నాడు కమ్యునిస్టులదే హవా..
కమ్యునిస్టులకు నాడున్న ప్రాభవం నేడు లేదు. పొత్తులతో మధ్య మధ్యలో మెరిసినా తర్వాత తెరమరుగవుతూ వచ్చారు. దీంతో అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.
తొలి నాళ్లల్లో హవా కొనసాగించిన కమ్యునిస్టులు రాను రాను ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చారు. ఉమ్మడి కమ్యునిస్టులుగా ఉన్నంత కాలం రాష్ట్రంలో పార్టీల సంఖ్య ఎక్కువుగా ఉన్నా కమ్యునిస్టులు తమ ఉనికిని కోల్పో లేదు. కమ్యునిస్టులు రెండుగా చీలిన తర్వాత స్వతంత్రంగా పోటీ చేయడం మానేసి, ఇతర పార్టీలతో పొత్తులతో వచ్చారు. దీంతో సీట్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. గడచిన 10 ఏళ్లల్లో అసెంబ్లీలో కమ్యునిస్టులకు ప్రాతినిధ్యమే లేMýంండా పోయింది.
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మద్రాసు రాష్ట్రంలో భాగంగా 1952 తొలి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మద్రాసు రాష్ట్రంలో ఉండేవి. నాడు కమ్యునిస్టులు, కాంగ్రెస్‌లకు మధ్యనే హోరా హోరీ పోరు జరిగింది. మొదటి ఎన్నికల్లో సీపీఐ 41 స్థానాలు సంపాదించగా కాంగ్రెస్‌కు అంత కంటే తక్కువ 39 సీట్లు వచ్చాయి. కిసాన్ మజ్దూర్ పార్టీకి 20, కృషీకార్‌లోక్ పార్టీకి 16, సోషలిస్టులకు 6, స్వతంత్ర అభ్యర్థులకు 18 సీట్లు వచ్చాయి. నాడు 140 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి.
కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా కూటములు
నాడు కమ్యునిస్టులకు ఏర్పాటు చేసే మెజారిటీ వచ్చింది. కానీ కమ్యునిస్టులు అధికారంలోకి వస్తే వాళ్లను తిరిగి ఓడించడం అసాధ్యమని భావించిన కాంగ్రెస్ పార్టీ, కృషీకార్‌లోక్ పార్టీ, కిసాన్ మజ్దూర్ పార్టీలను కలుపుకొని యునైటెట్ కాంగ్రెస్ కూటమిగా ఏర్పడ్డాయి. దీంతో కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తర్వాత ప్రకాశం పంతులు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రంలో రెండేళ్ల తర్వాత ప్రకాశం పంతులు ప్రభుత్వం పడిపోయింది. తిరిగి 1955లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బెజవాడ గోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. మొత్తం 196 సీట్లకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌కు 119, సీపీఐకి 15, కృషీకార్‌లోక్ పార్టీకి 22, పీఎస్పీకి 13, ప్రజాపార్టీకి 5, స్వంతంత్రులు 22 మంది గెలిచారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత
ఆంధ్రా తెలంగాణ కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది. తర్వాత తెలంగాణ ప్రాంతం వరకు 1957లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 104 స్థానాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌కు 68, పీడీఎఫ్‌కు 22, సోషలిస్టు 2, ప్రజాపార్టీ 1, ఎస్‌సీఎఫ్ 1, స్వతంత్రులు 10 మంది గెలిచారు. తర్వాత 1962లో జరిగిన ఎన్నికల్లో కూడా కమ్యునిస్టుల ప్రభావం కొనసాగింది. 300 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌కు 177, సీపీఐ 51, స్వతంత్ర పార్టీకి 19, సోషలిస్టులు 2, ఇండిపెండెంట్లు 51 విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా సీపీఐ మాత్రమే పోటీ చేస్తుండగా, స్వతంత్రులు, ఇతర పార్టీలు కమ్యునిస్టుల హవాను అడ్డుకున్నారు.
క్రమక్రమంగా తగ్గిన కమ్యునిస్టుల బలం
1967 ఎన్నికలకు ముందు కమ్యునిస్టులు రెండు పార్టీలు సీపీఐ, సీపీఐ(ఎం)లుగా విడిపోయారు. రెండు పార్టీలుగా విడిపోయిన తర్వాత మొదటి సారి జరిగిన 1967 ఎన్నికల్లో సీపీఐకి 10, సీపీఎంకు 9 స్థానాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 165 సీట్లు గెలవగా స్వతంత్రులు దాదాపు 68 మంది గెలవడం విశేషం. 1972లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ సీట్ల సంఖ్య ఇంకా తగ్గింది. 7 సీట్లకు పరిమితమైంది. సీపీఎంకు 1 సీటు వచ్చింది. కాంగ్రెస్ 219 సీట్లు సాధించింది. స్వతంత్రులు 57 మంది గెలిచారు. 1978 ఎన్నికల్లో ఇందిరా గాంధీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ఐ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో సీపీఐకి 6, సీపీఎంకు 8 స్థానాలు దక్కాయి. ఈ ఎన్నికల్లో కొత్తగా రంగంలోకి దిగిన జనతా పార్టీ ఏకంగా 60 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్‌ఐకి 175 స్థానాలు వచ్చాయి.
తెలుగుదేశం పార్టీ రాకతో..
1983 ఎన్నికల్లో 294 స్థానాలకు ఎన్నికలు జరగ్గా కొత్తగా ఆవిర్భవించిన టీడీపీకి 201 సీట్లు రాగా, సీపీఐకి 4, సీపీఎంకు 5 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ఐకి 60 స్థానాలు దక్కాయి. జనతా పార్టీ కేవలం ఒక స్థానానికే పరిమితమైంది. 1985 ఎన్నికల్లో టీడీపీకి 202 సీట్లు, సీపీఐకి 11, సీపీఎంకు 11 చొప్పున సీట్లు దక్కాయి. 1989 ఎన్నికల్లో సీపీఐకి 8, సీపీఎం 6 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ ఐ అధిక స్థానాలు దక్కించుకుంది. టీడీపీ 74 స్థానాలకు పరిమితమైంది. 1994 ఎన్నికల్లో సీపీఐకి 19 సీట్లు, సీపీఎంకు 15 సీట్లు దక్కాయి. అయితే ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు టీడీపీతో కలిసి పోటీ చేశాయి. టీడీపీకి 216 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 26 సీట్లకు పరిమితమైంది. 1999 ఎన్నికల్లో సీపీఎంకు 2, సీపీఐకి అసెంబ్లీలో స్థానం దక్క లేదు. 2004 ఎన్నికల్లో సీపీఎంకు 9, సీపీఐకి 6 స్థానాలకు దక్కాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎంలు కలిసి కూటమిగా పోటీ చేశాయి. టీడీపీ, బిజెపీలు ఒక కూటమిగా పోటీ చేశాయి. కాంగ్రెస్‌కు 185 స్ధానాలు, టీడీపీకి 47 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాడు. 2009 ఎన్నికల్లో సీపీఐ 4, సీపీఎం 1 స్థానంలో గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎంలు కూటమిగా పోటీ చేశాయి. ప్రముఖ సినీనటుడు ప్రజారాజ్యం పార్టీ కూడా రంగంలోకి దిగింది. దీనికి 18 స్థానాలు దక్కించుకుంది. 2014,2019 ఎన్నికల్లో కమ్యునిస్టులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.
Next Story