‘సరోగసీ’ పాపంలో అధికారులదీ సగపాలు!
x
సృష్టి ఎండీ డాక్టర్‌ నమ్రత

‘సరోగసీ’ పాపంలో అధికారులదీ సగపాలు!

అధికారుల అండదండలతోనే డాక్టర్‌ నమ్రత చేస్తున్న ‘సరోగసీ’ పాపాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయాయి. అనుమతుల్లేకుండా ఏళ్లతరబడి నడుస్తుంటే కళ్లెందుకు మూసుకున్నారు.


ఏడాదీ రెండేళ్లు కాదు.. దాదాపు రెండు దశాబ్దాల నుంచి ‘సృష్టి’ ఫెర్టిలిటీ ఆస్పత్రుల్లో అక్రమాలు పురుడు పోసుకుంటూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సెంటర్లు నిబంధనలు పాటించకుండానే నిర్భీతిగా నడుస్తున్నాయి. అక్రమార్గాల్లో సరోగసీ వ్యవహారాలు నడుపుతున్న సృష్టి ఎండీ డాక్టర్‌ అత్తలూరి నమ్రత అలియాస్‌ పచ్చిపాల నమ్రత తాను సంపాదించిన రూ.కోట్ల సొమ్ములో వైద్యారోగ్య శాఖ, ఇతర అధికారులను మేనేజ్‌ చేయడానికి వెచ్చిస్తోందన్న ఆరోపణలున్నాయి. అలా ముడుపులు అందుకున్న అధికారులు ‘సృష్టి’ జోలికి వెళ్లడం లేదు. అందులో ఏం జరుగుతుందో తొంగి చూడడం లేదు. కనీసం ఆ ఆస్పత్రి/ఫెర్టిలిటీ/టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ లైసెన్స్‌ ఉందా? గడువు మీరిందా? అన్నదీ తనిఖీలు చేయడం లేదు. నిబంధనలను పాటిస్తూ నడుస్తుందా? అన్నదీ పరిశీలించడం లేదు.

విశాఖలోని యూనివర్సల్‌ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌

ఉదాహరణకు విశాఖపట్నంలో నడుస్తున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై పదేళ్ల క్రితం నుంచీ కేసులు నడుస్తున్నాయి. 2016, 2018, 2020ల్లో ఈ ఆస్పత్రిలో సరోగసీ, శిశు అక్రమ రవాణా వ్యవహారాలు సాగిస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ నమ్రతపై కేసులు నమోదు చేశారు. ఆమెతో పాటు మరికొందరు డాక్టర్లను కూడా అరెస్టు చేశారు. జైలుకు పంపారు. అంతేకాదు.. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ‘సృష్టి’ సెంటరును కూడా సీజ్‌ చేశారు. విచిత్రంగా.. ఇలా కేసు నమోదవడం, అరెస్టయి జైలుకెళ్లి రావడం, సీజ్‌ అయిన ఆస్పత్రి ఎప్పటిలాగే తెరచుకుని నడవడం షరా మామూలు అయిపోయింది. 2016లో ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్‌ లైసెన్స్‌ రద్దుతో 2018లో యూనివర్సల్‌ సృష్టి ఫెర్టిలిటీ అండ్‌ రీసెర్చి సెంటర్‌ పేరుతో కొత్త లైసెన్స్‌ తెచ్చుకుని అదే చోట నడుపుతోంది. ఇంతలో 2020లో నమోదైన మరోకేసులోనూ ఆస్పత్రిని సీజ్‌ చేశారు. ఈ ఆస్పత్రి లైసెన్స్‌ గడువు 2023 జూన్‌ 7తో ముగిసినా రెన్యూవల్‌ చేయించుకోలేదు. రెండేళ్ల నుంచి ఈ ఆస్పత్రి అనధికారికంగా నడుస్తున్నా వైద్యారోగ్యశాఖ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదంటే మామూళ్ల మహాత్మ్యంగానే అర్థం చేసుకోవచ్చు. తాజాగా నాలుగు రోజుల క్రితం వెలుగు చూసిన సరోగసీ కేసుతో మేలుకున్న విశాఖ వైద్యారోగ్య శాఖ అధికారుల పరిశీలనలో ఈ ఆస్పత్రి లైసెన్స్‌ గడువు రెండేళ్ల క్రితమే ముగిసిందని తీరిగ్గా సెలవిచ్చారు.

2023తోనే గడువు ముగిసిన విశాఖ సృష్టి లైసెన్స్‌

బెజవాడలో అధికారుల తీరు ఇలా..
2015లో విజయవాడ సృష్టి ఆస్పత్రి ఆక్రమాలపై అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాబు విచారణ జరిపి ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై 2018లో సృష్టి ఆస్పత్రి లైసెన్స్‌ రద్దయింది. దీంతో సృష్టి ఎండీ డాక్టర్‌ నమ్రత యూనివర్సల్‌ హెల్త్‌ కేర్‌ పేరుతో లైసెన్స్‌ పొంది యూనివర్సల్‌ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ పేరిట విజయవాడ బెంజిసర్కిల్‌లో సరికొత్త ఆస్పత్రిని ‘సృష్టి’ంచింది. ఈ ఆస్పత్రి పైన ‘డాక్టర్‌ నమ్రతా’స్‌ సృష్టి అని తాటికాయంత అక్షరాలు రాయించింది. ఈ ఆస్పత్రినీ డాక్టర్‌ నమ్రతే నడుపుతోందని తెలిసినా అక్కడేం జరుగుతుందో వైద్యారోగ్యశాఖ అధికారులు ఆమె ఛాయలకు వెళ్లలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే విజయవాడలో శిశువుల అక్రమ రవాణా/విక్రయం కేసులో నమ్రతను 2020 సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. అయినా ఆక్కడ అధికారులు ఆమె నడుపుతున్న సృష్టి ఆస్పత్రికి ఎలాంటి ఢోకా లేకుండా సహకరిస్తున్నారు.
సికింద్రాబాద్‌లో ఇలా..
ఇక సికింద్రాబాద్‌లో డాక్టర్‌ పచ్చిపాల నమ్రత నడుపుతున్న సృష్టి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌ గడువు కూడా 2021లోనే ముగిసింది. ఆ గడువు ముగిశాక లైసెన్స్‌ రెన్యూవల్‌ చేసుకోకుండా తమ ఆస్పత్రిని మూసి వేసుకుంటున్నానని వైద్యారోగ్య శాఖ అధికారులకు చెప్పింది. అది నిజమేనని నమ్మేసి ఇక అటు వైపు చూడడం మానేశారు. కానీ ఆమె మూసివేయకుండా తన సెంటరును యథావిధిగా నడుపుతోంది. తాజాగా సరోగసీ బాగోతం వెలుగు చూసిన తర్వాత నాలుగేళ్ల క్రితమే ఈ ఆస్పత్రి లైసెన్స్‌ గడువు ముగిసిన వైనాన్ని సాక్షాత్తూ అక్కడి డీఎంహెచ్‌వో వెంకట్‌ మీడియా సమక్షంలోనే చెప్పారు.
మీడియాలో వస్తేనే హడావుడి..
తెలుగు రాష్ట్రాల్లో ‘సృష్టి’ సృష్టిస్తున్న అరాచకాలు, అక్రమాలపై మీడియాలో వార్తలు/కథనాలు వచ్చినప్పుడే సంబంధిత వైద్యారోగ్య శాఖ అధికారులు హడావుడి చేస్తున్నారు. సృష్టి సెంటర్లకు వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీడియాకు చెబుతున్నారు. అంతేతప్ప వాళ్లంతట వాళ్లే తనిఖీలు చేసి కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. వాస్తవానికి వైద్యారోగ్య శాఖ అధికారులు తమ పరిధిలో ఎన్ని ఆస్పత్రులున్నాయి? వాటి లైసెన్స్‌ గుడువు ఎప్పటి వరకు ఉంది? రెన్యూవల్‌ చేయించుకున్నారా? లేదా? నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా? వంటి అంశాలను తరచూ పరిశీలించాల్సి ఉంది. గడువు మీరాక కూడా రెన్యూవల్‌ చేయించుకోకుండా అనధికారికంగా నడుపుతున్న ఆస్పత్రుల లైసెన్సులు రద్దు చేసి సంబంధిత నిర్వాహకులపై చర్యలు తీసుకోవలసి ఉంటుంది. కానీ అలాంటి తనిఖీలు చేస్తే సృష్టిలాంటి అరాచకాలకు, అడ్డగోలు వ్యవహారాలకు ఆస్కారమే ఉండేది కాదు. డాక్టర్‌ నమ్రత అడ్డదారుల్లో సంపాదిస్తున్న సంపాదనలో సంబంధిత అధికారులకు పెద్ద మొత్తంలో ముట్టజెప్పుతుండడంతో ఆమె పాపాల్లో వీరూ పాలుపంచుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
కొత్తగా తెరపైకి నీరజ పేరు..
తన వక్రబుద్ధి, అక్రమార్గాలతో వైద్యరంగంలో కల్లోలం సృష్టిస్తున్న ’సృష్టి’ ఎండీ డాక్టర్‌ అత్తలూరి నమ్రత అలియాస్‌ పచ్చిపాల నమ్రత పేరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తాజాగా ఆమె పేరు నీరజ గాను ఓ పత్రికలో తెరపైకి వచ్చింది. ఆమె పేరు పలు రకాలుగా మీడియాలో వస్తుండడం వెనక మర్మమేమిటన్నది ఆసక్తికరంగా మారింది.
Read More
Next Story