
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట
ఎవరీ పండా.. ఎందుకంత కసితో గుడి కట్టించారు?
ఇప్పుడది కాశీబుగ్గ కాదు.. కన్నీటి బుగ్గ..ఎటు చూసినా ఆర్తనాథాలే.. మిన్నంటిన రోదనలే..
ఎటు చూసినా ఆర్తనాథాలే.. మిన్నంటిన రోదనలే.. స్వామి దర్శనానికి వెళ్లే క్యూ లోనే కుప్పకూలిన వారు కొందరు.. క్యూ లైను నుంచి బయటపడలేక సొమ్మ సిల్లిన వారు కొందరు.. అయిన వారి ఆచూకీ కోసం అరుపులు, కేకలతో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పదనాపురం అల్లాడుతోంది. పదనాపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట కారణంగా పది మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
అనూహ్యంగా జరిగిన ఈ దుర్ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.
కార్తీకమాసం, శనివారం, ఏకాదశి కావడంతో శ్రీవెంకటేశ్వర ఆలయానికి దాదాపు 25వేల మంది భక్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇంతమంది భక్తుల్ని నియంత్రించే వ్యవస్థలు లేకపోవడంతో ఈ తొక్కిసలాట జరిగింది. స్వామి వారి దర్శనానికి జనం ఒక్కసారిగా తోసుకురావడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు ప్రాధమిక సమాచారం.
ఈ ఆలయానికి ఇంత పేరు ఎలా వచ్చిందీ?
కాశీబుగ్గ పదనాపురం వద్ద నాలుగేళ్ల కిందటే ఈ ఆలయం నిర్మాణం జరిగింది. ధర్మకర్త హరిముకుంద్ పండా ఈ ఆలయాన్ని ప్రారంభించారు. 12 ఎకరాల ఆయన సొంత భూమిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయం ఐదు ఎకరాల్లో ఉంది. సుమారు రూ.20 కోట్లతో దీనిని నిర్మించారు. తనకు తిరుమల వెళ్లిన సమయంలో దర్శనం కాకపోవడంతోనే ఇక్కడ ఆలయం నిర్మించినట్టు తెలిసింది.
కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. చిన్న తిరుపతిగా ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ప్రసిద్ధి కాగా ఇప్పుడు ఆ పేరు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి క్షేత్రానికీ వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజలు తిరుమల వెళ్లి ఇక్కట్లు పడేదానికి బదులు కాశీబుగ్గ వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించి వస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం, హరిముకుంద్ పండా తిరుమల అనుభవం గురించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. దీంతో భక్తులు ఈ ఆలయానికి ఇటీవలి కాలంలో పోటెత్తుతున్నారు.
రోజూ వేయి మంది, ఇవాళ 25 వేల మంది...
ఆలయానికి ప్రతీరోజు దాదాపు 1000 మంది వరకు భక్తులు వస్తుంటారు. శనివారం ఈ సంఖ్య రెండు నుంచి మూడు వేల మధ్య ఉంటుంది. ఆలయ సామర్థ్యం దాదాపు రెండు వేల నుంచి మూడు వేలుగా ఉంటుంది. అయితే, ఇవాళ (నవంబర్ 1) ఏకాదశి. పైగా కార్తీకమాసం. ఆలయానికి దాదాపు 25వేల మంది భక్తులు వచ్చినట్టు సమాచారం.
భక్తుల రద్దీని ఆలయ సిబ్బంది గానీ ఇతరులు గానీ అంచనా వేయలేదు. స్థానిక పోలీసులు రోజూ మాదిరే భద్రత ఏర్పాట్లు చేశారు. భక్తులు పెరగడం, ఆలయం లోపల సరైన సౌకర్యాలు లేకపోవడం కారణంగా తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. 25 వేల మంది వరకు భక్తులు వస్తారని ఎవ్వరూ అంచనా వేయకపోవడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన గంట తర్వాత ఆలయం వద్దకు 108 అంబులెన్స్ చేరుకున్నట్టు చెబుతున్నారు.
ఇలా జరుగుతుందని ఊహించలేదు..
కాశీబుగ్గ ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్‌పండా కన్నీరుమున్నీరయ్యారు.
ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు. మామూలుగా ఆలయానికి రెండు వేల మంది వరకు భక్తులు వస్తుంటారని, ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని ఊహించలేదని వివరణ ఇచ్చారు. ‘ భక్తులకు ప్రసాద వితరణ చేసి పంపిస్తాను. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇంత మంది వస్తారని తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వలేదు’ అని అన్నారు.
ఆలయంలోనే హరిముకుంద్ పండాతో కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. ప్రస్తుతం ఆలయ పరిసరాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆలయ ఆవరణలోనే హరిముకుంద్‌పండా కూడా ఉన్నారు.
Next Story

