అటు వరలక్ష్మీ వ్రతాలు..ఇటు పిండ ప్రదానాలు!
x
పిఠాపురంలో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్న మహిళలు

అటు వరలక్ష్మీ వ్రతాలు..ఇటు పిండ ప్రదానాలు!

దక్షిణ కాశీగా పేరొందిన పిఠాపురం పాదగయ క్షేత్రంలో పితృ దేవతలకు పిండ ప్రదానాలు చేసే చోట వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించడం వివాదాస్పదమైంది.


ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం పాదగయ పురుహూతికాదేవి అమ్మవారి సన్నిధిలో కొన్నేళ్లుగా శ్రావణమాసం ఆఖరి శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రెండేళ్ల క్రితం వరకు అక్కడ వందల సంఖ్యలోనే మహిళలు వరలక్ష్మీ వ్రతాలకు హాజరయ్యేవారు. కానీ గత ఏడాది పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికయ్యాక పరిస్థితి మారింది. పవన్‌ కల్యాణ్‌ గత సంవత్సరం ఆఖరి శ్రావణ శుక్రవారం రోజున పది వేల మందికి పైగా మహిళలకు ఉచిత వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న మహిళలకు చీరలను కూడా పంచారు. మళ్లీ ఈ ఏడాది కూడా శ్రావణ మాస ఆఖరి శుక్రవారం నాడు అదే రీతిలో వరలక్ష్మీ వ్రతాలకు శ్రీకారం చుట్టారు. పది వేల మంది ఆడపడుచులకు వ్రతాలు చేయించి చీర, జాకెట్టు, గాజులు, వరలక్ష్మీ రూపు, పసుపు, కుంకుమలు అందజేస్తామని, జనసేనలో క్రియాశీలకంగా ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని జనసైనికులు అట్టహాసంగా ప్రకటించారు.


వ్రతాల కోసం క్యూలైన్లో నిలుచున్న అతివలు

దీంతో కాకినాడ జిల్లా నలుమూలల నుంచే కాదు.. పొరుగు జిల్లాల నుంచి కూడా మహిళలు పోటెత్తారు. ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఐదు బ్యాచ్‌ల్లో వ్రతాలు నిర్వహించారు. ఈ బ్యాచ్‌లకు అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అనే పేర్లు పెట్టారు. పూజకొచ్చిన మహిళలు తోపులాటలకు దిగారు. బ్యాచ్‌కు వెయ్యి నుంచి 1500 మందికి మాత్రమే అవకాశం దక్కడంతో అంతకు మించి వచ్చిన వారికి పూజ టోకెన్లు లేక వెనుదిరిగారు. బుధవారం వరకూ ఊరూరా తిరిగి పూజా టోకెన్లును పంచారు. పాదగయ క్షేత్రం వద్ద టోకెన్ల కోసం వచ్చి కాపలా కాసిన వారికి టోకెన్లు లేకుండా పోయాయి.

పూజలో పాల్గొన్న నాగబాబు సతీమణి పద్మజ

ప్రత్యేక ఆకర్షణగా నాగబాబు సతీమణి..
ఈసారి వ్రతాలకు పవన్‌ కల్యాణ్‌ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాక ఆమె వరలక్ష్మీ వ్రతం తొలిపూజలో పాల్గొన్నారు. తొలుత కొంతమంది మహిళలకు ఆమె చేతులుగా చీర, పసుపు కుంకుమ, లక్ష్మీరూపులున్న కిట్లను అందజేశారు. కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, పిఠాపురం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మరెడ్డి శ్రీనివాస్‌లు ఈ వ్రత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఆరుబయటే పితృకర్మలు నిర్వహిస్తున్న దృశ్యం

ఆరుబయటే పిండ ప్రదానాలు..
దక్షిణ కాశీగా పేరొందిన పిఠాపురం పాదగయ క్షేత్రం పితృదేవతల పిండ ప్రదానానికి పవిత్రమైన స్థలంగా భావిస్తారు. అందుకే తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా పిండ ప్రదానాలు చేయడానికి పాదగయకు వస్తుంటారు. ఈ ఏడాది ఆఖరి శ్రావణ శుక్రవారం నాడే అమావాస్య కూడా వచ్చింది. ఈ రెండూ కలిసిన రోజు పితృదేవతలకు ప్రీతికరమైన రోజుగా భావించిన పలువురు పిండ ప్రదానాల కోసం పాదగయకు చేరుకున్నారు. అయితే ఈ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నందున నిర్వాహకులు ఆ ప్రాంగణాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. పురోహితులు సాధారణంగా పుష్కరిణి చుట్టూ పిండ ప్రదానాల క్రతువులు నిర్వహిస్తారు. అనంతరం ఆ పిండాలను పుష్కరిణిలో కలుపుతారు. వరలక్ష్మ్రీ వ్రతాలను దృష్టిలో ఉంచుకుని పుష్కణి వద్ద పిండ ప్రదానాలకు అనుమతించలేదు. పిండ ప్రదానాల కార్యక్రమాలను ఆరుబయటే నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు.

పోలీసులతో పురోహితుల వాగ్వాదం

పోలీసులతో పురోహితుల వాగ్వాదం..
పితృ దేవతలకు పిండ ప్రదానాల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని బయటే నిలిపివేయడంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆలయ ఆచారం ప్రకారం లోపల పుష్కరిణి వద్దనే పిండ ప్రదానాలు చేయాలని పురోహితులు పట్టుబట్టారు. అయినప్పటికీ పోలీసులు అనుమతించలేదు. పుష్కరిణి వద్ద కొంత భాగమైనా కేటాయించాలని కోరినా వినిపించుకోలేదు. దీంతో పోలీసులు, ఆలయ నిర్వాహకుల వైఖరికి నిరసనగా పురోహితులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పుష్కరిణిలో పిండాలను కలపకపోతే పితృదేవతలకు మోక్షం దక్కదని భావించిన కొంతమంది పిండ ప్రదానాలు చే యకుండానే వెనుదిరిగి వెళ్లారు. మరికొందరు విధిలేని పరిస్థితుల్లో పురోహితులతో క్షేత్రం బయటే ఆ తంతును నిర్వహించుకున్నారు.

పురోహితుల సంఘం అధ్యక్షుడు సోమయాజులు

పుష్కరిణి వద్దే పితృ కర్మలకు అనుమతించాలి..
‘ఈరోజు అమావాస్య, శుక్రవారం చాలా విశేషమైన రోజుగా భావించి పితృ కార్యక్రమాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు పాదగయకు వచ్చారు. క్షేత్రం లోపల వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నామని వీరికి పితృ కర్మలకు అవకాశం ఇవ్వలేదు. ఈ కర్మకాండలు బయట చేసుకోవడానికి ఇష్టపడక కొందరు వెనుదిరిగారు. దీనిపై ఈవోకు చెబితే మా వల్ల కాదన్నారు. ఏటా ఈ క్షేత్రంలో వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి. కానీ ఈసారి మాత్రమే భక్తులకు ఈ దుస్థితి. ఇకపై ఏటా శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలతో పాటు పాదగయలో పిండ ప్రదానాలకు ఎప్పటిలా వీలు కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను కోరుతున్నాం’ అని పిఠాపురం ఉమా కుక్కుటేశ్వర పురుహూతిక పురోహితుల సంఘం అధ్యక్షుడు పొక్కులూరి నారాయణ సోమయాజులు చెప్పారు.
Read More
Next Story