మద్రాస్ ఐఐటీకి కోట్ల విరాళం.. ఇచ్చిందెవరంటే..
x

మద్రాస్ ఐఐటీకి కోట్ల విరాళం.. ఇచ్చిందెవరంటే..

ఐఐటీ మద్రాస్‌కు ఎన్‌ఆర్ఐ కృష్ణా చివుకుల భారీ విరాళం ప్రకటించారు. దాతృత్వంలో ఆయనకు ఆయనే సాటి. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా..


‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలపరా నీ జాతి నిండు గౌరవము’ అని రాయప్రోలు సుబ్బారావు కవితలో చెప్తే దానిని కృష్ణా చివుకుల అక్షర సత్యం చేశారు. అమెరికా, బెంగళూరులో పలు కార్పొరేట్ సంస్థలు స్థాపించి ఎంతో పేరు గడించిన ఆయన తాజాగా తనకు మాతృభూమిపై ఉన్న ప్రేమను విరాళం రూపంలో చూపారు. ఆ విరాళం కూడా భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దే రంగానికి ఇవ్వడం ఆయన ఆలోచనా విధానానికి అద్దం పడుతోంది. ఏదో చారిటీలకు కాకుండా మద్రాస్ ఐఐటీకి ఆయన ఈ విరాళం ఇచ్చారు. అది కూడా కోటీ, రెండు కోట్ల రూపాయలు కాదు.. అక్షరాల రూ.228 కోట్లు విరాళం ప్రకటించారు. ఆయన కూడా ఇంజినీరింగ్ విద్యను అక్కడే అభ్యసించారు. అయితే మద్రాస్ ఐఐటీ నిబంధనల ప్రకారం విరాళాలిచ్చే దాతలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 6వ తేదీన క్యాంపస్‌లో ఈ ఒప్పంద కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ఆయన అమెరికా నుంచి చెన్నైకి విచ్చేస్తున్నారు. ఆయన అందిస్తున్న ఈ విరాళం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడి పేద పిల్లలకు విద్యాదానం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని, అదే ఉదారతను ఆయన మరోసారి కనబరిచారని కృష్ణా చివుకుల సన్నిహితులు అంటున్నారు.

దాతృత్వంలో ఆయనకు ఆయనే సాటి

దాతృత్వం విషయంలో ఆయనకు మరెవరు సాటి రారనే చెప్పాలి. మద్రాస్ ఐఐటీపై ఆయన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్నోసార్లు దాతృత్వం చూపారు. 60 ఏళ్లనాటి హాస్టళ్లను ఆధునికీకరించడానికి రూ.5.5 కోట్లు వెచ్చించారు. 2014లో ఐఐటీ-ఎంశాట్ పేరుతో విద్యార్థులు శాటిలైట్ రూపొందించడానికని దాదాపు రూ.1.5కోట్లు సాయం చేశారు. క్యాంపస్‌లో స్పేస్‌ల్యాబ్. ప్రతిభావంతులైన క్రీడాకారులకు స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ అడ్మిషన్ ప్రోగ్రాం పేరుతో విరాళాలు అందిస్తున్నారాయన. ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2015లో ఐఐటీ మద్రాస్, 2016లో ఐఐటీ బాంబే ప్రతిష్టాత్మక అలుమ్నస్ అవార్డును అందించాయి. అంతేకాకుండా బెంగళూరులోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దాదాపు 2,200 మంది పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని సమకూరుస్తున్నారు. బెంగళూరులో బాప్టిస్ట్ ఆసుపత్రికి మెరుగుపరిచి పేద పిల్లలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. మైసూర్ సమీపంలోని చామరాజనగర్‌లో ఓ పాఠశాలను దత్తత తీసుకున్నారు కృష్ణ. అందులో 380 మంది పేద, అనాథ పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పుడు ఐఐటీ మద్రాస్‌లో పరిశోధన వసతుల పెంపు కోసం ఆయన రూ.228 కోట్ల విరాళం ప్రకటించారు.

బాపట్ల నుంచి మొదలైన చివుకుల ప్రస్థానం

కృష్ణా చివుకుల.. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో జన్మించారు. ఆయన తన బీటెక్‌ను ఐఐటీ బాంబేలో పూర్తి చేశారు. ఆ తర్వాత 1970లో ఐఐటీ మద్రాస్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ పూర్తిచేశారు. ఆ తర్వాత ఎంబీఏను హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి చేశారు. తముకూర్ యూనివర్సిటీలో పీహెచ్‌డీని కంప్లీట్ చేశారు. 37ఏళ్ల వయసులోనే అమెరికాలోని హాఫ్‌మన్ ఇండస్ట్రీకి తొలి భారతీయ ప్రెసిడెంట్‌, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సంస్థ నుంచి బయటకు వచ్చిన తర్వాత న్యూయార్క్ కేంద్రంగా ‘శివ టెక్నాలజీస్’ సంస్థను స్థాపించారు. మాస్ స్పెక్ట్రోస్కోపిక్ సాంకేతికతను అందించడం ప్రారంభించారు. ఈ రంగంలో ఈ సంస్థ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఇదే కంపెనీనని ఆయన బెంగళూరులో కూడా ఏర్పాటు చేశారు. 1997లో భారత్‌లో తొలిసారి మెటల్ ఇంజెక్షన్ మౌల్డింగ్(ఎంఐఎం) సాంకేతకతను పరిచయం చేసింది ఈయనే. ప్రస్తుతం ‘ఇండో యూఎస్ ఎంఐఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో నెలకొల్పిన సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇండియాలో వీరి వార్షిక టర్నోవర్ రూ.1000 కోట్లకు పైనే ఉంది. 2009లో రేణిగుంట కేంద్రంగా గౌరి వెంచర్స్‌ను స్థాపించారు.

Read More
Next Story