
స్త్రీ శక్తితో ఆర్టీసీలో ఆక్యుపెన్సీ పెరిగింది
స్త్రీ శక్తి బస్సులకు రెండు వైపులా బోర్డులు పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
స్త్రీ శక్తితో ఆర్టీసీలో ఆక్యుపెన్సీ పెరిగిందని ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు. మహిళల సహకారంతో స్త్రీ శక్తి పథకం గ్రాండ్ సక్సెస్ అయిందని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆర్టీసీపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. స్త్రీ శక్తి పథకం అమలు ఎలా జరుగుతుందని ఆర్టీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆక్యుపెన్సీ రేషియో ఎంత మేర పెరిగిందని ఆరా తీశారు. స్త్రీ శక్తి బస్సుల్లో సీట్ల కోసం పోటీ పడే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఎదురువుతున్నాయా..? అని ముఖ్యమంత్రి అడిగారు. స్త్రీ శక్తి పథకం అమలు చేసినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని అధికారులు చెప్పారు.
గతంలో ఆక్యుపెన్సీ రేషియో 68 నుంచి 70 శాతంగా ఉండేదని.. ఇప్పుడు 60 డిపోల పరిధిలో తిరిగే బస్సుల్లో 100 శాతం ఆక్యుపెన్సీ రేషియో వస్తోందని.. అలాగే 13 జిల్లాల్లో 100 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో బస్సులు తిరుగుతున్నాయని అధికారులు వివరించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సందర్భంగా సీట్ల కోసం ఇబ్బందులు.. గందరగోళం వంటి సంఘటనలు తలెత్తడం లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. అంతే కాకుండా.. ఉచిత బస్సు వెసులుబాటును మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారని... అవసరమైన మేరకే ప్రయాణాలు చేస్తున్నారని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ముఖ్యమంత్రికి వివరించారు. ఒకప్పుడు బాలికా విద్యను ప్రొత్సహించేందుకు సైకిళ్లు ఇచ్చాం. ఇప్పుడు విద్యార్థినులు, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కానుకగా ఇచ్చాం. దీని వల్ల బస్ పాసుల కోసం క్యూ లైన్లల్లో నిల్చొనే శ్రమ తప్పింది. ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే భద్రత కూడా ఉంటుందని అని సీఎం చెప్పారు.