
వైఎస్ వివేకానందరెడ్డి
ఒక హత్య.. 6 మరణాలు.. వివేకా మర్డర్ కేసులో మెరుపులు, మరకలు
మార్చి 15 నాటికి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరేళ్లు పూర్తవుతాయి. ఇదో హైప్రొఫైల్ మర్డర్ కేసు. హాలివుడ్ క్రైం సినిమాను తలపిచే రీతిలో సాగుతోంది.
మరో వారం రోజుల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరేళ్లు పూర్తవుతాయి. ఇదో హైప్రొఫైల్ మర్డర్ కేసు. హాలివుడ్ క్రైం సినిమాను సినిమాను తలపిచే రీతిలో సాగుతోంది. ఈ ఆరేళ్లలో ఆరుగురు కీలకసాక్షులు కన్నుమూశారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసు మాదిరే ఈ కేసులోనూ దోషులెవరో తేలకుండానే ముగిసిపోతుందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. వివేకా హత్య కేసులో కీలక సాక్షులు రాలిపోతున్న తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అవి సహజమరణాలా లేక అసహజ మరణాలో నిర్దారించేవారు లేకపోవడంతో పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు నాయకులు ఈ అంశంపై సీరియస్ అయ్యారు. ఈ చావుల వెనకున్న కథేంటో తేల్చాలంటున్నారు. రాష్ట్ర క్యాబినెట్ కూడా ఈ మరణాలపై సీరియస్ గా చర్చించినట్టు సమాచారం.
2019 మార్చి 15న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు పులివెందులలోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును 2020 జూలై 9న పులివెందుల పోలీసుల నుంచి స్వాధీనం చేసుకుంది. వాస్తవానికి పులివెందుల పోలీసులు హత్య జరిగిన రోజే ఎఫ్ఐఆర్ 84/2019 నమోదు చేశారు. ఆ తర్వాత కేసు సీబీఐకి బదిలీ అయింది. దాదాపు 145 పేజీల చార్జిషీట్ ను సీబీఐ కోర్టుకు సమర్పించింది. ఇందులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి 10 మంది వరకు కీలక నిందితులుగా ఉన్నారు. కొందరు కీలక సాక్షులుగా ఉన్నారు.
అటువంటి వారిలో ఒకరు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటి వాచ్ మెన్ రంగన్న. ఆయన ప్రత్యక్ష సాక్షి. 2025 మార్చి 5, బుధవారం కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో చనిపోయారు. ఆయన వయసు 85 ఏళ్లు. రిటైర్డ్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు. ఈ హత్య కేసులో కీలక సాక్షి కావడంతో ఆయన మరణం పలు అనుమానాలకు తావిచ్చింది.
రంగన్న భార్య సుశీలమ్మ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును పరిశీలించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కూడా ఏర్పడింది. రంగన్న మరణానికి, ప్రస్తుతం జరుగుతున్న వివేకానంద రెడ్డి హత్య కేసుకు ఏమైనా సంబంధం ఉందా అని అధికారులు పరిశీలిస్తున్నారు. నిజమేమిటో నిగ్గు తేల్చేందుకు అన్ని కోణాల నుంచి దర్యాప్తు ప్రారంభించామని కడప పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ చెబుతున్నారు.
రంగన్న మరణంపై తీవ్ర అనుమానాలు కలగడానికి కారణం లేకపోలేదు. ఈ హత్య కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్న మరో ఐదుగురు ఇప్పటికే చనిపోయారు. వీరిలో ముగ్గురు వైసీపీ అధినేత, వివేకా అన్న కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయి. మరో రెండు టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలో జరిగాయి. ఈ కేసుతో దగ్గరి సంబంధం ఉన్న కటికారెడ్డి శ్రీనివాస రెడ్డి, కల్లూరి గంగాధర రెడ్డి, డ్రైవర్ నారాయణ, డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి సహా అందరూ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు.
వివేకానంద రెడ్డి హత్యపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణలో వాచ్‌మన్ కీలక పాత్ర పోషించారు. రంగన్న వాంగ్మూలాలను ఛార్జ్ షీట్‌లో చేర్చారు.
సాక్షుల మరణాల సరళిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఎస్పీ అశోక్ కుమార్ పునరుద్ఘాటించారు. “వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ప్రత్యక్ష సాక్షి రంగన్న మరణంపై అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులోని కీలక సాక్షులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. కేసు నమోదైంది. అన్ని కోణాలలో దర్యాప్తు చేయడానికి ఒక సిట్‌ను ఏర్పాటు చేశారు” అని ఆయన అన్నారు.
రంగన్న అనుమానాస్పద రీతిలో మరణించడంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిసారించింది. దీనిపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. మరణించిన ఆరుగురు సాక్షులకు అంత తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేకపోయినా, వారంతా అనారోగ్యంతోనే చనిపోయారని చెబుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ కేసులో కీలక సాక్షి, వాచ్‌మన్ రంగన్నది కూడా ముమ్మాటికీ అనుమానాస్పద మరణమేనని భావిస్తోంది. అందుకే మార్చి 7న జరిగిన మంత్రివర్గ సమావేశానికి డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాను ప్రత్యేకంగా పిలిచించి, వివరాలు తెలుసుకుంది. ఇటీవల కాలంలో డీజీపీని మంత్రివర్గ సమావేశానికి పిలవడం ఇదే ప్రధమం.
పరిటాల రవి కేసును గుర్తుచేసిన చంద్రబాబు..
రంగన్న మృతిపై తమకున్న అనుమానాల్ని, వివేకా హత్య కేసులో ఇప్పటి వరకు జరిగిన పరిణామాల్ని డీజీపీ వివరించారు. గతంలో పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఒకరి తర్వాత ఒకరుగా.. ఒకే తరహాలో మరణిస్తే, ఇప్పుడు వివేకా హత్య కేసులో సాక్షులు కూడా మరో తరహాలో వరుసగా మరణించడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. దేశంలో మరెక్కడా ఇలా జరగలేదన్నారు. వివేకా హత్య కేసులో సాక్షులు అనుమానాస్పదరీతిలో మరణించడం వెనుక కేసును నిర్వీర్యం చేసే కుట్రకోణం ఉందన్న అనుమానాన్ని మంత్రివర్గం వ్యక్తం చేసినట్టు సమాచారం. సాక్షులంతా ఇలా అనుమానాస్పదంగా మరణించడాన్ని తీవ్రంగా పరిగణించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆరుగురు సాక్షులు మరణించడానికి ముందు వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ నేపథ్యంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. వివేకా హత్య కేసులో మిగతా సాక్షులకు భద్రతను పటిష్ఠపరచాల్సిన అవసరంపైనా క్యాబినెట్ చర్చించినట్టు సమాచారం.
ఎవరెవరు చనిపోయారంటే...
వివేకా గుండెపోటుతో చనిపోయారని ఆవేళ విజయసాయిరెడ్డి మొదట ప్రకటించడం, సాక్ష్యాల్ని రూపుమాపేందుకు ప్రయత్నించడం వంటి ఆరోపణలు వచ్చాయి. నాటి ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ మొదట సీబీఐ విచారణ కోరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అవసరం లేదనడం వివాదాస్పదమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయకుండా సీబీఐ అధికారుల్ని అడ్డుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పైనే ఎదురు కేసు పెట్టారు. హత్య కేసులో నిందితుడు దస్తగిరి అప్రూవర్ గా మారారు. వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీతనే నిందితురాలిగా చూపే ప్రయత్నం కూడా జరిగింది.
వివేకా హత్య కేసులో సాక్షులు, అనుమానితులైన కటికరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డ్రైవర్ నారాయణ యాదవ్, కల్లూరి గంగాధర్‌రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, డా.వైఎస్ అభిషేక్‌రెడ్డి, వాచ్‌మన్ రంగన్న మృతి చెందారు. ఈ మరణాలన్నింటిపైనా ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టనుంది. పోలీసుల వల్లే రంగన్న చనిపోయారంటూ ప్రచారం చేయటం వెనక వివేకా హత్య కేసు నిందితుల ప్రమేయం ఉండొచ్చనీ దర్యాప్తు చేస్తున్నామని డీజీపీ చెప్పినట్టు తెలిసింది.
సాక్షుల మరణాలు...
2019 సెప్టెంబర్ 2వ తేదీన కె.శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి
2022 జూన్ 9న ఈ కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి మృతి
వివేకాకు కుట్లు వేసిన వైఎస్ జగన్ భార్య భారతిరెడ్డి తండ్రి డాక్టర్ ఈసీ గంగిరెడ్డి మృతి
కుట్లు వేయటానికి సహకరించిన జగన్ తమ్ముడు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి
వివేకా హత్య జరిగిన రోజు జగన్ దంపతులను హైదరాబాద్ నుంచి పులివెందులకు తీసుకొచ్చిన కారు డ్రైవర్ నారాయణ యాదవ్ మృతి
వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్న కూడా అనుమానాస్పదంగా కడప రిమ్స్ ఆస్పత్రిలో మృతి.
దర్యాప్తు జరిగితేనే మంచిది..
మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షులు వరుసగా మరణించడం నిజంగా ఆందోళన కలిగించే అంశమే. ఈ విషయమై సమగర దర్యాప్తు జరపాలని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులు రెడ్డి, బీటెక్ రవి డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న షేక్ దస్తగిరి సహా మిగతా వారికి కూడా భద్రత పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిజానిజాలు బయటకు రావాలంటే క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని అన్నారు.
Next Story