
ఐక్యూ,ఈక్యూలే కాదు టీక్యూ కూడా తప్పనిసరి
సీఎం చంద్రబాబు 75ఏళ్ల వయసులో కూడా 25 కుర్రాడిలా పని చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఐక్యూ, ఈక్యూలు మంచివే కానీ టీక్యూ(టెక్ కోషెంట్) కూడా ప్రస్తుతం రోజుల్లో తప్పనిసరి అని మంత్రి నారా లోకేష్ అన్నారు. గుంటూరు బండ్లమూడి గార్డెన్స్‌లో ఐసీఏఐ గుంటూరు చాప్టర్ అధ్వర్యంలో ‘స్పూర్తి’ పేరుతో నిర్వహించిన మెగా సీఏ విద్యార్థుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటింట్స్ ఆఫ్ ఇండియా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ పవర్‌హౌస్ అని అన్నారు.
జనవరిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్ కాంప్యూటింగ్ మొదలు కాబోందన్నారు. ఇది సౌత్ ఇండియాలోనే మొదటిదని పేర్కొన్నారు. గతంలో అనేక వినూత్న కార్యక్రమాలతో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రపటాన్ని మార్చేసిన సీఎం చంద్రబాబు తాజాగా క్వాంటమ్ వ్యాలీతో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు మార్చబోతున్నారని లోకేష్ వెల్లడించారు. తాము మార్పు కోసం వేచి చూడటం లేదని, మార్పు కోసం శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల కోసం పోటీపడుతున్నట్లు చెప్పారు. కర్నూలు డ్రోన్ సిటీ, కడపలో స్టీల్‌ప్లాంట్, విశాఖలో ఏఎన్‌ఎస్‌ఆర్, సత్య జీసీసీతో పాటు ఆర్సెలర్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుతో అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. తయారీ రంగం, పవర్, ఐటీ, ఫార్మా.. ఇలా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రథమ స్థానంలో నిలపాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని, ఆ దిశగా పనులు చేస్తున్నట్లు తెలిపారు.
యువత రాజకీయాల్లోకి రావాలని లోకేష్ సూచించారు. యువతను, విద్యావంతులను తమ తెలుగుదేశం పార్టీ ప్రోత్సహిస్తోందన్నారు. పదునుగా, పదునుగా ఉంటూ నైతికతను కలిగి ఉండి లక్ష్య సాధనపై దృష్టి సారించాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. సీఏ అనేది కేవలం ఒక మైలురాయి కాదని, సీఏ అనేది జీవితానికి ఒక మణిహారం వంటిందన్నారు. సీఏలు భారత దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటి వారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన విధానల రూపకల్పనలో భాగస్వాములు కావాలని సీఏలకు పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు 75ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రాడిలా ఏపీ అభివృద్ధి కోసం పని చేస్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు.
Next Story