పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు... గ్రామాల్లో ఆస్తులను సృష్టించేలా వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం గత డిసెంబర్ నెలలో మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్(గ్రామీణ్)- వీబీ జీ రామ్ జీ పథకంపై ప్రజలకు, లబ్దిదారులకు వివరించేలా కార్యాచరణ సిద్దం చేయాలని సీఎం సూచించారు. ఈ మేరకు శనివారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్, జనసేన తరపున మంత్రి కందుల దుర్గేష్ భేటీ అయ్యారు. ఈ భేటీలో జీ రామ్ జీ పథకం అమలు పైనా... ఈ పథకం ద్వారా రాష్ట్రానికి... పేదలకు ఎలాంటి మేలు జరుగుందన్న అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని తెచ్చింది. కొత్త మార్గదర్శకాల ద్వారా గతానికంటే 25 రోజులు ఎక్కువగా పేదలకు ఉపాధి కల్పించే అవకాశం లభించింది. దీంతో పాటు.. రైతులకు, వ్యవసాయ పనులకు ఇబ్బంది లేకుండా చూసేలా నిబంధనలు విధించింది. దీని వల్ల అటు కూలీలకు.. ఇటు రైతులకు మేలు జరిగేలా చూసింది. ఇప్పటి వరకు నరేగా పనుల్లో టీడీపీ హయాంలో మాత్రమే ఆస్తుల కల్పన జరిగింది. నరేగా పనుల్లో భాగంగా సుమారు 25 వేల కిలో మీటర్ల మేర రోడ్లు వేశాం. కానీ గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గ్రామాల్లో ఆస్తుల కల్పనను నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు జీ-రామ్-జీ పథకాన్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా గ్రామాల్లో వివిధ రకాల వసతులు కల్పించవచ్చు. నరేగా పథకంతో పోలిస్తే... జీ-రామ్-జీ స్కీంలో అదనంగా ఇంకొన్ని పనులు చేసుకునే వెసులుబాటు ఉంది. సోలార్ లైటింగ్ సిస్టం ఏర్పాట్లను ఈ స్కీం పరిధిలోకి తెచ్చారు. ఇలాంటి వాటి వల్ల గ్రామాల్లో మౌలిక వసతులు సమకూరుతాయి.”అని సీఎం చెప్పారు.
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలకు అనుగుణంగా
“రాష్ట్రాన్ని 10 సూత్రాల ఆధారంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ దిశగా పని చేస్తోంది. ఇప్పుడు నిర్దేశించుకున్న 10 సూత్రాల అమలుకు జీ-రామ్-జీ స్కీం ఉపయోగపడుతుంది. ఆయా సూత్రాల అమలుకు జీ-రామ్-జీ స్కీంలోని అంశాలు ఏ మేరకు ఉపకరిస్తాయో విశ్లేషించుకుని ప్రణాళికలు రూపొందించాలి. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ పథకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగితే.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయగలుగుతాం. ఈ స్కీంలో భాగంగా గ్రామాల్లో గోకులాలు నిర్మించుకోవచ్చు... ప్లాంటేషన్ చేసుకోవచ్చు... పశు గ్రాసం పండించుకుని ఉపాధి కల్పించవచ్చు. అలాగే ప్రతి ఇంటికి తాగునీరు అందించే జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార వంటి పథకాలను ఈ స్కీంకు అనుసంధానం చేయవచ్చు. పాఠశాలలు, ఆస్పత్రులు, కమ్యూనిటీ సెంటర్లు ఇలాంటి వాటిని నిర్మించుకోవడం లేదా రిపేర్లు చేసుకోవడం వంటి వాటి ద్వారా ఆస్తులను మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇలా ప్రణాళికబద్దంగా వెళ్లడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులను ఈ స్కీం ద్వారా సమకూర్చుకునే అవకాశం ఉంటుంది.. అదే సమయంలో గ్రామ వికాసం సాధ్యమవుతుంది. గ్రామ సభల్లో ఏయే పనులు చేపట్టాలనే అంశంపై ఆమోదం తీసుకోవడం... అలాగే ఏయే రోజుల్లో పనులు చేపట్టాలనే విషయం మీద కూడా గ్రామ సభల్లో చర్చించి... గ్రామస్థుల సూచనలను పరిగణనలోకి తీసుకుని నోటిఫై చేయాలి. అలాగే జీ రామ్ జీ స్కీం కింద ఎలాంటి పనులు చేపడుతున్నామనే విషయాన్ని ఆన్ లైన్లో పొందుపరచాలి. ప్రణాళిక బద్దంగా వికసిత భారత్, స్వర్ణాంధ్ర – 2047 లక్ష్యాలు నెరవేరుతాయి. దీనిపై ఓ పక్క మూడు పార్టీలు ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు అసెంబ్లీలో కూడా చర్చ చేపడతాం. డిప్యూటీ సీఎంతో కూడా మూడు పార్టీలకు చెందిన నేతలు సమావేశమై.. ఆయన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి.”అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఆస్కారం: మంత్రి కందుల దుర్గేష్
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ...”సీఎం చంద్రబాబు 2014-19 మధ్య కాలంలో సీఎంగా ఉన్నప్పుడు ఉపాధి హామీ కింద గ్రామాల్లో ఎన్నో ఆస్తులను సృష్టించగలిగారు. ఇప్పుడు జీ రామ్ జీ పథకం ద్వారా నీటి భద్రత, గ్రామాల్లో మౌలిక వసతులు, జీవనోపాధికి ఆసరాగా నిలవడం, అలాగే వివిధ నిర్మాణాలు చేపట్టవచ్చు. ముఖ్యంగా గ్రామాల్లో, అటవీప్రాంతాల్లో చెక్ డ్యాంల నిర్మాణం ద్వారా నీటి సంరక్షణ, భూగర్బ జలాల వృద్ధి వంటి అంశాలపై ఫోకస్ పెట్టవచ్చు. ఎలాంటి అవినీతికి తావు ఇవ్వకుండా... ఈ పథకం అమలు చేసేలా కేంద్రం రూపొందించిన నిబంధనలు బాగున్నాయి. ఇందులో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు... స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేలా ఈ స్కీంను కేంద్రం రూపొందించింది.”దీనిపై త్వరలో డిప్యూటీ సీఎంతో భేటీ జరుపుతాం. అని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.
అవినీతికి తావు ఇవ్వని విధానం...: మాధవ్
బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ మాట్లాడుతూ...”గ్రామీణ స్థాయిలో ఉపాధి కల్పించే నిమిత్తం కొత్తగా తెచ్చిన జీ రామ్ జీ పథకంలో అవినీతికి తావు లేకుండా పటిష్టమైన వ్యవస్థను తీర్చిదిద్దారు. పూర్తి స్థాయిలో సాంకేతికతను వినియోగిస్తూ.. పథకాన్ని కేంద్రం రూపొందించింది. జియో రిఫరెన్స్ తో పాటు బయో మెట్రిక్ జియో స్పేషియల్ టెక్నాలజీ ద్వారా పథకాన్ని పర్యవేక్షించే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా ఉపాధి శ్రామికులకు దినసరి వేతనాల చెల్లింపుల్లో కూడా జాప్యం జరగదు. ఈ పథకం ద్వారా ఉపాధితో పాటు.. ఆస్తుల కల్పనకు పెద్ద ఎత్తున ప్రాధాన్యతిచ్చే దిశగా కేంద్రం పని చేస్తోంది. పీఎం గతి శక్తితో అనుసంధానం ద్వారా అందరికి అభివృద్ధి ఫలాలు అందేలా కేంద్రం జాగ్రత్తలు తీసుకుని ఈ పథకాన్ని రూపొందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఈ పథకం ఏపీలో సమర్థవంతంగా అమలు అవుతుంది. అవకాశాలను అందిపుచ్చుకునే నాయకత్వం ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉంది. కాబట్టి...ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.”అని మాధవ్ చెప్పారు. ఈ సమావేశంలో కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకంలోని అంశాలను పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. అలాగే నరేగా పథకంలో కవర్ కాని కొన్ని అంశాలను జీ రామ్ జీ పథకంలో కవర్ చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.