ఎస్సీలలో 4,400 మందికేనా ఉన్నతి?
x

ఎస్సీలలో 4,400 మందికేనా 'ఉన్నతి'?

17.1శాతం జనాభా ఉన్న ఎస్సీలలో 4,400 మందేనా నిరుపేదలని ప్రశ్నిస్తున్న ఎస్సీ సంఘాలు


ఆంధ్రప్రదేశ్‌లో దళిత కుటుంబాల ఆర్థికాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ 'పీఎం అజయ్' (PM AJAY) పథకాన్ని రాష్ట్రంలోని 'ఉన్నతి' పథకంతో అనుసంధానిస్తూ ఎస్సీ మహిళలకు భారీ రాయితీతో కూడిన రుణాలను అందించనుంది. జనవరి 2026 నుంచి ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. అయితే, రాష్ట్రంలోని ఎస్సీ జనాభాకు, అందుతున్న లబ్ధికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సముద్రంలో కాకిరెట్టంత సాయం!
రాష్ట్ర జనాభాలో 17.1% ఉన్న ఎస్సీ సామాజిక వర్గంలో సుమారు 22 లక్షల నుండి 25 లక్షల కుటుంబాలు ఉన్నాయని అంచనా. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఇందులో 40% పైగా కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయి. కానీ, ప్రస్తుత పథకం కింద కేవలం 4,400 మందిని మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేయడం సముద్రంలో కాకిరెట్ట లాంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే ప్రతి 5,000 ఎస్సీ కుటుంబాలలో కేవలం ఒక కుటుంబానికి మాత్రమే ఈ ఉపాధి అవకాశం దక్కనుంది.

పీఎం అజయ్ (PM AJAY) అనేది కేంద్ర పథకం కావడంతో, కేంద్రం ఇచ్చే బడ్జెట్ పరిమితుల వల్లే లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాల్సి వచ్చిందని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
పథకం ముఖ్యాంశాలు
మొత్తం బడ్జెట్: ₹63.26 కోట్లు (కేంద్ర, రాష్ట్ర వాటాలతో కలిపి).
రాయితీ: ఒక్కో యూనిట్‌కు గరిష్టంగా ₹50,000 వరకు రాయితీ.
వడ్డీ లేని రుణం: రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని 'ఉన్నతి' పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణంగా అందిస్తారు. (రుణ పరిమితి ₹30,000 నుండి ₹5,00,000 వరకు).
ఉపాధి మార్గాలు: ప్యాసింజర్ ఆటోలు, బేకరీ, మొబైల్ షాపులు, టిఫిన్ సెంటర్లు, ఫుడ్ స్టాల్స్ వంటి 56 రకాల యూనిట్లు.
ఎంపిక ప్రక్రియ..
జనవరి మొదటి వారం: లబ్ధిదారుల గుర్తింపు, ఎంపిక ప్రారంభం.
నెలాఖరుకు: ఎంపిక పూర్తి చేసి నిధుల విడుదల.
నిర్వహణ: ఎస్సీ కార్పొరేషన్, సెర్ప్ (SERP) సంయుక్తంగా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తాయి.
నిబంధనల ప్రకారం డ్వాక్రా సంఘాల్లోని 'నిరు పేద' (Ultra Poor) మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎస్సీ మహిళలు డ్వాక్రా సంఘాల్లో ఉంటూ, ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన 56 రకాల ఉపాధి యూనిట్లకు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. కానీ, కేటాయింపులు మాత్రం అరకొరగానే ఉండబోతున్నాయి.
వడ్డీ భారం లేదు కానీ..: ఉన్నతి పథకం ద్వారా వడ్డీ లేని రుణం ఇస్తున్నామని చెబుతున్నా, అసలు ఆ రుణం పొందే భాగ్యం ఎంతమందికి దక్కుతుందనేదే అసలు ప్రశ్న.

జనవరి నెలాఖరు కల్లా ఎంపిక పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే ఈ స్వల్ప కాలంలో ఏ ప్రాతిపదికన, ఏ పారదర్శకతతో 4,400 మందిని ఎంచుకుంటారో వేచి చూడాలి.
ప్రభుత్వం ముందున్న సవాలు....
కేంద్ర పథకమైన 'పీఎం అజయ్' నిబంధనల వల్ల లబ్ధిదారుల సంఖ్య పరిమితంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులను భారీగా కేటాయించాల్సిన అవసరం ఉంది. కేవలం 4,400 మందితోనే సరిపెట్టకుండా, ఈ సంఖ్యను లక్షల్లోకి పెంచినప్పుడే ఎస్సీల జీవితాల్లో నిజమైన 'ఉన్నతి' సాధ్యమవుతుంది. కేవలం అప్పులు ఇవ్వడమే కాకుండా, శిక్షణ ఇచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే లబ్ధిదారుల పరిధిని పెంచడమే ఏకైక మార్గం.
Read More
Next Story