
అరరే.. 5 అంతస్తుల అపార్ట్మెంట్ ఇలా ఒరిగిందేమిటీ?
విశాఖపట్నం వెలమపేటలో టెన్షన్, టెన్షన్..
విశాఖపట్నం.. వెలమపేట.. బాగా రద్దీగా ఉండే ప్రాంతం.. అక్కడ నిర్మించిన ఓ 5 అంతస్తుల అపార్మెంట్ భవనం ఉన్నట్టుండి గురువారం ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. కింది అంతస్తులో కమర్షియల్ కాంప్లెక్స్, పైనున్న 5 ఫోర్లలో 8 అపార్ట్మెంట్లు ఉన్నాయి. భవనం ఒరిగిపోవడంతో అందులో ఉంటున్న జనం హాహాకారాలు మొదలుపెట్టారు. ఉరుకులు పరుగులు తీశారు. కట్టి ఏడాది కూడా కాకుండానే ఈ భవనం ఎందుకు ఒరిగిందనేది అంతుబట్టకుండా ఉంది.
ఈ భవనం ఒక వైపునకు ఒరిగింది. ఐదంతస్తుల భవనం మరో ఇంటి మీదకి వంగడంతో అది ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భవనం నివాసానికి అనుకూలం కాదని వెంటనే ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఘటనాస్థలిని పరిశీలించారు. వెలమపేట పరిసర ప్రాంతంలో లూజ్ సాయిల్ కారణంగా ఎత్తైన భవనాల నిర్మాణం ప్రమాదకరమని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు.
భవనం ఒరిగిపోవడమే కాకుండా ముందున్న ప్రాంతమంతా బీటలు వారింది. ఇది ఏ నిమిషంలోనైనా కూలిపోవచ్చు. అపార్ట్మెంట్లను ఖాళీ చేసేలా అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. లక్షలు పోసి కొనుగోలు చేశామంటూ అపార్ట్మెంట్ వాసులు వాపోతున్నారు.
కాశిరెడ్డి ప్లాజా భవనం పక్కనున్న మరో భవనం మీద ఒరిగిపోవడంతో అది కూడా బీటలు వారింది. ఇప్పుడు అందులోని వారు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు అపార్ట్మెంట్ల మధ్య కనీసం ఒక మీటరు కూడా దూరం లేకుండా కట్టారు. అసలు ఈ నిర్మాణాలకు మున్సిపాలిటీ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారంటూ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే కొద్దికాలం కిందట వెలమపేట ప్రాంతంలోని భూమి కూడా కుంగింది. రోడ్లు కూడా బీటలు వారాయి. ఇది లూజ్ సాయిల్ కావడంతో ఇలా జరుగుతున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో కాశిరెడ్డి ప్లాజా కుంగింది.
Next Story