
డైరెక్టర్ రాంగోపాల్ వర్మకి మరోషాక్
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినీదర్శకుడు రాం గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాకు ఇచ్చిన 2.5 కోట్ల రూపాయల డబ్బుల్ని వెనక్కి ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రముఖ సినీదర్శకుడు రాం గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాకు ఇచ్చిన 2.5 కోట్ల రూపాయల డబ్బుల్ని వెనక్కి ఇవ్వాలని నోటీసులు ఇచ్చినట్టు ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి చెప్పారు. "వ్యూహం సినిమాను ఫైబర్‌నెట్ ద్వారా ప్రసారం చేసే విషయంలో ఒప్పందానికి విరుద్ధంగా చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని రాంగోపాల్‌వర్మకు నోటీసు ఇచ్చాం. దీనిపై 15 రోజుల్లోగా స్పందించకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. నేను ఫిర్యాదు తయారుచేసి పంపినా అధికారులు ఎందుకు సంతకం చేయట్లేదు?" అని ఆయన ప్రశ్నించారు.
ఏపీ ఫైబర్‌నెట్ సంస్థ ఎండీ దినేష్‌కుమార్, కొందరు అధికారులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని జీవీ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కు కావడం ద్వారా సంస్థ ఆర్థిక మూలాలు దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఈ అంశాలను అడ్వొకేట్ జనరల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు.
‘కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలైనా సంస్థలో పురోగతి లేకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. ఛైర్మన్‌గా నేను సంస్కరణలు తీసుకొచ్చినా ఆదాయం పెరగలేదు. కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు. ఒక్కరోజైనా దినేష్‌కుమార్ వీటిపై సమీక్షించారా? సంస్థను ఒక్క అడుగూ ముందుకు వెళ్లనివ్వట్లేదు. ఇదంతా ప్రభుత్వంపై జరుగుతున్న కుట్ర. గత ప్రభుత్వంలోని యాజమాన్యంతో చేతులు కలిపి ఫైబర్‌నెట్‌ను చంపేయాలని ఎండీ చూస్తున్నారా?’ అని జీవీ రెడ్డి ఫిబ్రవరి 21న విజయవాడలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆరోపించారు.
ఎండీకి సన్నిహితంగా ఉంటూ.. సంస్థ ఆదాయాన్ని దెబ్బతీసిన ముగ్గురు అధికారులను వెంటనే విధుల నుంచి తప్పించాలని ఛైర్మన్ ఆదేశించారు. ‘సీటీఓ సత్యరామ భరద్వాజ్, బిజినెస్ హెడ్ జి.సురేష్, ప్రొక్యూర్‌మెంట్ విభాగం అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్‌ఖాన్‌ను విధుల నుంచి తప్పిస్తున్నాం’ అని చెప్పారు.
విజిలెన్స్ విచారణకు ఎందుకు సహకరించరు?
గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు ఛైర్మన్ పేర్కొన్నారు. ‘విచారణ అధికారులకు సహకరించాలని సిబ్బందికి ఎండీ ఎందుకు ఆదేశించలేదు? కొందరు వెండర్లకు చెల్లింపులు నిలిపేయాలని విజిలెన్స్ అధికారులు ఆదేశాలిచ్చారు. అయినా రూ.60 కోట్లు ఎందుకు చెల్లించారు?’ అని పేర్కొన్నారు. బుక్స్ ఆఫ్ ఎకౌంట్స్ చూపాలని ఛైర్మన్ హోదాలో అడిగినా అధికారుల్లో స్పందన లేదు. ‘2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికీ ఆడిట్ చేయించలేదు. గత యాజమాన్య అక్రమాలు తెలుస్తాయనే ఇలా చేస్తున్నారా? గత ప్రభుత్వ తీరుతో సంస్థ వార్షిక ఆదాయం రూ.2వేల కోట్ల నుంచి.. గత ఏడాదికి రూ.200 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది ఇంకా ఎంతకు దిగజారుస్తారోనని ఆందోళనగా ఉంది’ అన్నారు.
ఎండీ నుంచి రికవరీ చేయాలని కోరతాం
గత ప్రభుత్వంలో నేతల సిఫార్సుతో నియమితులైన 410 మందిని తొలగించాలని డిసెంబరులోనే నిర్ణయించినట్లు జీవీ రెడ్డి చెప్పారు. ‘ఇప్పటికీ వారిలో ఒక్కరినీ తొలగించలేదు. వారు ఎక్కడ చేస్తున్నారో తెలియకుండానే రూ.1.50 కోట్ల జీతాలు చెల్లించారు. గత యాజమాన్యం జరిపిన అక్రమ నియామకాలను కొనసాగించాల్సిన అవసరం ఏంటి?’ అని ప్రశ్నించారు.
సంస్థ జీఎస్టీ చెల్లింపుల్లో వివాదంపై దర్యాప్తు పూర్తయ్యాక జీఎస్టీ అధికారులు షోకాజ్ నోటీసు ఇస్తే.. సంస్థ తరఫున వకాలత్ వేయలేదు. దీనివల్ల పన్ను, జరిమానాతో కలిసి రూ.377 కోట్లు చెల్లించాలని జీఎస్టీ కార్యాలయం జనవరి 23న నోటీసు ఇచ్చింది. కొందరు అధికారులతో నాకున్న వ్యక్తిగత పరిచయాలతో సమాచారం తెలిసేవరకూ ఎందుకు దాచిపెట్టారు? ఐటీ రిటర్న్‌లను అక్టోబరు నాటికి ఫైల్ చేయాలి. పెనాలిటీతో ఆలస్యంగానైనా వేయించడంతో రూ.9 కోట్లు రిఫండ్ వచ్చిందని జీవీ రెడ్డి చెప్పారు.
Next Story