలు కేవలం 11 సీట్లను మాత్రమే ఇచ్చారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. దీన్ని వైసీపీ నాయకులు అర్ధం చేసుకోవాలి. అంతేకాని రాని ప్రతిపక్ష హోదా కోసం విలువైన సమయాన్ని, ప్రజాధనాన్ని వృథా చేయడం తగదన్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ తీరు బాధాకరమని అన్నారు. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా డిమాండు పేరుతో వైసీపీ నేలబారు వ్యూహాలు అమలు చేస్తోందని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంలో ఏముందో తెలుసుకోకుండానే వైసీపీ నాయకులు ఇష్టానుసారం అరుపులు, కేకలు వేయడం వారి తీరును బయటపెడుతోందన్నారు. జగన్ కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మొదట అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలి. ప్రజల సమస్యలపై స్పందించాలి, హుందాగా చర్చల్లో పాల్గొనాలన్నారు.
మొదటి సమావేశాల్లోనే వైసీపీ నాయకులకు గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు తాను కూడా తగిన గౌరవం ఇచ్చామని, 11 సీట్లే వచ్చాయని వారిని తక్కువ చేసి చూడలేదన్నారు. ప్రోటోకాల్‌ను ఎవరైనా పాటించాల్సిందే అని అన్నారు. దీన్ని వైసీపీ నాయకులు గమనించాలన్నారు. పవన్ కళ్యాణ్ గారిని సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు అంశంపై ఆయన స్పందిస్తూ. మార్చి 14న ఆవిర్భావ సభ వేదికగా ఈ అంశంపై వివరంగా మాట్లాడుతాను. వక్ఫ్ బోర్డు ఉంది.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కూడా ఏర్పాటు కావాలి అని అన్నారు.
Next Story