కష్ట కాలంలో అండగా ఉన్నారు
x

కష్ట కాలంలో అండగా ఉన్నారు

అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్ ప్రవాసాంధ్రులతో భేటీ అయ్యారు.


అమెరికాలో ఉన్నానా లేక ఆంధ్రలో ఉన్నానా అంటూ లోకేష్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. కూటమి భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీ లకు చెందిన పలువురు ప్రవాసాంధ్రులు ఆ పార్టీ జెండాలతో లోకేష్ కు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అమెరికాలోని పలు నగరాల్లో పర్యటిస్తూ, ముఖ్యంగా తెలుగు డయాస్పోరా సభ్యులు, ప్రముఖులతో సమావేశమవుతున్నారు. ప్రవాసాంధ్రుల మద్దతును కొనియాడుతూ, రాష్ట్రంలో అమలు చేయబోయే అభివృద్ధి లక్ష్యాలను ఆయన వివరిస్తున్నారు.

డల్లాస్ లో లోకేశ్ ఏమన్నారంటే..

డల్లాస్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ తెలుగువారి సత్తా గురించి ప్రస్తావించారు. తెలుగువారు దశాబ్దాల క్రితమే అమెరికాకు వచ్చి తమ ప్రతిభతో సత్తా చాటారని, వారిని ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుంటుందని లోకేశ్ తెలిపారు. కష్టకాలంలో తమకు మద్దతు పలికారని, గత కష్టకాలంలో (ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు సమయంలో) ప్రవాసాంధ్రులు తమ కుటుంబానికి అండగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఏపీలో అభివృద్ధి వేగం పుంజుకుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగంగా డెవలప్మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా' మారిందని, అభివృద్ధి విషయంలో రాష్ట్రం వేగంగా ముందుకు వెళ్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమేనని లోకేశ్ స్పష్టం చేశారు. ప్రవాసాంధ్రులకు ఏ కష్టం వచ్చినా ఏపీఎన్ఆర్టీ (APNRT) అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్డీయే కూటమి 'విడాకులు, మిస్ ఫైర్‌లు లేకుండా' మరో 15 ఏళ్లు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుందని, ప్రజల మద్దతుతో రికార్డులు తిరగరాస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఏపీలో 'డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్' ఉందని, 'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ' తమ నినాదమని లోకేశ్ పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని, రెడ్‌బుక్ తన పని తాను చేసుకుపోతుందని లోకేశ్ స్పష్టం చేశారు. తాము ఎలాంటి కక్షసాధింపులకు పాల్పడటం లేదని, న్యాయబద్ధమైన పాలనే అందిస్తామని పునరుద్ఘాటించారు. 2019-2024 మధ్య జరిగిన 'విధ్వంస పాలన'కు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి లోకేశ్ పర్యటనలో భాగంగా మరిన్ని నగరాల్లో ప్రవాసాంధ్రులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యే అవకాశం ఉంది.

రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) సాధించడమే ప్రధాన లక్ష్యంగా లోకేష్ ఈ పర్యటన చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అమెరికాకు వెళ్లడం ఇది రెండోసారి. పర్యటనలో భాగంగా డల్లాస్‌కు చేరుకున్న నారా లోకేష్‌కు ప్రవాసాంధ్రులు, టీడీపీ మద్దతుదారులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. డల్లాస్‌లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో గుమిగూడిన జనాన్ని చూసి అక్కడి అధికారులు ఆశ్చర్యపోయారని, లా అండ్ ఆర్డర్ సమస్య కారణంగా వేరే గేట్ నుంచి రావాల్సి వచ్చిందని ఆయన ఈ సందర్భంగా వారితో పంచుకున్నారు. సోమ, మంగళవారాల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో లోకేష్ సమావేశం కానున్నారు. తయారీ, పునరుత్పాదక ఇంధనం, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రోకెమికల్, AI, సెమీకండక్టర్స్ వంటి రంగాలలో పెట్టుబడి అవకాశాలను ఆయన వివరించనున్నారు. పర్యటన చివరి అంకంలో డిసెంబరు 10వ తేదీన కెనడాలోని టొరంటోలో పర్యటిస్తారు. అక్కడ స్థానిక వ్యాపారవేత్తలు, పారిశ్రామిక సంఘాలతో సమావేశమై పెట్టుబడులకు ఆహ్వానం పలుకనున్నారు.

Read More
Next Story